పంటలతో పాటు రైతులను కూడా ముంచిన ‘మొంథా’
x
Montha effect on Telangana districts

పంటలతో పాటు రైతులను కూడా ముంచిన ‘మొంథా’

వర్షాల దెబ్బకు భద్రాద్రి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటముణిగిపోయాయి.


మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో తగ్గి తెలంగాణ పైన మొదలైంది. తుపాను ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీవర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రినుండి తెలంగాణలోని ఖమ్మం, భద్రదాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దెబ్బకు భద్రాద్రి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని వందలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలు నీటముణిగిపోయాయి. మొంథా తుపాను దెబ్బకు పంటలే కాకుండా రైతులు కూడా నిండా ముణిగిపోయారు.

రాబోయే 24 గంటల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాక ముందస్తు హెచ్చరికలతో ఏమిచేయాలో రైతులకు అర్ధంకావటంలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలన్నీ వర్షంపాలవ్వటంతో రైతుల పరిస్ధితి ధైన్యంగా తయారైంది. మొక్కజొన్న పంట చేతికొచ్చిన దశలో భారీవర్షాలు కురవటంతో కంకులు మొలకలెత్తుతున్నాయి. ములుగు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలపైన తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, గంటకు వర్షాలు 50-60 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, జగిత్యాల, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జగిత్యాల, నిర్మల్, వికారాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పై జిల్లాలో ఆరెంజ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. అలాగే హైదరాబాద్, మంచిర్యాల, సంగారెడ్డి, జనగాం, జోగులాంబ గద్వాల్, మేడ్చల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఒకమోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.

ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో భారీవర్షాల కారణంగా అధికారులు విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించారు. డోర్నకల్ రైల్వేస్టేషన్లో పట్టాలపై నీరు నిలిచిపోయిన కారణంగా గోల్కొండ, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు నిలిచిపోయాయి.

నగరంలో భారీవర్షం

హైదరాబాద్ నగరంలోని అనేక ఏరియాల్లో భారీవర్షం కురుస్తోంది. బుధవారం తెల్లవారి నుండే వర్షం మొదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఓల్డ్ సిటి, అమీర్ పేట్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మియాపూర్ లాంటి అనేక ప్రాంతాల్లో ఉదయం నుండి వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తునే ఉంది. లోతట్టు ప్రాంతాల్లోని జనాలను అధికారులు ముందుజాగ్రత్తగా ఇతరప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More
Next Story