
ఉస్మానియా బిస్కెట్ ఎందుకంత ఫేమస్
బిస్కెట్‌కు నిజాం రాజు పేరు ఎలా వచ్చింది?
ఉస్మానియా బిస్కెట్ అనగానే మూడు బేకరీలు గుర్తుకు వస్తాయి. ఒకటి నిమ్రా బేకరీ. ఇది చార్మినార్ కు ప్రక్కనే ఉంటుంది. ఎప్పుడు జన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. రెండవది నిలోఫర్. ఇది నిలోఫర్ పిల్లల ఆస్పత్రి లక్డికాఫూల్ వద్ద ఉంటుంది. ఎప్పుడు జనసమ్మర్ధమై నిలబడ్డానికి కూడా సందు ఉండదు. మూడవది సుభాన్ బేకరీ. ఇది నాంపల్లిలో ఉంటుంది. రాయల్ బిస్కెట్ అదే ఉస్మానియా బిస్కెట్‌ని మార్కెట్‌కి పరిచయం చేసింది మాత్రం సుభాన్ బేకరీ. హైదరాబాద్ లో నివసించే రోజు కూలీల దగ్గర నుంచి, సామాన్య ప్రజానీకం వరకు ఉదయాన్నే ఇరానీ ఛాయ్ తో ఉస్మానియా బిస్కెట్ ను అల్పాహారంగా తీసుకుని దిన చర్య ప్రారంబిస్తారు.
నోట్లో పెట్టుకుని, పంటితో కొంచెం కొరకి, నాలుక మీద పెట్టుకోగానే వెంటనే కరిగిపోతుంది. కొంచెం ఉప్పుగా, కొంచెం తియ్యగా ఉంటుంది. అదే ఉస్మానియా బిస్కట్ స్పెషాలిటి. గుల్లగా (క్రిస్పీ) ఉంటుంది. "లంచ్ టైం అయినా భోజనం చేయకుండా ఇష్టంగా చాయి బిస్కెట్ తింటున్నామంటున్నారు" నల్లకుంటకు చెందిన రమేష్. ఆయన షాపింగ్ చేయడానికి కుటుంబసభ్యులతో చార్మినార్‌కు వచ్చినట్లు ఫెడరల్‌తో చెప్పారు.
"గరమ్ గరమ్ ఇరానీ ఛాయ్ లో కరకరలాడే ఉస్మానియా బిస్కెట్లను ముంచుకుని తింటే అద్భుతంగా ఉంది. గుల్ల గుల్లగా చాలా రుచిగా వుందంటూ ఉస్మానియా బిస్కెట్ రుచికి ఫిదా అయి పోయారు" యు.కె.కు చెందిన సమంత లూయిస్. ఆమె చార్మినార్ చూడడానికి వచ్చినట్టు ది ఫెడరల్‌తో చెప్పారు.
సమంత లూయిస్, పర్యాటకురాలు, యు.కె.
రోజుకు కొన్ని లక్షల బిస్కట్లను తినేస్తున్నారంటేనే ఈ బిస్కెట్ ను జనాలు ఎంతగా ఇష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. "ఉస్మానియా బిస్కెట్ పేరుతోనే కొన్ని వందల బేకరీలు బిస్కెట్లను తయారుచేస్తున్నారు. ఏ నలుగురు ఇరానీ చాయ్ దుకాణం దగ్గర లేదా టీ స్టాల్ దగ్గర గుమిగూడినా చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్ ఉండితీరాల్సిందే". అంటారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జిలానీ. తాను ఛాయి-బిస్కెట్ కోసమే గచ్చిబౌలీ నుంచి వచ్చానని చెప్పారు.
ఎప్పుడైతే ఉస్మానియా బిస్కెట్లు బాగా పాపులరైపోయాయో ఇరానీ చాయ్ అందించే దుకాణాలు బేకరీల నుండి ఈ బిస్కెట్లను కొనుగోలు చేసి జనాలకు మరింత దగ్గర చేశాయి. ఉస్మానియా బిస్కెట్ల పేరుతో నగరంలో కొన్ని వందల బేకరీలు తయారు చేస్తున్నారు. మైదా, వెన్న, ఉప్పు, పంచదార తదితరాల మిశ్రమాన్ని కలిపి బిస్కట్లను తయారుచేస్తారు. ఒకే బిస్కెట్లో తీపి, ఉప్పదనం కలిసుండటమే ఉస్మానియా బిస్కెట్ల ప్రత్యేకత.
బిస్కెట్ కు రాజు పేరు
"రోగుల కోసం బిస్కెట్ల తయారీని నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ మొదలుపెట్టారు. అలా బిస్కెట్లు ఉస్మానియా బిస్కెట్ల పేరుతోనే బాగా పాపులరైయాయని" ప్రముఖ చరిత్రకారుడు ఫ్రొఫెసర్ అయ్యూబ్ అలీ చెప్పారు. నిజాం ఆలోచన తీరుకు ఉస్మానియా బిస్కెట్ అద్దం పడుతుందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు.
"1940 ప్రాంతంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో రోగులు తొందరగా కోలుకోవాలని, ఇన్ పేషెంట్ రోగులకు పాలు, బ్రెడ్ ఇచ్చేవారు. అయితే ప్రతి రోజు బ్రెడ్డునే తింటుంటే ఎవరికైనా మొహం మొత్తుతుంది. అలాంటిది రోగుల గురించి చెప్పేదేముంది. ఒకసారి "ఆసుపత్రిని సందర్శించిన 7వ నిజాంకు ఓ రోగి ఓ కోరిక కోరాడట. ఆ రోగి అన్నాడట.... జహపనా.... రోజు, ఈ బ్రెడ్, పాలు తాగి మొహం మొత్తుతుంది. ఇంకేదైనా వీటితో పాటు ఇవ్వమని కోరాడట. అంతే... నిజాం ఆలోచనలో పడ్డాడు. తన వంటశాల నిర్వాహకులని.. పిలిచి, తన కోసం ఒక రుచికరమైన చిరు తిండి పదార్ధాన్ని తయారుచేయమని ఆదేశించారట. అయితే ఆపదార్ధం కాస్త తీపిగా, కాస్త ఉప్పగా ఉండేటట్టుగా ఉండాలని చెప్పారట. అలా ఆయన ఆదేశాల మేరకు నైజాం వంట మాస్టార్లు డాక్టర్ల పర్యవేక్షణలో తయారు చేసిన పదార్థమే ఉస్మానియా బిస్కెట్ " అని నిమ్రా బేకరీ యజమాని అబూద్ బిన్ అస్లాం ది ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
అబూద్ బిన్ అస్లాం, నిమ్రా బేకరీ నిర్వాహకుడు
"మైదా పిండి, వెన్న, పాలు, ఉప్పు, చక్కెరను ఈబిస్కెట్ తయారీకి ఉపయోగించారు. రుచి బాగుండడంతో పాటుగా.. త్వరగా జీర్ణమయ్యే తిండి కాబట్టి రోగులకు పంచే విధంగా నిజాం ఆర్డర్ ఇచ్చారట. అప్పట్టి నుంచి రోగులకు పాలు, బ్రెడ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్ లు ఇచ్చే వారని" అబూద్ బిన్ అస్లాం చెప్పారు.
"నిజాం వంటశాలలోనే ప్రత్యేకంగా బిస్కెట్ల తయారీని నిజాం ప్రారంబించారు. ఆ తర్వాత అబీడ్స్ లో ఒక బేకరీని ఏర్పాటు చేశారు. అక్కడి నుండే జనరల్ ఆసుపత్రిలో రోగులకు ప్రతి రోజు బిస్కెట్లు వెళ్ళేవి. ఉప్పగా, తియ్యగా, గుల్లగా, కొరకంగానే నాలుక మీద నుండి గొంతులోకి జారిపోయే బిస్కెట్లు రోగులకు తెగనచ్చేసింది. ఈ బిస్కెట్లను కేవలం రోగులకు మాత్రమే అందించేవారు. అయితే తమ కోసం ఆసుపత్రికి వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులకు కూడా రోగులు బిస్కెట్లను ఇచ్చేవారు. కొద్ది రోజుల్లోనే బిస్కెట్ల రుచి గురించి ఆ నోటా ఈ నోటా నగరమంతా పాకిపోయింది. దాంతో కొంతకాలానికి ఉస్మానియా బిస్కెట్ల పేరుతో కొన్ని బేకరీలు ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి". అని శ్రీను అరవపల్లి ది ఫెడరల్ తెలంగాణాకు చెప్పారు.
"ఉస్మానియా బిస్కట్లను ముంబై, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని పుడ్ లాంజీల్లో ప్రయాణీకులకు అందిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు రిటైలర్లు ఈ బిస్కట్ల తయారీ కేంద్రాలను అక్కడ నెలకొల్పాని" కోరుతున్నట్లు నిమ్రా హోటల్ నిర్వాహకులు అబూద్ బిన్ అస్లాం చెప్పారు. అదే గనుక జరిగితే రాబోయే రోజుల్లో ఉస్మానియా బిస్కెట్లు హైదరాబాద్ బిర్యాని, హలీమ్ మాదిరి ప్రపంచ స్ధాయి గుర్తింపుని తెచ్చుకుంటాయి.