
ఊరించి ఉసూరుమనిపించిన పీఎఫ్ పెన్షన్ పెంపు
పింఛనుదారుల జీవితాలతో కేంద్రం క్రూర పరిహాసం
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పెన్షనర్ల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. అదిగో పెంపు, ఇదిగో పెంపు అంటూ ఊరించిన కేంద్ర కార్మిక శాఖ ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పింది. పెన్షన్ పెంపు లేదంటూ పార్లమెంటు సాక్షిగా కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే స్పష్టంచేశారు.
పార్లమెంటు ఎన్నికలకు ముందు కనీస పెన్షన్ ను రూ.1000 నుంచి రూ.7,500లకని, రూ.9 వేలకని చెబుతూ వచ్చిన కేంద్ర కార్మిక శాఖ ఇప్పుడు అటువంటి ప్రతిపాదనే లేదని పేర్కొనడం గమనార్హం. దీంతో లక్షలాది మంది పీఎఫ్ పెన్షన్ దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 30, 40 ఏళ్లు సర్వీసు చేసినా తమకు 2,3 వేలకు మించి పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరలు ఆకాశానికి అంటుతున్న నేపథ్యంలో కనీస పింఛను రూ.7 వేల వరకైనా వస్తుందేమోనని బడుగు జీవులు ప్రత్యేకించి అసంఘటిత రంగానికి చెందిన వారు ఎదురు చూశారు.
ఈనేపథ్యంలో బుధవారం పార్లమెంట్‌లో ఓ సభ్యుడు లేవనెత్తారు. దీనికి కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వివరణ ఇస్తూ అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు.
‘‘ఉద్యోగుల పింఛను నిధి (EPS)కి మూలధనం అనేది వేతనాల్లో యజమాని 8.33 శాతం వాటాతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది. ఆ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు అందిస్తున్నాం. ఏటా ఈ నిధిని అంచనా వేస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆ మూల్యాంకనం ప్రకారం ఈ పింఛను ఫండ్ లోటులో ఉంది. దీనికి సరైన రిటర్నులు రానందున.. ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు కల్పించాల్సి వస్తోంది’’ అని మంత్రి వివరించారు. దీంతో ఇప్పట్లో ఈపీఎస్ కనీస పింఛన్‌ను పెంచే అవకాశాలు కన్పించట్లేదు.
ఈపీఎస్ అనేది ఈపీఎఫ్ (EPFO)లో ఒక భాగం. ఈపీఎఫ్‌లో సభ్యులైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అసంఘటిత ప్రత్యేకించి ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీవిరమణ తర్వాత నెలవారీ పింఛను పొందొచ్చు. ఉద్యోగి మరణించిన తర్వాత కూడా నామినీకి ఈ పింఛను వస్తుంది. ఉద్యోగి, సంస్థ 12 శాతం చొప్పున ఉద్యోగి వేతనానికి సమానమైన మొత్తాన్ని ప్రతి నెలా ఈపీఎఫ్‌లో జమ చేస్తారు. సంస్థ వాటా అయిన 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కి వెళ్తుంది. మిగతా 3.67 శాతం ఈపీఎఫ్‌కి చేరుతుంది.
ఈ పింఛను నెలకు కనీసం రూ.1,000 లభిస్తుంది. గరిష్ఠంగా రూ.7,500 పొందే వీలుంది. ఇప్పుడు కనీస మొత్తాన్ని రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగి 58 ఏళ్ల తర్వాత లేదా పదవీ విరమణ పొందిన తర్వాత ఈ పింఛనును పొందొచ్చు. 50 ఏళ్ల వయసు నుంచే ముందస్తు పింఛను అందుకునే సౌకర్యమూ ఉంది. ఉద్యోగి చనిపోతే వారి భాగస్వామికి ఈ పింఛను అందుతుంది. ఒకవేళ భాగస్వామి లేకపోతే పిల్లలు 25 ఏళ్లు వచ్చేవరకు ఈ పింఛను పొందొచ్చు.
భార్య లేదా భర్తను కోల్పోయినవారు తిరిగి పెళ్లి చేసుకుంటే కేవలం పిల్లలకు మాత్రమే (25ఏళ్లు వచ్చేంతవరకు) ఈ పింఛను పొందే వీలుంది.
పిల్లలు దివ్యాంగులైతే.. జీవితకాలం ఈ పింఛను అందుకోవచ్చు. ఈ పింఛను క్లెయిమ్ చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో నుంచి పెన్షన్ సర్టిఫికెట్ పొందడం అవసరం.
ఎందుకింత హడావిడి చేసినట్టు?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నట్టు, లక్షల కోట్ల రూపాయల అన్ క్లెయిండ్ నిధులు ఉన్నాయని కేంద్రప్రభుత్వం గత పార్లమెంటు సమావేశాల్లోనూ చెప్పింది. అయినప్పటికీ లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక అవస్థలు పడుతున్నారు.
కనీస పింఛను మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని ఈపీఎస్-95 పథకానికి చెందిన వేలమంది పింఛనుదారులు (EPS 95 pension) ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు పీఎఫ్ విభాగం కూడా దరఖాస్తులు ఆహ్వానించింది. అసంఖ్యాకంగా దరఖాస్తులు కూడా వచ్చాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయంటూ ఈమధ్య కేంద్ర కార్మిక శాఖ కూడా ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనే లేదని తేల్చిచెప్పింది.
Next Story

