సిటీని ముంచుతున్నదంతా నేతల ఫామ్ హౌస్ లు, ఇల్లీగల్ కాంప్లెక్స్ లే
హైడ్రా చెబుతున్న పచ్చినిజం....వరద ప్రమాద పరిస్థితులను హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు.
హైదరాబాద్ నగరంతోపాటు నగర శివార్లలోని చెరువులు, నాలాలు సరస్సులలో ఆక్రమణలు వరదలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా) పరిశీలనలో వెల్లడైంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు కాలనీలు, రోడ్లపై వరదనీరు పారింది.
- చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్,బఫర్ జోన్‌లను ఆక్రమించి ఎత్తైన భవనాలు నిర్మించడం వల్ల చెరువుల సామర్ధ్యం తగ్గింది. దీని వల్ల తీవ్ర వరదలు ముంచెత్తాయి. హైదరాబాద్ నగరంలోని సరస్సులలో వెలసిన ఆక్రమణలు వరదలకు ప్రధాన కారణమని తేలింది.
- ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువల్లో 28 పూర్తి ట్యాంక్ స్థాయిని దాటాయి. 28 చెరువుల నుంచి మిగులు జలాలు వాటి అనుసంధాన నాలాలోకి ప్రవేశించాయి.
- చెరువులు, నాలాలను కబ్జా చేసి బడా నేతలు నిర్మించిన ఫాంహౌస్ లు, ఇల్లీగల్ కాంప్లెక్సుల వల్ల వరద ముప్పు ఎదురవుతుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు.
చెరువుల్లో వరదనీటి నిల్వ తగ్గి కాలనీల్లోకి వరదనీరు
నాలాలు కబ్జాలతో కుచించుకు పోవడంతో పలు కాలనీలు, రోడ్లపైకి వరదనీరు వచ్చింది. తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు,మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువు,లింగంపల్లి గోపి చెరువు,రాయదుర్గంలోని మల్కం చెరువు, మదీనగూడ ఎర్ల చెరువు ,ఉప్పల్ నల్ల చెరువు,బహదూర్ పురాలోని మీరాలం ట్యాంకు,నాచారం చెరువు, కుతుబుల్లాపూర్ కాలనీలోని హెచ్‌ఎంటీ సరస్సు వరదనీటితో నిండిపోయాయి. మేళ్ల చెరువు సమీపంలో మూడు ఎత్తైన అపార్టుమెంట్ల ప్రాజెక్టులను ప్రముఖ బిల్డర్లు నిర్మిస్తున్నారు. అదే ప్రాంతంలోని వనం చెరువు, చెల్లి కుంటల వద్ద ఆక్రమణలు జరిగాయి.మురుగునీటితోపాటు చెత్త వల్ల చెరువుల్లోని నీరు కలుషితమైంది.
హైదరాబాద్ రోడ్లపై నీటి కుంటలు
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల పలు రోడ్లపై వరదనీరు నిలిచాయి. కూకట్‌పల్లిలో కురిసిన భారీ వర్షాలకు వర్షపునీరు నిలిచింది.భారీ వర్షాల కారణంగా సంభవించే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడానికి నగరం సంసిద్ధతను హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ సమీక్షించారు.
వరదల బారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వ క్లైమెట్ కాంగ్రెస్ టీం
హెచ్ఎండీఏ తెలంగాణలో వేలాది చెరువులున్నాయి. అనంతగిరి నుంచి వాడపల్లి వరకు మూసీనది ప్రవహిస్తోంది.హైదరాబాద్ నగర శివార్లలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు మంచినీటి రిజర్వాయర్లున్నాయి. జన్వాడ నుంచి హుసేన్ సాగర్ దాకా బుల్లాపూర్ నాలా, ఫిరంగి నాలా చందన్ వెల్లి గ్రామం నుంచి ఇబ్రహీంపట్నం చెరువు దాకా ప్రవహిస్తోంది. ఈ నాలా కబ్జాల పాలవడంతో వరదనీరు పోయే మార్గం లేకుండా పోయిందని క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
లేక్ సిటీలో నీటి సమస్య
హైదరాబాద్ లో ఇన్ని నదులు, చెరువులు ఉన్నందున మంచినీటి సమస్య ఉండకూడదు.ఆక్రమణల వల్ల గొలుసుకట్టు చెరువులు, నాలాలను కబ్జా చేయడం వల్ల వరదనీటితో పలు కాలనీలు మునుగుతున్నాయి. రామంతాపూర్, కాప్రా చెరువులు కూడా కబ్జాల పాలయ్యాయని డాక్టర్ లుబ్నా పేర్కొన్నారు.
సరస్సుల ఆక్రమణలు
హైదరాబాద్ నగరంలోని సరస్సుల ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లలో ఆక్రమణల కారణంగా ఈ సరస్సుల నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయింది.దీంతో వరదనీరు చెరువుల చుట్టూ ఉన్న కాలనీలు, మురికివాడల్లో చేరి ముంపునకు గురవుతున్నాయి.జీఓ 111 ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి వరదనీరు చేరింది. జీఓ 111 పరిధిలోని జన్వాడ, ఖానాపూర్, అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, మియాఖన్‌గడ్డ ప్రాంతాల ప్రజలు ముంపునకు గురవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైడ్రాకు ఫిర్యాదులు
హైదరాబాద్ నగరంలో ఒక వైపు భారీవర్షాలు కురుస్తున్నా హైడ్రాకు ఒక్క రోజులో చెరువుల ఆక్రమణలపై 139 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 129 ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ టోలిచౌకి, షేక్‌పేట్ పరిసర ప్రాంతాల్లో సందర్శించి వరదపీడిత ప్రాంతాలను పరిశీలించారు.తమకు వస్తున్న ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వరదనీటి ఫిర్యాదులలో 115 చెట్లు కూలినవి. 24 ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది.
గొలుసుకట్టు చెరువుల కబ్జా
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో పలు చెరువులు కబ్జాల పాలయ్యాయని శంషాబాద్ నుంచి పల్లెచెరువు నాలాలు కబ్జా అయ్యాయి. జల్ పల్లి ఉందాసాగర్ చెరువులో మట్టి నింపి కబ్జా చేశారు. జల్ పల్లి పల్లెచెరువు కూడా కబ్జాల పాలైంది. పలు చెరువుల కింద ఆక్రమణలను తొలగించాలని గతంలో నోటీసులు జారీ చేసినా పట్టించుకోలేదు. బండ్లగూడ చెరువు కూడా కబ్జాలతో కుచించుకు పోయింది. గుర్రం చెరువును ఆక్రమించేశారు. హైడ్రానే ఆక్రమణలను తొలగించాలని డాక్టర్ లుబ్నా సార్వత్ కోరారు.వరదల నివారణతోపాటు హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా కోసం 1931 వ సంవత్సరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాంకేతిక సహకారంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు.
సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్‌కు నాగబాబు అభినందన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్పెప్ట్ ను సినీనటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అభినందించారు. ఈ మేర నాగబాబు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. భారీవర్షాలతో చెరువులు, నాలాలు ఉప్పొంగి అపార్టుమెంట్లలోకి వరదనీరు వచ్చి సామాన్యులు బలి కావడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేసినందువల్లనే ఈ వరదలు వెల్లువెత్తాయని ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులు, సిబ్బందికి సీఎం రేవంత్ అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా, వరదల వల్ల చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ప్రజానీకానికి అత్యవసర సేవలు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తోన్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యుత్ పునరుద్దరణ పనుల్లో సిబ్బంది నిమగ్నమైన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ భారీ వర్షంలో విరిగిన చెట్టు కొమ్మల మధ్య ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రానికి వెలుగులు పంచేందుకు రాజీలేకుండా అంకితభావంతో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, సిబ్బందికి, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో పోస్టు పెట్టారు.
Next Story