తెలంగాణలో శ్రీరామచంద్రుడి పాదముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి..
x
భద్రాద్రి సీతారాములు

తెలంగాణలో శ్రీరామచంద్రుడి పాదముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయి..

వనవాసంలో శ్రీ రాముచంద్రుడు సీతాదేవితో కలసి తెలంగాణలోని అనేక స్థలాల్లో సుమారు మూడు సంవత్సరాలు సంచరించాడనడానికి మూడు రకాల ఆధారాలు కన్పిస్తాయి. అవేంటంటే...


డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ

భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన చారిత్రక దేవుడు రాముడిని అయోధ్య

తరువాత భక్తితో కొలిచే ప్రదేశం భద్రాచలం తెలంగాణలో ఉండటం తెలంగాణ

ప్రజలకు గర్వకారణం. తెలంగాణ ప్రజలు రాముడిని రామభక్తిని తమ దైనందిన జీవితంలో

అధాశం చేసుకున్నారనటానికి నిదర్శనంగా ఒకరినొకరు పలుకరించు

కునేటప్పుడు స్వాగత వచనంగా "రామ్ రామ్" అనుకోవడాన్ని చూపవచ్చు.


రామకథా గానం వినని ఊరు ఉండదు తెలంగాణాలో, ప్రతి ఊర్లో ఆ ఊరిలోని ఔత్సాహికులే

కలసికట్టుగా చిరుతల రామాయణాన్ని నేర్చుకొని ప్రదర్శిస్తారు. ఇంతగా తెలంగాణ ప్రజలు

రాముడ్ని ఆరాధించడానికి కారణమేమిటని ఆరా తీస్తే దొరికే సమాధానం రాముడు

తెలంగాణలోని అనేక స్థలాల్లో సంచరించడమే. రాముడు తెలంగాణలో సుమారు మూడు

సంవత్సరాలు సంచరించాడనడానికి మూడు రకాల ఆధారాలు కన్పిస్తాయి. ఒకటి వాల్మీకి

రామాయణం (అరణ్యకాండ), రెండు పురావస్తు - చారిత్రక ఆధారాలు, మూడు జానపద/ స్థల పురాణ ఆధారాలు.

రామాయణ స్థలాలు సీతారామ లక్ష్మణులు తమ పద్నాలుగేళ్ళ వనవాసంలో భాగంగా ఉత్తర, మధ్య

భారతంలో అనేక స్థలాలు తిరుగుతూ వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించాక చిత్రకూట పర్వతాన్ని

చేరుకొని పర్ణశాల నిర్మించుకున్నారట.


అగస్త్య మహర్షి దక్షిణాన గోదావరి తీరాన ఉన్న

పంచవటికి వెళ్ళుమని శ్రీరాముడికి చెప్తూ "తాడిచెట్ల వనం దాటి ఉత్తరం గుండా మట్టి

చెట్టు వద్దకు చేరుకొని, అక్కడి నుండి పర్వత తలంపై నడవాలి” అని వివరించినట్లు

అరణ్యకాండ 13వ సర్గలోని 13, 18, 21, 22 శ్లోకాలు తెలియజేస్తాయి.


పంచవటి చరిత్ర ఏమిటంటే

పంచవటి అంటే మట్టి, మారేడు, మేడి, రావి, అశోక వృక్షాల వనాలుండే ప్రదేశం అని అర్థం. ఈ

వనాలున్న ప్రదేశం గోదావరి నది వెంట కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా నుండి

ఖమ్మం జిల్లా తూర్పు సరిహద్దుల వరకు ఉండేది.


డా. ద్యావనపల్లి సత్యనారాయణ


ఇంత విశాలమైన పంచవటిలో రాముడు మొదట పర్ణశాల నిర్మించుకున్నది.

చిత్రకూటం పైన. “నామూలం లిఖ్యతే కించిత్ నానపేక్షిత ముచ్యతే” (మూలంలో లేనిది

చెప్పను, అనవసరమైంది అసలే చెప్పను) అని ఢంకా బజాయించి చెప్పుకున్న అగ్రశ్రేణి

వ్యాఖ్యానకారుడు మల్లినాథసూరి (మెదకు జిల్లావాసి) చిత్రకూటం అంటే రామగిరి అని

చెప్పాడు.


రామగరి గురించి


వాస్తవానికి కూడా అరణ్యకాండలో పైన పేర్కొన్న శ్లోకాలలో వివరించినట్లుగానే

ఈ రామగిరిని ఉత్తరం నుండే ఎక్కాలి. వాటిల్లో పేర్కొన్నట్లుగానే రామగిరికి ఉత్తరాన

వేల తాడి చెట్లున్నాయి. ఆగ్నేయంలో తాడిచెట్ల అనే ఊరు కూడా ఉంది. రామగిరి

పర్వత తలంపై పది కిలోమీటర్లు నడవాలి కూడా. ఇంకొక గొప్ప విషయమేమిటంటే,

రాముడు ఇక్కడికి వచ్చిన నాటి, అంటే క్రీ.పూ. 5079 సంవత్సరం నాటి మధ్య శిలాయుగ

మానవుల స్థావరం, వారి పనిముట్లు, ఆయుధాలు ఇక్కడ లభించడం. వీటిని 1978లో

పెద్దపల్లి నివాసి ఠాకూర్ రాజారాం సింగ్ గారు పూర్వ పురావస్తుశాఖ సంచాలకులు

వి.వి. కృష్ణశాస్త్రిగారి సమక్షంలో రామగిరి గుట్ట మొదట్లో సేకరించారు.


"సీతాస్నాన పుణ్యోదకేషు రామగిరి" అని క్రీ.శ. 5వ శతాబ్దంలో మహాకవి కాళిదాసు

తన మేఘసందేశం కావ్యంలో రాసినట్లుగానే ఈ రామగిరిపై సీత స్నానం చేసిన కొలనులు,

ఆమె పసుపు కుంకుమలను రాళ్ళ నుంచి రాకి సేకరించుకున్న ఆనవాళ్ళు, సీతారామ

ప్రతిష్టిత శివలింగాలను రామగిరి పైన ఇప్పటికీ చూడవచ్చు.


రాముడు భూమిలోకి శక్తివంతమైన బాణాలను సంధించి సృష్టించిన ఊటలను కూడా రామగిరిపై చూడవచ్చు.

రాముడు ఇక్కడున్నప్పుడే దశరథుడు మరణించడంతో తండ్రికి ఇక్కడే పిండం పెట్టాడని

స్థానికులు చెప్తారు. తదనంతరం భరతుడు ఇక్కడికి వచ్చి రాముడి పాదుకలను అమోధ్యకు

తీసుకెళ్ళాడు. ఈ చరిత్రాత్మక విషయాలకు సంబంధించిన అన్ని విగ్రహాలను రామగిరి

కొండ కొనపైనున్న గుహలో చూడవచ్చు.


లంజమడుగు రహస్యమేమిటో తెలుసా?


అయితే రాముడి ఉనికి ఈ ప్రాంతపు రాజు ఖరునికి కంటగింపయి అతని

సైన్యం ఈ ప్రాంత మునులు, ఋషులపై అఘాయిత్యాలకు పాల్పడడంతో రాముడు

వారికోసం ఈ జనస్థానాన్ని (రాజధాని ఖరియాల్, ఛత్తీష్ గడ్) వదిలి దండకారణ్యంలో

ప్రవేశించాడు. ఈ అరణ్యం మంత్రకూటం (మంథని) తూర్పు నుండి ప్రారంభమవుతుంది.

దండకారణ్యంలో మొదట ఎదురైన విరాధుడు అనే రాక్షసుని చేతులు నరికి రాముడు

శరభంగ మహాముని ఆశ్రమంలో గడుపుతున్నప్పుడు ఆ ప్రాంత మునులందరు ఆయన

దగ్గరికి వచ్చి రాక్షసులు మునులెందరినో చంపుతున్నారని చెప్పి రాముడికి వారి బొక్కలు

గుట్టలుగా పేరుకుపోయిన స్థలాన్ని చూపారు. ఆ స్థలం ఇప్పటికీ అదే 'బొక్కలగుట్ట'

పేరుతో రామగిరికి వాయువ్యాన మంచిర్యాలకు 5 కి.మీ.ల దూరంలో ఉంది. మునులకు

అభయమిచ్చి సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో ఉన్న సుతీక్షుడు తదితర మునుల

ఆశ్రమాలను దర్శించి పొద్దు గుంకే సమయంలో పంచాప్సర సరస్సును చూశారట. ఆ

సరస్సును మాండకర్ణి అనే ఋషి సృష్టించుకొని, అందులో ఒక రహస్య మందిరాన్ని

ఏర్పరుచుకుని వాటిల్లో ఐదుగురు అప్పరసలతో రతి సుఖాలను అనుభవించాడని

ధర్మభృతుడనే ఋషి రాముడికి చెప్పినట్లు అరణ్యకాండ 9వ సర్గ 8-18 శ్లోకాలలో

ఉంది. మాండకర్జి అనుభవించిన సుఖాలనుబట్టి ఆ సరస్సును స్థానికులు ఇప్పుడు

“లంజమడుగు" అంటున్నారు.

సమక్క సారక్కల వారసత్వం


ఇది గోదావరిలో మంథనికి సమీపంలో ఉంది. మాండకర్ణి సుఖం ఎంత ప్రచారమయ్యిందంటే 'ఆ' వృత్తాంతాన్ని

తెలిపే శిల్పం విజయవాడ కనకదుర్గ

ఆలయ సమూహంలోని శిథిల ఆలయంపైన కూడా ఉంది. ఇలాంటి శిల్పాలు

లంజమడుగు ప్రాంత గుహాలయాల్లో కూడా ఉన్నాయి.

ఇక ఇక్కడి నుంచి రాముడు ఖమ్మం జిల్లాలోని ప్రస్తుత పర్ణశాల ప్రాంతానికి

వెళ్తున్నప్పుడు మధ్యలో జటాయువు (టోటెమ్) అనే పక్షిరాజు ఎదురై తాను దశరధునికి

స్నేహితున్నని చెప్తూ ప్రసంగవశాన సృష్టిలో జీవజాల పుట్టుక ఎలా జరిగిందో వివరించాడు.

(14వ సర్గ). ఈ వివరణ శిల్పాలను మనం రామగిరి ఖిల్లా రెండవ, మూడవ కోటల

దర్వాజాల పైన చూడవచ్చు. ఈ ప్రాంతంలో రామాయణ కాలం నాటికి జటాయువు

లేదా గద్దను (సంస్కృతంలో గృధ్రం) పూజించేవారి ప్రాబల్యం ఉండేది. ఇక్కడి నుండి

తూర్పు వైపున అరణ్య ప్రాంతానికి అతి ప్రాచీన కాలంలో గృధ్రవాడి అనే పేరున్నట్లు

శాసనాలు కూడా పేర్కొన్నాయి. గద్దను తమ జెండాపై చిత్రించుకున్న పొలవాస రాజులు

ఈ ప్రాంతంలో క్రీ.శ. 12వ శతాబ్దం వరకు పరిపాలన చేశారు. ఇలాంటి జెండాలను

ఇప్పటికీ మనం సమ్మక్క సారక్క జాతరలో చూడవచ్చు. సమ్మక్క సారక్కలది పొలవాస

రాజుల వంశమే.


సీతారాముల వనవాసపు ఆనవాళ్లు


సీతారామ లక్ష్మణులు నేటి ఖమ్మం జిల్లాలో గోదావరి తీరాన పర్ణశాల కట్టుకొని

కొంతకాలం హాయిగా గడిపారు. భద్రాచలానికి ఉత్తరాన సుమారు 35 కి.మీ.ల దూరంలో

ఉన్న ఈ పర్ణశాల పంచవటి ప్రాంతంలో భాగం. ఇక్కడ ఒక వటవృక్షం కింద రామపాద

ముద్రలున్నాయి. ఈ పర్ణశాల ప్రాంతం ఒక అందమైన సంగమ ప్రదేశం. ఇక్కడ

గోదావరిలో తాలిపేరు, సీలేరు, సీతవాగు కలుస్తాయి. సీతవాగులో సీత స్నానం చేసి

వాగులోని బండల మీద తన పట్టు చీరలు, నార చీరలను ఆరబెట్టుకున్నప్పుడు వాటి

రంగు అంటిన చారలని స్థానికులు మనకు చూపిస్తారు. ఆమె అక్కడి రాళ్ళను రాకి

పసుపు కుంకుమలను తీసుకున్న ఆనవాళ్ళను, పసుపు కుంకుమ రాళ్ళను కూడా మనం

చూడవచ్చు. ఆమె కాలక్షేపానికి ఆడుకున్న వామనగుంటలాటకు సంబంధించిన

ఆనవాళ్ళను కూడా చూడవచ్చు. రాముడు స్నానం చేసిన స్థలాన్ని ఇప్పుడు స్నానాల

లక్ష్మీపురం అంటున్నారు. ఇది వైరా మండలంలో ఉంది. ఇక్కడ శివరాత్రినాడు లక్షలమంది

స్నానం చేస్తారు.

సీతారాములు పర్ణశాలలో ఉన్నప్పుడు పరిసర ప్రాంతాలలో కూడా తిరిగారని

పరంపరగా వస్తున్న మౌఖిక ఆధారాలు తెలియజేస్తాయి. అలా వారు గోదావరి వెంట

నేటి భద్రాచలం వరకు వచ్చి ఆ గిరిపై కొంత సమయం విశ్రాంతి కూడా తీసుకున్నారని,

అదే స్థలంలో భద్ర మహర్షి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించి పూజలు

ప్రారంభించాడని భద్రాచల స్థలపురాణం తెలియజేస్తుంది. ఇక్కడికి ఆగ్నేయంలో ఉన్న

ఉండంలో చలికాలంలో సీత స్నానం చేసేదని చెప్తారు. ఇదే ప్రాంతంలో నవీన శిలా యుగానికి చెందిన

మానవుల స్థావరపు పనిముట్లను డా॥ పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు గుర్తించారు.


రాముడు స్నానమాచరించిన వాగు


ఖమ్మం పట్టణానికి 22 కి.మీ.ల దూరంలో ఉన్న నాగులవంచకు కూడా రాముడు

వచ్చాడట. ఇక్కడి వంచ(వాగు)లో స్నానం చేశాడట. ఇక్కడున్న అతి ప్రాచీన కోదండ

రామాలయంలో భద్రాచలంలో వలె సీతారాములు ఒకే వేదికపై ఉన్నారు. ఇక్కడ

హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తున్న ఘట్టం శిల్పించబడింది. సమీపంలోని

గజగిరి నరసింహస్వామి గుట్టపైనున్న దేవుడు మంగళగిరి పానకాల స్వామిలా ఎంత

పానకం పోసినా తాగేస్తాడు. నాగులవంచలో సీతారాములు తమకోసం సృష్టించుకున్నవిగా

చెప్తున్న సీతాసాగర్, రామసముద్రం అనే రెండు చెరువులున్నాయి.

సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో ఉన్నప్పుడు రావణాసురుడి చెల్లి శూర్పణఖ

ఇక్కడికి వచ్చి రాముడిని మోహించి, రాముడి సూచన మేరకు లక్ష్మణున్ని ఆశ్రయిస్తే

ఆయన ఆమె ముక్కు చెవులు కోశాడు. అందుకు ప్రతిగా ఈ ప్రాంత పాలకుడు, శూర్పణఖ

అన్న ఐన ఖరుడు రాముడిపై పద్నాలుగు వేల సైన్యంతో యుద్ధం చేశాడు. ఆ యుద్ధ

సమయంలో సూర్యగ్రహణం సంభవించిందని, ఆ రోజు రాత్రి అమావాస్య అని, అప్పుడు

ఆకాశం మధ్యలో ఉన్న అంగారక గ్రహానికి ఒక పక్క బుధ శుక్ర గ్రహాలు, మరో పక్క

శనిగ్రహం - సూర్యుడు ఉన్నారని అరణ్యకాండ 23 వ సర్గ 10-13, 34 శ్లోకాలలో

వాల్మీకి వివరించాడు. ఈ గ్రహస్థితిని అమెరికన్ టైమ్ మిషన్లో పొందుపర్చినప్పుడు

అది ఆ రోజు తేది క్రీ.పూ. 5077 అక్టోబర్ 7 అని సూచించిందని "డేటింగ్ ది ఎరా

ఆఫ్ లార్డ్ రామ" అనే పుస్తకంలో పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్

అధికారి తెలిపారు.


సీతను దాచిన గుహ


ఆనాటి యుద్ధంలో రాముడు ఖర, దూషణ, త్రిశిరాదులతో సహా 14

వేల మంది రాక్షస సైన్యాలను చంపుతున్నప్పుడు రాముని సూచన మేరకు లక్ష్మణుడు

సీతను ఒక కొండ గుహలో దాచాడు. ఆ కొండ పేరు లక్ష్మణకొండ. ఈ యుద్ధం

జరిగిన స్థలం దుమ్ముగూడెం, లక్ష్మణకొండ పర్ణశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే

ఉంటాయి. దుమ్ముగూడెంలో అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వరాలయముంది.

రాముడు ఖరున్ని చంపాక శూర్పణఖ రావణుడితో మొరపెట్టుకుంది. రావణుడు

లంక నుండి ఇక్కడికి వచ్చి, మారీచున్ని ఒప్పించి అతని సహకారంతో సీతను ఎత్తుకుపోయే

పథకం పన్నాడు. రావణుడు ఇక్కడకు కంచర గాడిదల రథం మీద వచ్చాడని, సరైన

సమయం కోసం గోదావరి ఆవలి ఒడ్డున వేచియున్నాడని, ఆ వేచియున్న గుట్ట పేరు

రావణగుట్ట అని, అతని రథచక్రాల గాడి ఇది అని స్థానికులు ఆ గుట్టపై ఆనవాళ్ళను

చూపిస్తారు.

రావణు కొలను

రావణుడు సీతను ముట్టజాలక ఆమె నిల్చున్న భూమినంతా పెకిలించుకొని

ఆ ప్రాంతంలో ఏర్పడ్డ గంటను 'రావణు కొలను' అంటారు. ఇది పర్ణశాలలోని

రామాలయం వెనుక ఉంది. సమీపంలో దశకంఠేశ్వరాలయం అనే శివాలయం ఉంది.

పోవడంతో అందులోని శివలింగాన్ని పరమశివ భక్తుడైన దశకంఠుడు అనగా రావణుడే లంక

నుండి తెచ్చి ప్రతిష్టించాడట.

పోలవరం పుట్టుక ఏమిటి?

రావణుడు తనను ఎత్తుకుపోతున్న విషయాన్ని గూర్చి తన రాముడికి చెప్పండని

సీత మాల్యవంతం పైనున్న ప్రస్రవణ గిరికి, గోదావరికి చెప్పిందట. ఈ ప్రస్రవణం

తెలుగులో పొరవణం, క్రమంగా పోలవరం అయ్యింది. సుమారు రెండున్నర శతాబ్దాల

కింద (1769) భద్రాచలంపై ధంసా అనే బిరుదున్న ముస్లిం నాయకుని ఆధ్వర్యంలో

జరిగిన దాడిలో భద్రాచల రాముడ్ని రహస్యంగా ఈ పోలవరం మీదికే తీసుకొచ్చి ప్రతిష్టించి

పూజించారు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ భద్రాచలానికి తీసుకొచ్చారు.

సీత అరుపులను విని జటాయువు రావణుడ్ని ఎదిరించాడు. కాని రావణుడు

జటాయువు రెక్కలను నరికివేశాడు. ఆ రెక్కలు పడిన స్థలం పేరు రెక్కపల్లి క్రమంగా

రేకపల్లి అయింది. జటాయువు రాముడికి సీతాపహరణ విషయం చెప్పి మరణించిన

స్థలం జటపాక కాలక్రమంలో ఎటపాక అయింది. ఇక్కడ ఇప్పుడు జటాయు మంటపం

ఉంది. ఇక్కడే 2012 ఏప్రిల్లో అతిరాత్ర యాగం నిర్వహించారు. పక్కనే భద్రాచలానికి

5 కి.మీ.ల దూరంలో జటాయు పర్వతముంది. రాముడు చనిపోయిన జటాయువుకు

సమీపంలోని గోదావరిలో పిండాలు పెట్టాడట. అలా పిండాలు పెట్టిన ప్రదేశం పేరుతో

తెంగాణలో కొన్ని చోట్ల పెండ్యాల అనే ఉర్లేర్పడ్డాయి.

సీతం పేట చరిత్ర ఏమిటో తెలుసా?


రావణుడు తనను ఆకాశమార్గంలో ఎత్తుకుపోతున్నప్పుడు సీత కింద కనిపిస్తున్న

ఐదుగురు వానరులను చూసి తన నగలను ఒలిచి తన పట్టు ఉత్తరీయంలో చుట్టి వారి

దగ్గర పడేసిందట. ఆ ప్రదేశం పేరు సీతంపేట అయ్యింది. ఇది భద్రాచలానికి తూర్పున

50 కి.మీ.ల దూరంలో కూనవరానికి దగ్గర్లో ఉంది. రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ

కూనవరానికి వచ్చారు. అక్కడ వారికి శబరి (స్థానిక సవర తెగ స్త్రీ) కనిపించింది. ఆమె

రేగు పళ్ళను రుచి చూచి తియ్యగా ఉన్నవాటిని రాముడికి తినిపించింది. ఆ ప్రదేశాన్ని

ఇప్పుడు శ్రీరామగిరి అంటున్నారు. ఈ కూనవరం దగ్గరే శబరి నది ఉత్తరం నుండి

వచ్చి గోదావరిలో సంగమిస్తుంది. పాపికొండల టూర్ బోట్ల ఇక్కడి నుండే గోదావరిలో

ప్రయాణిస్తాయి. సమీపంలో వాలి - సుగ్రీవుల కొండ ఉంది. ఆ కొండపై వాలి సుగ్రీవులు

కొట్లాడారని అంటారు. కాని వారు కొట్లాడినట్లు తెలిపే శిల్పాలు ఇక్కడికి దక్షిణంగా

కొన్ని పదుల కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని కామవరపు కోట గ్రామ

పరిధిలో ఉన్న కొండల్లో ఉన్నాయి. ఆ కొండల్లో వాలి భార్య తారను పూజించే ఒక

ప్రాచీన గుహాలయముంది. కాబట్టి కూనవరం దగ్గరి వాలిసుగ్రీవుల కొండలో రాముడు

వాలిని చంపి, సుగ్రీవునితో స్నేహం చేసి అతని అనుచరులను నలు దిశలకు పంపి

సీతను వెదికించారని అనుకోవచ్చు. కూనవరంలోని రామాలయంలో యోగరాముని

విగ్రహముంది. కారణం, రాముడు పర్ణశాలలో ఉన్నప్పుడు ఇక్కడున్న మతంగ ముని

ఆశ్రమంలో యోగ నేర్చుకున్నాడట.


(డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ చరిత్రకారుడు, పురాతత్వనిపుణుడు. రచయిత, హైదారా బాద్)

Read More
Next Story