
తెలంగాణలో ముదురుతోన్న ‘మార్వాడీ గో బ్యాక్ ' నినాదం
రేపు అమన్ గల్ బంద్ కు పిలుపునిచ్చిన వర్తక వాణిజ్య సంఘాలు
ఉద్యమాలకు పురిటి గడ్డ తెలంగాణలో మరో ఉద్యమం పురుడుపోసుకుంటుందా? మార్వాడీ గో బ్యాక్(Marwadi go back) ఉద్యమం ముదురుతోంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ వివాదం సోమవారం రంగారెడ్డి జిల్లా అమన్ గల్ బంద్ కు దారి తీసింది. ఈ వివాదం కాస్త ఇపుడు రాజకీయ రంగు పులుముకుంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మార్వాడీలకు మద్దత్తుగా నిలబడితే బిఆర్ఎస్ మాత్రం ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.కానీ ఆ పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పదిస్తూ ‘‘ఇది కాంగ్రెస్, బిజెపి కలిసి ఆడుతున్న నాటకం’’ అని అన్నారు.
దశాబ్దాల క్రితమే రాజస్థాన్ నుంచి వచ్చిన తమ పరిస్థితి ఏమిటని మార్వాడీలు ప్రశ్నిస్తున్నారు. తక్కువ ధరకు, నాణ్యమైన సరుకును విక్రయించడం తప్పా అని మార్వాడీ వ్యాపారులు నిలదీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలకు మార్వాడీలను బలి చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఆగస్టు 18న అమన్ గల్ బంద్ కు వర్తక, వాణిజ్య సంఘాలు పిలుపునివ్వడం తెలంగాణలో కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటికే అమన్ గల్ లో బంద్ కు పిలుపునిస్తూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి.
తెలంగాణలో అన్ని ప్రాంతాలకు మార్వాడీ వ్యాపారులు విస్తరిస్తూ తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారనేది స్థానిక వ్యాపారుల ప్రధాన డిమాండ్. మార్వాడీల రాకతో స్థానికులకు ఉపాధి అవకాశాలు తగ్గాయని వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా వారి ప్రాంతానికి చెందిన వారినే పనిలో పెట్టుకుంటున్నారని వాళ్లు అంటున్నారు.
మోండా మార్కెట్ లో ఇలా ప్రారంభమైంది
సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఇటీవలె దళిత యువకుడిపై స్థానిక మార్వాడీ వ్యాపారులు దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.పార్కింగ్ విషయంలో దళిత యువకుడిపై దాడి చేసిన మార్వాడీలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి ఈ వివాదం మరింత ముదిరింది. ఈ ఘటనపై స్పందించిన రచయిత, గాయకుడు గోరేటి రమేష్ మార్వాడీల దోపిడిని వివరిస్తూ పాటపాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పాట కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. గోరేటి రమేష్ స్పూర్తితో కొన్ని గ్రూపులు మార్వాడీ షాపుల్లో ఎవరూ కొనుగోలు చేయకూడదని ప్రచారం చేస్తున్నాయి. ఈ పాట ద్వారా గోరేటి రమేష్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మార్వాడీల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నిప్పు రాజుకుని ఇపుడు అమన్ గల్ బంద్ కు దారి తీసింది.
కొరియర్ వచ్చిందని ఫోన్ చేశారు: గోరటి రమేష్
‘‘ కొరియర్ వచ్చింది అని ఎస్ఓటి పోలీసులు ఫోన్ చేసి తనను ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు’’ అని గాయకుడు గోరటి రమేష్ ‘‘ఫెడరల్ తెలంగాణ’’తో అన్నారు. తెలంగాణ అంటే పాట పాట అంటే తెలంగాణ అని రమేష్ అన్నారు. ‘‘పాట ఒక పల్లవి మాత్రమే పాడితేనే అరెస్ట్ చేయడం చట్టవిరుద్దం. నాంపల్లి పోలీస్ స్టేషన్ లో తనకు వ్యక్తిగత బెయిల్ ఇస్తూ ఇక నుంచి మార్వాడీలకు వ్యతిరేకంగా పాడొద్దని పోలీసులు హెచ్చరించారు’’ అని గోరటి రమేష్ చెప్పారు. ‘‘భావ ప్రకటనా స్వేచ్చ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు ’’ అని ఆయన అన్నారు.
హిందువులను చీల్చే కుట్ర: బండి సంజయ్
‘‘కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్ట్ వంటి రాజకీయ పార్టీలు హిందువులను చీల్చే కుట్ర చేస్తున్నాయి’’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ‘‘మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటే తప్పేమిటి, వాళ్లు ఎవరినీ దోచుకోవడం లేదు’’ అని ఆయన అన్నారు. మార్వాడీలు ఏ నాడు రాజకీయ పదవుల కోసం ప్రాకులాడలేదని, వ్యాపారాలు చేసుకుంటూ తెలంగాణలో సంపద సృష్టిస్తున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు. డ్రై క్లీనింగ్ , మటన్ షాపులు నిర్వహిస్తున్న ఒక వర్గం కుల వృత్తులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం’’ అని ఆయన అన్నారు. ‘‘బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన రోహ్యింగాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తాం’’ అని బండి సంజయ్ అన్నారు.
ఇదే విషయమై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ‘‘తెలంగాణలో పుట్టి పెరిగిన మార్వాడీలను వెళ్లిపొమ్మనడం సరైన చర్య కాదు, ఎక్కడో జరిగిన గొడవకు మార్వాడీలను బలి చేయడం అన్యాయం’’ అని అన్నారు.
మార్వాడీలు తెలంగాణలో భాగం: మహేష్ కుమార్ గౌడ్
‘‘మార్వాడీలు తెలంగాణ రాష్ట్రంలో భాగం. వారిని వెళ్ల గొట్టే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి పక్షాన నిలబడుతుంది ‘‘ అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మార్వాడీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందన్నారు.
మార్వాడీ గో బ్యాక్ నినాదం పేరిట వివిధ సంఘాలు అమన్ గల్ బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ఆ పార్టీకి చెందిన నేత, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ విషయమై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘కాంగ్రెస్, బిజెపి ఆడుతున్న నాటకం’’ అని అన్నారు
‘‘భారతదేశంలో ఏ ప్రాంతం వారైనా జీవించే హక్కు రాజ్యాంగమే కల్పించింది, ఇండియా పౌరులు విదేశాల్లో జీవిస్తున్నారు, ఇది కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్ర ’’అని రాజకీయ విశ్లేషకుడు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ పి. మోహన్ రావు అన్నారు.
‘‘నాణ్యత లేని సరుకు తక్కువ ధరకు విక్రయించడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని అమన్ గల్ కిరణా దుకాణ వ్యాపారులు అంటున్నారు. తమ వ్యాపారాలను దెబ్బతీయడమే కాదు నాసిరకం వస్తువులు అమ్మడం వల్ల వాటిని వినియోగిస్తున్న ప్రజల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అని వారంటున్నారు.
బంద్ వల్ల ప్రయోజనం లేదు: అఖిల భారత అగర్వాల్ మహసభ
‘‘మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని’’ అఖిల భారత అగర్వాల్ మహసభ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ అగర్వాల్ అన్నారు. తెలంగాణలో మార్వాడీ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. వారి వ్యాపార సముదాయాలు, ఇళ్లపై దాడులు జరగకుండా రక్షణ ఏర్పాట్లు చేయాలని అగర్వాల్ అన్నారు.