రోజుకో చెరువు కబ్జా కథ వెలుగులోకి...
x

రోజుకో చెరువు కబ్జా కథ వెలుగులోకి...

హైదరాబాద్ నగర ప్రాంతాల్లో 2,551 చెరువులున్నాయి. లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్‌లో చెరువుల కబ్జాలతో కుచించుకుపోయాయి..కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.


హైదరాబాద్ నగరంలో రోజుకో చెరువు కబ్జా కథ వెలుగుచూస్తోంది. వేలాది చెరువులతో లేక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ నేడు కబ్జాలతో నగరం అతలాకుతలమైంది.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని చెరువులకు ఐడీ నంబర్లు ఇచ్చి, ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ల వివరాలు, కబ్జాలపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది.
హెచ్ఎండీఏ పరిధిలో వేలాది గొలుసుకట్టు చెరువులు ఉండటంతో హైదరాబాద్ లేక్ సిటీగా పేరొందింది. గతంలో కాకతీయులు, నిజాం నాటి కాలంలో తవ్విన చెరువులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని కుచించుకుపోతున్నాయి.

లేక్ సిటీలో కబ్జాల బాగోతం...
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2,551 చెరువులున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో చెరువు స్థలాల్లో వెంచర్లు వెలిశాయి. కొందరు కబ్జాదారులు రాజకీయ నాయకులు, అవినీతి అధికారుల అండదండలతో చెరువులను చెర బట్టారు. ఒకటి కాదు రెండు కాదు వందలాది చెరువులను కబ్జాదారులు ఆక్రమించడంతో వర్షపునీటి నిల్ల సామర్ధ్యం తగ్గి నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.

కబ్జాలతో కుచించుకు పోయిన చెరువులు
సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేసం, ఈడిగివాని కుంటల్లోని ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్లలో సర్వే నంబర్లలో పట్టాలున్నాయని తేలింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలు చెరువులు కబ్జాలతో వాటి విస్తీర్ణం తగ్గిపోయింది. కొన్ని చెరువుల్లో పూడిక చేరి నీటి నిల్వ సామర్ధ్యం తగ్గింది.


పెద్దచెరువులో 30 ఎకరాలు కబ్జా
రాజేంద్రనగర్ పరిధిలోని ప్రేమావతిపేట ప్రాంత ములుగుందు పెద్ద చెరువులో 30 ఎకరాలు కబ్జాదారుల పరమైందని గూగుల్ ఎర్త్ శాటిలైట్ చిత్రంలో తేలింది. ఈ పెద్ద చెరువు సంవత్సరం పొడవునా ఆక్రమణకు గురైందని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో వెల్లడైంది. పెద్ద చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ కబ్జా పాలవడంతో 2017,2020 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో వరదలు వెల్లువెత్తాయి.

సాకి చెరువులో 18 అక్రమ నిర్మాణాలు
పటాన్ చెరు పరిధిలోని సాకి చెరువు కబ్జాల పాలైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం జరిపిన తనిఖీల్లో తేల్చారు. సాకి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో స్థలాలను పూడ్చి 18 భవనాలు నిర్మించారని వెల్లడైంది. సాకి చెరువులో అక్రమ కట్టడాలను గుర్తించిన హైడ్రా కమిషనర్ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను ఆదేశించారు.

అప్పా చెరువులో ఆక్రమణల తొలగింపు
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గంగన్ పహాడ్ పరిధిలోని అప్పా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో అక్రమంగా 18 షెడ్లు నిర్మించారని హైడ్రా అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో అధికారులు శనివారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

పెద్ద చెరువు కబ్జాలు తొలగించండి
ములుగుందు పెద్ద చెరువులోని ఆక్రమణలను తొలగించాలని క్లైమెట్ కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పెద్ద చెరువునకు చెందిన 30 ఎకరాల భూమి కబ్జా చేసినా అధికారులు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని డాక్టర్ లుబ్నా పేర్కొన్నారు.


Read More
Next Story