Suravaram | కళ్ళను దానంచేసిన  సురవరం
x
Revanth Paying tribute to late Suravaram Sudhakar reddy

Suravaram | కళ్ళను దానంచేసిన సురవరం

కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి భౌతిక దేహానికి మగ్దూంభవన్లో రేవంత్ నివాళులర్పించారు


సమాజానికి చేసిన సేవలను గుర్తుంచి ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో సురవరం సుధాకరరెడ్డి (Suravaram Sudhakar reddy) పాత్ర ఉండేట్లుగా చూస్తామని ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రకటించారు. కామ్రేడ్ సురవరం సుధాకరరెడ్డి భౌతిక దేహానికి మగ్దూంభవన్లో రేవంత్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు సురవరం మరణం తీరని లోటన్నారు. రాజీపడని సిద్ధాంత రాజకీయం చాలా గొప్పదన్నారు. ఏఐఎస్ఎఫ్ తో మొదలైన రాజకీయ ప్రస్ధానం సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి దాకా సాగటం గొప్ప విషయమని అన్నారు.

ప్రజా జీవితంలో సురవరం అహంకారాన్ని దగ్గరకు కూడా రానీయలేదని చెప్పారు. హైదరాబాదు విముక్తి పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసిన సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సుధాకర రెడ్డి కోరగానే వెంటనే తెలుగు విశ్వవిద్యాలయానికి పేరుపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సిద్ధాంత పరమైన రాజకీయాలు చేసే వారికి సుధాకరరెడ్డి మరణం తీరని లోటుగా రేవంత్ అభివర్ణించారు. పాలమూరు జిల్లాలకు సుధాకర్ రెడ్డి ఎంతో వన్నె తెచ్చారని చెప్పారు. పదవిలో ఉన్నా లేకపోయినా సురవరం ప్రజల కోసమే పనిచేసినట్లు ప్రశంసించారు.

సురవరం సేవలను ప్రభుత్వం గుర్తించింది కాబట్టే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో కూడా సంతాపం తెలిపామని అన్నారు. ఏఐసీసీ, కాంగ్రెస్, ప్రభుత్వం తరపున సంతాపం తెలిపేందుకు తాను వచ్చినట్లు రేవంత్ చెప్పాడు. తెలంగాణలో విలువలతో కూడిన రాజకీయాలు చేసిన కొద్దిమందిలో సుధాకర్ ఒకరు. సుధాకర్ రెడ్డి పేరుకు అభివృద్ధి కార్యక్రమంలో పాత్రుండేట్లుగా మంత్రవర్గం నిర్ణయిస్తుందని రేవంత్ ప్రకటించారు.

కళ్ళని దానంచేసిన సురవరం

జీవించి ఉన్నంతకాలం ప్రజల కోసమే అన్నట్లుగా ఉన్న సురవరం మరణించిన తర్వాత కూడా ప్రజల కోసమే అన్నట్లుగా ఉన్నారు. ఎలాగంటే కామ్రేడ్ తనకళ్ళను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానంచేశారు. చూపులేని వారికి తన కళ్ళను అమర్చటం ద్వారా ప్రపంచాన్ని తాను చూస్తునే ఉండాలని బహుశా సురవరం అనుకున్నట్లున్నారు. అందుకనే తన కళ్ళను దానం చేశారు. శరీరాన్ని గాంధీ ఆసుపత్రికి దానంచేశారు.

Read More
Next Story