కాకతీయ శిల్పాల మర్మం తెలిసిన పరిశోధకుడు, కొన్ని జ్ఞాపకాలు
ఓరుగల్లు, బమ్మెర పోతన, పాలకుర్తి సోమన్న, ఏకశిలా నగరం, వరంగల్లు, వేయిస్థంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప, గణపురం అని పేర్లు వింటూనే ఏదో అనుభూతి. చిన్నతనంలో రెండుమూడు నెలలకోసారి వరంగల్లు కోటకు మేం వెళ్లేది. అక్కడ ఖుష్ మహల్ లో ఉన్న ప్రతాప రుద్రుడి శిల్పం చూసే వాడిని. అక్కడ తురుష్కులు విధ్వంసం చేసినవి దారుణం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. మనం ఇవాళ ప్రముఖంగా చూసే ప్రతాపరుద్రుడి తల చిత్రం గీసింది కీర్తిశేషులు దెందుకూరి సోమేశ్వరరావు. ఆయనే మా గురువు, 1972-73లో ఏవివి కాలేజిలో ప్రిన్సిపాల్ సోమేశ్వరరావు. ఆయన బహుముఖ ప్రజ్ఞను ఈ తరానికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ పరిశోధకుడు నిద్ర లేవగానే సైకిల్ తొక్కుతూ బయలుదేరడం, సమీపంలో ఉన్న ఒక్కో దేవాలయానికి చేరి, శిల్పాలను నిశితంగా తెలుసుకోవడం. చరిత్ర చదవడం, ఆ ఏకశిలల గుడి వెనుకల కథలను కూడా వివరించడం ఆయన పని. పద్మాక్షమ్మ గుట్టతో పద్మాక్షుడు, జైన తీర్థంకరులు, సిద్ధులు, సిద్ధేశ్వరుడి శిల్పంతో ఆయన అధ్యయనం మొదలయింది. తరువాత వెయ్యిస్తంభాల ఎదురుగా ఉన్న నాట్యమండపాన్ని చూసి రుద్రదేవుడి శాసనాన్నీ చదివే ప్రయత్నం చేసారు.
పదవీ విరమణం తరువాత పూర్తి సమయాన్ని ఆయన కాకతీయుల చరిత్ర నిరంతరం అధ్యయన సాగించిన పరిశోధకుడు, మా గురువులకే గురువు మా ప్రియమైన ప్రిన్సిపాల్ సోమేశ్వరరావుగారు గారి శతజయంతి 2024 మే 31 నుంచి మొదలవుతుంది. నేను (ఈ రచయిత) ఆంధ్రవిద్యాభివర్థనీ కాలేజ్ లో (1971-72 మధ్య) చదువుకున్నాను, అప్పట్లో ఇంకా లాగూలు, అంగీలు, లుంగీలు నిక్కర్లు వేసుకునే స్కూల్ విద్యార్థిని. అప్పడికి ఇంకా పాంట్ షర్ట్ తెలియని దశ.
మా నాన్నగారు జనధర్మ వరంగల్ వాణి పత్రికల సంపాదకుడు స్వాతంత్ర్య సమర యోధుడు, ఎం ఎస్ ఆచార్యగారు నన్ను అక్కడ చేర్పించారు. అంతకుముందు వరంగల్లు గిర్మాజీపేట మాసూమ్ అలీ హై స్కూల్ లో రెండో తరగతినుంచి 10 తరగతిదాకా చదువుకున్నాను. ప్రముఖ శ్రేష్టి చందాకాంతయ్య గారు నెలకొల్పిన విద్యాసంస్థ ఆంధ్ర విద్యాభివర్ధనీ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజి, ఆ తరువాత చందాకాంతయ్యగారి విరాళాల వల్లనే సి కె ఎం కాలేజ్ ని కూడా లక్షల మందిని విద్యావంతులుగా వెలుగుతున్నారు(కళాశాలఉన్న ఈ చోటనే, విశ్వనాథ సత్యనారాయణ వంటి ఎందరోమహానుభావులు ప్రసంగించారు.)
మాకు మా ప్రిన్సిపాల్ అంటే గౌరవంతో కూడిన భయం. అయినా ప్రిన్సిపాల్ గారితో మాట్లాడేందుకు ధైర్యంచేసేవాడిని. ఎవివి కాలేజ్ చుట్టూ తరగతి గదులు, రెండు అంతస్తులలో ఉంటాయి, ఆ మధ్యలో విద్యార్థులంతా నిలబడి ఉండే వాళ్లం అక్కడ వేదికమీద పెద్దలు మాట్లాడే వారు. అక్కడ ఉపన్యాసాలు వినేవాళ్లను. మా ప్రిన్సిపాల్ గారు ప్రతి ప్రధానమైన దేశ నాయకుల గురించి మాట్లాడుతూ ఉండేవారు. కొన్ని సందర్భాలలో, అక్కడే కుర్చీలు తయారు ఏర్పాటు చేసి, ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ప్రముఖులు ముఖ్యఅతిధులు ప్రసంగించేవారు, విద్యార్థులు వినేవారు.
అందులో ఆ విధంగా మేం స్వర్గీయులు కె ఎం మున్షీ గురించి విన్నాం. భారత రాజ్యాంగం రచించే మహానుభావులలో ఒకరు మున్షీ గారికి సంతాప సభ ఏర్పాటుచేసారు. మా ప్రిన్సిపాల్, తదితర ప్రసంగాలుచేసిన వారు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అప్పడికి నాకు ఆయన గురించి ఏమీ తెలియదు. వారి మాటలు విన్నపుడు మున్షీ గురించి కొంత తెలుసుకోగలిగాను. అందరి ప్రసంగాలు అయిపోయిన తరువాత మా ప్రిన్సిపాల్ గారు ‘‘ఒకరైనా ఒక విద్యార్థి కూడా మాట్లాడడం బాగుంటుంది..’’ అని వదిలేసారు. నేను మాట్లాడే ధైర్యం చేయలేదు. ‘‘శ్రీధర్ మాట్లాడవచ్చు కదా’’ ఆయన అన్నారు, ఇప్పుడు తప్పక మాట్లాడాల్సిందే, అంటే ఆదేశమే కదా. రమ్మని సార్ పిలుస్తుంటే కాదనడం సాధ్యమా? ఇంటర్మీడియట్ లో నాకు వేదికమీద మాట్లాడడం మొదటి సారి. మున్షీ గారితో గురించి అంతకుముందే విన్న, జ్ఞాపకానికి వచ్చిన కొన్నిపదాలు ఏరుకొని, నాలుగు వాక్యాలు చెప్పి, మనమంతా ఇంతటి గొప్పవారి ఆదర్శం గా మావంటి వాళ్లంతా గుర్తుచేసుకోవాలని అంటూ ముగించాను. దానికే చప్పట్లు. ఆశ్చర్యమేమంటే 1973న విన్న ప్రసంగం ఈ మధ్య భారతరాజ్యాంగ పీఠిక అనే పుస్తకంలో నేను మున్షీ ఫోటోతో వివరాలతో రాయవలసి రావడం ఒక ఆశ్చర్యం.
ఆ తరువాత ఏవివి కళాశాలలో జరిగిన మున్షీ సంతాప సభ వార్తను జనధర్మ పత్రికలో ఒక ‘విద్యార్థి శ్రీధర్ కూడా మాట్లాడారు’ అని ప్రింట్ కావడం బహుశా నా తొలి వార్త అనుకుంటాను. కొన్నాళ్ల తరువాత మా ప్రిన్సిపాల్ సోమేశ్వరరావుగారు మానాన్న కలిసినపుడు, ‘మీ వాడు ధైర్యంగానే మాట్లాడినాడు తెలుసా’ అన్నారు. ‘అవునా నయమే’ అన్నారు. ‘మరి మీ ధైర్యంలో కొంతైనా వచ్చింది కదా’ అని అన్నారని చెప్పడం మరో గొప్ప ఉత్సాహం లభించింది.
మా ప్రిన్సిపాల్ తో ఎన్టీఆర్
మాతో పాటు సోమేశ్వరావుగారు విజ్ఞాన వినోదాలలో అందరినీ అవకాశం ఇచ్చేందుకు దాదాపు పదిరోజుల కార్యక్రమంతో ఒక బస్సులొ వారితో లెక్చరర్ శ్రీ టి ఎ రామారావ్ కలిసి ఎక్స్ కర్షన్ మద్రాస్ కు వెళ్లాం. ఎన్ టి ఆర్ ను మేం చాలా దగ్గరనుంచి చూసే అవకాశం రావడం గొప్ప అనుకునే వాడిని. (కాని ఆ తరువాత నేను దాదాపు రోజూ ఎన్ టి ఆర్ తో జర్నలిస్టుగా ఇంటర్వ్యూ చేయడం, అనేక సందర్భాలలో కూడా విలేఖరుల సమావేశాలకు వెళ్లేవాడిని, ఎన్టీఆర్ మరణం తెలియగానే, దురదృష్టం, మొదట హైదరాబాద్ లో రిపోర్ట్ చేయడానికి తెలవారు ఝామున వారి ఇంటికి నేను చేరుకున్నాను! ఆయనతో సోమేశ్వరరావుగారితో ఉన్న లెక్చరర్ గారు చాలా ఉత్సాహంగా ‘నేను ఎన్ టి ఆర్ గారూ నా పేరు టి ఎ రామారావ్’’ గారిని అని చెప్పడం మా అందరికీ జ్ఞాపకం. ఆయన నవ్వుతూ ఉండేవారు.
ఎన్టీఆర్ కొంత ఎత్తున నిలబడి, ఎదురుగా ఉన్న ఎవివి కాలేజీ విద్యార్థులతో కొన్ని నిమిషాలు మాట్లాడారు. అప్పుడు తల్లా పెళ్లామా అనే సినిమాని నిర్మిస్తున్నానని, ఆయన కుమారుడు హరికృష్ణ ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నారనీ, గోవర్థనుడి పర్వతాన్ని చిటికెన వేలితో ఎత్తిన దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారని చెప్పారు. స్టూడియో లో మహానటి సావిత్రిని కూడా చూసాం. వరంగల్లు నుంచి మద్రాస్ వెళ్లే దారిలో అనేక కంచితోపాటు అనేక గుడులు గోపురాలు చూసుకున్నాం. ఆ విశేషాలు వివరించే చిన్నవ్యాసాన్ని ఎవివి కళాశాల మాగెజైన్ లో రచించాను. ‘వినతా సుత వాహనుడై వెడలెను కాంచి వరదుడు...వనజాసనాది సురులు...సనకాది మునులు కొలువ (వినతా) వినతా సుత వాహను, లేదా "పవమాన సుతుడు పట్టు పాదరవిందములకు నిత్య జయ మంగళం’, అని కీర్తనలు వింటూ ఉంటారు. అందులో ‘కంచీ వరదుడు గరుడవాహనుడైన’ అనే కీర్తన ప్రస్తావన చేసాను. ‘వరదరాజ! నినుఁ గోరి వచ్చితి మ్రొక్కేరా వ.. వర త్యాగరాజనుత గరుడసేవఁ జూడ వరదురాజ’ అని కీర్తన సుప్రసిద్ధమైంది.
ప్రిన్సిపాల్ గారి వ్యంగ్యం
ప్రిన్సిపాల్ సోమేశ్వరరావుగారిని, ఎం ఎస్ ఆచార్య గారు ఎడిటర్ అనేక సందర్భాలలో కలిసేవారు. విద్యార్థిగా నా గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. మద్రాస్ యాత్రకు వెళ్లడానికి అమ్మ వద్దనే వారు. ఈ యాత్రకు ఆచార్య అసలు ఒప్పుకోరు. మరీ వెంటబడితే చల్లని గాలులు ఉంటాయి అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు. మొత్తానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు నన్ను విమర్శిస్తూ ‘మీ వాడు మొత్తం మీద, సూట్ వదలకుండా చివరిదాకా...’ అని సోమేశ్వరరావుగారు ప్రిన్సిపాల్ గారు మరో వ్యంగ్యాన్ని విసిరారు.
కాలేజ్ లో యువ కవి సమ్మేళనం
ఓ సందర్భంలో నేను ఏవివి కళాశాలలో జరిగే కవి సమ్మేళనంలో కూడా పాల్గోనేవాడిని. ‘‘శ్రీధర్ పాల్గొంటున్నావు కదా ప్రిన్సిపాల్ గారు అన్నారు’’ అంటే ‘‘ఓహో నేను కవిసమ్మేళనంలో కూడా కవిత వినిపించాలని కూడా అన్నమాట అనుకున్నాను. నిజానికి నాకు అప్పటి దాకా కవిత రాయడం రాదు. ఆ విధంగా స్పూర్తి లభించింది సోమేశ్వరరావుగారే. కొందరు బంధువులతో చర్చించాను. నకల్ (కాపీ) చేయడానికి కూడా అకల్ (తెలివి) ఉండాలని నేను చెప్పిన కవిత ప్రిన్సిపాల్ ఓహోహో అనడం విన్నాను. ఉర్దూ పదాలతో కూడిన ఆ కవితను నేను వినిపించడం, నకల్, అఖల్ అన అంశాలమీద అనడం వినగానే విద్యార్థులు ఒకేసారి గొల్లుగొల్లున నవ్వుతూ, అరవడం గమనించాను. ఇంతకూ నేనేమన్నాను, ఎందుకీ విధంగా అంటున్నారు అని కాసేపు ఆశ్చర్యపడ్డాను.
విద్యార్థుల సంఘం ఎన్నికలలో పాల్గొన్నాను. అప్పడికి నేను ప్రింటింగ్ ప్రెస్ లో దాదాపు మొత్తంగా పనులన్నీ నేర్చుకున్నాను. కేవలం ఎన్నికలలో పాల్గొనడానికి కారణం నాకు రకరకాల ఎన్నికల కరపత్రాలను తయారు చేయడంలో నాకు ఖర్చులుండవు. సైకిల్ మీద ప్రింట్ చేసిన పేపర్లన్నీ పట్టుకుని తిరిగే వాణ్ని. ఓ సారి పేపర్లన్నీ కిందపడిపోయినాయి. ఎన్నో గాలికి ఎగిరిపోయాయి. నేను పోటీచేయడం, గెలవడం, నాకూ ఏమీ తెలియదు, కనుక ఓడిపోయాను కూడా.
ఏవివి కాలేజ్ లో క్లాస్ లో లెక్చరర్లు చాలా బాగా పాఠాలు చెప్పేవారు. లెక్క పాఠాలను శ్రీ బాలసుబ్రమణ్యం సార్ చాలా వేగంగా చెప్పేవారు. చాక్ పీస్ ముక్కలు చేసి విరిసి ‘ఎక్కడ చూస్తున్నావ్’ అనే వారు. చదువుగురించి చాలా అభిమానంగా చూసుకునే వారు. మా క్లాస్ లో అళహసింగాచారి నా మంచి మిత్రుడు. ఆయన చాలా బుద్దిగా చదువుకునే వాడిని. నేను చదువు అంతగా చదివేవాడిని కాదు. (ఆయన సుప్రసిద్ధ ప్రొఫెసర్ గా కాకతీయ యూనివర్సిటీ లో పనిచేసి రిటైర్ అయ్యారు అళహ సింగాచారి. నిరుడు అళహసింగాచారి హటాత్తుగా పరమపదించారని తెలిసింది, నా నివాళులు) నా పనులు వేరు, చాలా సార్లు కవితలు, వక్తృత్వ, వ్యాస రచనలలో, పాల్గొనేవాడిని. ప్రింటింగ్ పనులతో బిజీ గా ఉండడంవల్ల చదువులు పెద్దగా మార్కులు వచ్చేవి కాదు.
అధ్యయన శీలి
శ్రీ సోమేశ్వరరావుగారి కళలు, పెయింటింగ్, శిల్ప అధ్యయనం పరిశోధన గురించి నాకు అంతకుముందు తెలియదు. కాని జనధర్మ పత్రికవ్యవహారాలతో, వార్తలు రాయడంలో మునిగేవాడిని కనుక మళ్లీ సోమేశ్వరరావుగారితో కలిసే వాడిని. ఆ రోజులు వారితో చూస్తే చాలు, సెటైర్లు కొట్టేవారు. అందులో సెటైర్ వేయడంలో వారి నేర్పరి అని నేను చెబితే మాకేం తెలుసు అనేవారు. ప్రొఫెసర్ చకిలం మధుసూదన రావు గారితో లా కాలేజిలో చదువుచేసుకునే వాడిని. నాకు రాజ్యాంగం గురించి చెప్పేవారు. సెంట్రల్ ఇనఫర్మేషన్ పదవి వచ్చిన తరువాత మధుసూదన్ రావు గారినీ, పక్కనే సోమేశ్వరరావుగారిని నమస్కరించి, పాత ముచ్చట్లు చెప్పుకునే భాగ్యం లభించింది.
అధ్యాపకుడు అంటే సంపూర్ణంగా అధ్యాపకులే, లేదా ప్రధాన ఉపాధ్యాయుడు అంటే సోమేశ్వరరావుగారే. వారు అసామాన్యుడు, లోతైన పరిశోధకుడు, కళాకారుడు, చిత్రలేఖన నిపుణుడు, కాకతీయ శిల్పాలను సునిశితంగా పరిశీలించిన పరిశోధకుడు ఆయన అని ఆ తరువాత తెలిసింది.
ప్రతాపరుద్రుడి రూపానికి ఆయనే ప్రాణం పోసినవాడు. బమ్మెర పోతనకు తొలి సారి రూపాన్ని అందించిన గొప్ప చిత్రకారుడు సోమేశ్వరరావు. బమ్మెర పోతనకు ఒక రూపాన్నంటూ తొలుత ఇచ్చింది సోమేశ్వరరావే. ఆ తరువాతే కొండపల్లి శేషగిరిరావు పోతన చిత్రాన్ని వేశారు. సోమేశ్వరరావు వేసిన చిత్రం ప్రస్తుతం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో ఉన్నది. వరంగల్ లో ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ యూనివర్సిటీ అధికారిక ముద్ర(సింబల్)ను రూపొందించింది కూడా ఈయనే. ఆ యూనివర్సిటీలోని ఆంగ్ల శాఖ కోసమంటూ ప్రఖ్యాత రచయిత షేక్ స్పియర్ లైఫ్ సైజ్ చిత్రాన్ని గీసి బహుమతిగా సమర్పించిన వారు.
స్వర్గీయులు దెందుకూరి సోమేశ్వరరావు శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కానీ, సమాజం కానీ ఆయనకు ఇవ్వాల్సినంత గుర్తింపు ఇవ్వలేదని మా విచారం. కాకతీయుల చరిత్రను గురించి ఆయన చేసిన పరిశోధన బహుశా చరిత్రకారులు ఎవరూ కూడా చేయలేదేమో. కాకతీయ సంచికను వెలువరించిన మారేమండ రామారావు కానీ, ఓరుగల్లు చుట్టు పక్కల శాసన పరిశోధన చేసి అనేక శాసనాలను డీకోడ్ చేసిన దూపాటి వెంకటరమణాచార్యులు కానీ సోమేశ్వరరావు వెళ్లినంత లోతుగా కాకతీయుల చరిత్రలోకి వెళ్లలేదేమో. ఖిలా వరంగల్ లో కొంగు కప్పుకొని ఉన్న స్త్రీ రూపాన్ని ఆలోచించారు. అప్పుడప్పుడే ముస్లిం రాజుల ప్రవేశం జరుగుతున్న కాలంలో స్త్రీలకు పరదా పద్ధతి రావటానికి సంకేతంగా ఆ శిల్పాన్ని సోమేశ్వరరావుగారు వర్ణించారు. నాట్యంలోని వేగంగా జరిగే కదలికలను కాకతీయ శిల్పులు, శిల్పీకరించడాన్ని వాటి పద్ధతిలను ఆయన రికార్డు చేశారు. వరంగల్ కాకతి విగ్రహాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా పరిశోధన చేశారు. అది ప్రస్తుతం హైదరాబాద్ లోని నల్లకుంటలో ఒకరి ఇంట్లో ఉన్నదని కొందరు అనుమానిస్తున్నారు. ఈ కాకతి అమ్మవారికి ముంగిస వాహనంగా ఉన్నదని కూడా చెప్పారని సోమేశ్వరరావు వివరించారు. ఆ అనేక విశేషాలను సోమేశ్వరరావుగారి కుటుంబ సభ్యులు, జర్నలిస్టు కోవెల సంతోష్ చెప్పారు.
ఇంటాక్ అయినా, సర్వే ఆఫ్ ఇండియా అయినా, శాసన కర్తలైన రాధాకృష్ణమూర్తి, పీవీ పరబ్రహ్మశాస్త్రి, జానపదపు పరిశోధకుడు ప్రొఫెసర్ శ్రీ బి రామరాజు, ఎందరెందరో కాకతీయులను అధ్యయనం చేయాలంటే ముందుగా మాట్లాడాల్సింది సోమేశ్వరరావుతోనే అని సంతోష్ వివరించారు.
వరంగల్ కోటలో, ఆ కోట ఏ విధంగా నిర్మించారు రాతి కోట, మట్టికోట మొత్తం ఏడు కోటల ప్రహరీలు, మధ్యలో కాకతీయ రాజమందిరం, ఖుష్ మహల్, ఆ పక్కనే ఉన్న స్వయంభూ శంభుని గుడి అందులోని ఏకశిల శివలింగం, నంది, తరువాత కోట గోడలు, తోరణాలు, దర్వాజాలు, నిర్మాణ విభేదాలు, వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామంలో అభివర్ణించిన వరంగల్లు మహా నగర రూపురేఖలు సోమేశ్వరరావుగారు పరిశోధించి వెలికి తీసారు. కోటకు ఇవతల కరీమాబాద్, రంగశాయిపేట ఇదివరకు కోటలో భాగంగానే ఉండేవని సోమేశ్వరరావుగారు చెప్పారు. ప్రత్యేకంగా రాశారు. వేయిస్తంభాల గుడి నిర్మాణంలోని శాండ్ టెక్నాలజీని మొదట గుర్తించింది కూడా సోమేశ్వరరావే. గుడిలోని నాట్యమండపం ఒక పక్క ఒరిగిపోతున్నప్పుడు దాన్ని తొలగించి తిరిగి నిలబెట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ఇంటాక్, వరంగల్ ఆర్ఈసీ (ఇప్పుడు నిట్) ఇంజనీర్లను సంప్రదించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కాని ఈ ప్రయత్నాన్ని సోమేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఈ మధ్యకాలంలో కొన్ని అద్భుత శిల్పాలున్న స్తంభాలు మాయమైపోయాయి. చివరకు కొత్తగా రాళ్లు తెప్పించి, వాటితో కొన్ని స్తంభాలు, శ్లాబులు తయారు చేసి మొత్తం మీద పూర్తయిందనిపించారు. అంతకుముందు జాకారం దగ్గర మరో కాకతీయుల గుడిని కూడా విడదీసి పెట్టారు. రెండు దశాబ్దాలైనా సరే దాని పునర్నిర్మాణం ఊసే లేకుండా పోయింది’’ అని సంతోష్ వివరించారు.
వరంగల్లులోని కొండపర్తి గ్రామంలోని గుట్టపైన ఏడెనిమిది అడుగుల ఎత్తైన ఒక రాజు విగ్రహం ఉండేది. తలకు పాగా చుట్టుకొని అద్భుతంగా నిలబడి ఉన్న ఈ విగ్రహాన్ని వరంగల్ మ్యూజియంకు తరలించాలనుకుంటే సోమేశ్వరరావు అడ్డుకొన్నారు. తరలిద్దామనుకున్నారు. కాని నడుము భాగంలో విగ్రహం రెండుగా విరిగిపోయింది. ఆ ముక్కలనే తీసుకొచ్చి మ్యూజియంలో ఉంచారని సోమేశ్వరరావుగారు చెప్పేవారని, ఇవాళ మ్యూజియంకు వచ్చేవారు లేరు. కొండపర్తి ప్రాధాన్యమూ పోయిందని సంతోష్ చెప్పారు.
నృసింహ కవిగారి ప్రేమాకావ్యం ‘సిద్ధోద్వాహము’
వరంగల్ ఉర్సు గుట్టపై ఒక శాసనం ఉన్నది. నృసింహ కవి అనే ఆయన ఈ రాతిపై ఏకంగా ఒక కావ్యాన్నే రచించారు. పీవీ పరబ్రహ్మశాస్త్రి దాన్ని సిద్ధోద్వాహము అన్న పేరుతో ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇది గొప్ప ప్రేమకావ్యము. కాళిదాసు మేఘసందేశం స్థాయికి చెందినదని సాహిత్యకారులు చెప్తుంటారు. ఈ శాసనాన్ని అధ్యయనం చేసేందుకు సోమేశ్వరరావు తన విద్యార్థులను సైకిల్ పై ఎక్కించి తీసుకొని వెళ్లి దాని ప్రాశస్త్యాన్ని చెప్పి మరీ పరిశోధనకు ప్రోత్సహించారు.
కాకతీయ శిల్ప మర్మయోగి:
రామప్ప దేవాలయానికి సంబంధించి రెండు అడుగుల పొడవైన తేలికపాటి ఇటుకలను సేకరించి వాటి ప్రాధాన్యాన్నిగుర్తించి, నీటిమీద తేలియాడేంత తేలికైన ఇటుకల టెక్నాలజీని సోమేశ్వరరావు అధ్యయనం చేశారు. వీటిని తాము పరిశోధించి పరిశీలిస్తామని ఆనాటి ఆర్ఈసీ పరిశోధకులు చేసారని సంతోష్ వివరించారు. ఆయనను మరిచిపోతే చరిత్రం మిమ్మల్ని క్షమించబోరు అని అర్థం చేసుకోవాలి. చాలామంది మంచి టీచర్లు ఉండడం తెలుసు. కాని కనిపించే శిల్పం వెనుక కథను, చరిత్రను లోతుగా పరిశీలించడం పరిశోధించడం చాలామందికీ తెలియదు. కాకతీయ శిల్పాలు, ప్రతాపరుద్రుడి శిరస్సు చిత్రం, బమ్మెర పోతన పెయింటింగ్ వలె కీర్తిశేషులు సోమేశ్వరరావుగారు ప్రిన్సిపాల్ జ్ఞాపకాలు నూరేళ్లు దాటినా ఉంటూనే ఉంటాయి.