
పిల్లల్లో ‘రీడింగ్ ప్రోగ్రామ్’ పై పెరుగుతున్న ఆసక్తి
బడుల్లో చేరుతున్న పిల్లలకు కచ్చితంగా మాతృభాష తెలుగు చదవటం, రాయటం వచ్చి ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నది
బడిఈడు పిల్లల్లో చాలామందికి చదవటం కూడా రాదు. చిన్నచిన్న వాఖ్యాలు కూడా చదవలేకపోతున్నారన్న విషయం చాలా బాధాకరమనే చెప్పాలి. కలెక్టర్లు, డీఈవోలు ఏదో ఒక స్కూలుకు వెళ్ళి 5,6 తరగతులకు వెళ్ళి పుస్తకాలు ఇచ్చి చదవమన్నపుడు పిల్లలు చదవలేకపోయారనే వార్తలు అందరు చూస్తున్నదే. అందుకనే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)ప్రభుత్వం చిన్నపిల్లల్లో చదువుపై ఆసక్తిని కలిగించటమే టార్గెట్ గా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే ‘రీడింగ్ ప్రోగ్రామ్’(Reading Programme)అనే కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. నిజానికి ఈప్రోగ్రామ్ కొత్తదేమీకాదు కాకపోతే గతంలో ఈ ప్రోగ్రమ్ అమలు ఏదో మొక్కుబడిగా సాగేది. ఇపుడు బడుల్లో చేరుతున్న పిల్లలకు కచ్చితంగా మాతృభాష తెలుగు చదవటం, రాయటం వచ్చి ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నది.
అందుకనే ప్రభుత్వ బడుల్లో 1,2,3 తరగతుల్లో చదువుతున్న పిల్లలకు తప్పనిసరిగా చదువును పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని కార్యాచరణకు దిగింది. దీనిఫలితంగా రాష్ట్రంలోని సుమారు 20 వేళ్ళ స్కూళ్ళల్లో రీడింగ్ ప్రోగ్రామ్ ను అమలుచేస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పిల్లలకు ఒకగంటపాటు చదువుకోవటాన్ని అలవాటు చేస్తారు. చదువుకోవటం అంటే తరగతి పుస్తకాలు కావచ్చు లేదా కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు కూడా కావచ్చు. చిన్నపిల్లలుగా ఉన్నపుడే చదవుకోవటంపై ఆశక్తిని కలిగిస్తే పెద్దయిన తర్వాత కూడా చదువుకోవటంపైనే ఎక్కువగా దృష్టి పెడతారని ప్రభుత్వం ఆశిస్తోంది.
రీడింగ్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని విద్యాశాఖలోని సర్వశిక్ష అభయాన్(ఎస్ఎస్ఏ)పర్యవేక్షిస్తోంది. స్కూళ్ళల్లో చిన్నపిల్లలకోసం ప్రత్యేకించి లైబ్రరీలను అభయాన్ ఏర్పాటుచేసింది. ఇంగ్లీషులో 26 వేల పుస్తకాలు, తెలుగులో మరో 26వేల పుస్తకాలను పిల్లలకు అందుబాటులోకి ఉంచింది. 26వేల స్కూళ్ళల్లో అభయాన్ లైబ్రరీలను కూడా ఏర్పాటుచేసింది. ప్రతి స్కూలుకు పుస్తకాలు, పుస్తకాలు పెట్టుకునేందుకు ర్యాకులు, బల్లలను సరఫరాచేసింది.
అందరికీ తెలిసిన సమస్య ఏమిటంటే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళవరకు చాలామంది మొబైల్ ఫోన్లకు బానిసలైపోయారు. ఊపిరి తీసుకోవటం అన్నా కాసేపు ఆపేస్తారేమో కాని మొబైల్ చూడకుండా మాత్రం క్షణమాత్రం కూడా ఉండలేని వారెందరో ఉన్నారు. యువత చాలామందిలో ఈపరిస్ధితి మరీ విచిత్రంగా తయారైంది. వీరు నిద్రలేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు మొబైల్ ను చూడకుండా ఉండలేకపోతున్నారు. చివరకు బాత్ రూముల్లోకి కూడా మొబైళ్ళను తీసుకుని వెళుతున్నా యువత ఎంతోమందున్నారు. చిన్నపిల్లలు మొబైల్ వ్యసనపరులు కాకూడదంటే చదువుపైన చిన్నప్పటినుండి ఆసక్తి కలిగించటం ఒకటే మార్గమని ఎంతోమంది మానసిక నిపుణులు, డాక్టర్లు, కౌన్సిలర్లు చెబుతున్నారు.
అందుకనే అన్నీకోణాల్లో ఆలోచించిన ప్రభుత్వం రీడిండ్ ప్రోగ్రామ్ ను ఒకటో తరగతి, రెండో తరగతి, మూడవ తరగతి చదువుతున్న పిల్లల్లో చదువుపై ఆసక్తి కలిగించేందుకు గట్టిగా కృషిచేస్తోంది. ఆల్రెడీ మొబైల్ ఫోన్లకు, టీవీలకు వ్యసనపరులైపోయిన వారిని చేయగలిగేది ఏమీలేదు. కనీసం చిన్నపిల్లలను అయినా మొబైల్, టీవీలకు దూరంగా ఉంచాలన్నది ప్రభుత్వధ్యేయంగా కనబడుతోంది. అయితే ఈవిషయాన్ని ప్రభుత్వం బహిరంగంగా ఎక్కడా ప్రకటించలేదు. రీడింగ్ ప్రోగ్రామ్ ద్వారా సుమారు 20 లక్షల మంది పిల్లల్లో పుస్తకాలు చదవటంపై ఆసక్తిని ప్రభుత్వం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
విద్యార్ధి ఒక్కడుగాను, ఇద్దరు కలిసి లేదా ముగ్గురితో కలిసి పుస్తకాలు చదువటం, బొమ్మలను గుర్తుపట్టడం, బొమ్మలను గీయటంపై టీచర్లు ఆసక్తిని కలిగిస్తున్నారు. స్కూళ్ళల్లో ఉన్నపుడు పిల్లలకు చదువుపై టీచర్లు ఆసక్తిని కలిగిస్తారు. టీచర్లు దగ్గరుండి పిల్లలతో చదివిస్తారు. మరి ఇంటికివెళ్ళిన తర్వాత పిల్లల పరిస్ధితి ఏమిటి ? ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకు పెద్దలే మొబైల్ ఫోన్లు లేకపోతే టీవీ రిమోట్లు ఇచ్చేస్తున్నారు. అల్లర్లు భరించలేక, ఇంటిపనులకు అడ్డంపడుతున్నారన్న కారణంగా చాలామంది తల్లులే పిల్లలకు మొబైళ్ళు, టీవీ రిమోట్లు ఇచ్చేస్తున్నారు. దాంతో తమకుతెలీకుండానే పిల్లలు చిన్నప్పటినుండే మొబైళ్ళు, టీవీలకు బానిసలుగా మారిపోతున్నారు.
అందుకనే పిల్లలు స్కూళ్ళనుండి వచ్చిన తర్వాత ఇళ్ళల్లో తల్లి, దండ్రులు లేదా పెద్దలు పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని మళ్ళీ కథలపుస్తకాలు, బొమ్మల పుస్తకాలు చదివించాలి. స్కూలులోను, ఇంట్లో కూడా పిల్లలు చదువుకోవటంపై టీచర్లు, పెద్దలు పట్టువదలకుండా ఆసక్తిని పెంచాలి. ఇలా కొంతకాలం సాగితే అప్పుడు పిల్లలే తమంతట తాముగా పుస్తకాలు తీసుకుని చదువుకోవటం అలవాటు చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఒకసారి చదువుకోవటంపై ఆసక్తి పెరిగితే స్కూలు నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొబైల్, టీవీల జోలికి వెళ్ళకుండా పుస్తకాలు తీసుకుంటారు. పుస్తకాలు చదవటంతో పాటు ఆటలపైన కూడా ఆసక్తిని కలిగిస్తే పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారన్నది ప్రభుత్వం ఆలోచన.
పిల్లలకు పుస్తకాలను చేరువచేయాలి : రాజీవ్
పుస్తకాలు చదవాలన్న ఆసక్తిని పిల్లల్లో కలగచేయాల్సిన బాధ్యత స్కూళ్ళల్లో టీచర్లు, ఇంట్లో పెద్దవాళ్ళమీదే ఉంటుందని సర్వశిక్ష అభయాన్ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ చెప్పారు. ‘తెలంగాణ’ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘పుస్తకాలు చదవాలన్న జిజ్ఞాస పెరిగితే తప్పకుండా పిల్లల్లో పుస్తకపఠనంపై ఆసక్తి పెరుగుతుంద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘పుస్తకాలు చదవటాన్ని భారంగా కాకుండా మేథస్సును పెంచే సాధనంగా ప్రభుత్వం భావిస్తున్న’’ట్లు చెప్పారు. ‘‘పిల్లల ఆసక్తిని బట్టి స్కూళ్ళల్లో వేలాది పుస్తకాలను అందుబాటులో ఉంచి’’నట్లు చెప్పారు. ‘‘ఇందుకోసం ప్రత్యేకంగా స్కూళ్ళల్లో లైబ్రరీలను కూడా ఏర్పాటుచేశామ’’ని అన్నారు. పుస్తకాలు చదవటం వల్ల చిన్న పిల్లల్లో భాషాజ్ఞానం కూడా పెరుగుతుందని జాయింట్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
‘‘ప్రతిస్కూలు టైం టేబుల్లో ఇతర పీరియడ్లు ఉన్నట్లు పుస్తకాలు చదవటంకోసమే ప్రత్యేకంగా పీరియడ్లను రూపొందించి’’నట్లు చెప్పారు. పిల్లలకు దగ్గరుండి టీచర్లు పుస్తకాలు చదవటం నేర్పిస్తున్నారన్నారు. ‘‘చదవలేని పిల్లలకు టీచర్లే పుస్తకాల్లోని బొమ్మలను చూపిస్తు లేదా కథలను చదివి వినిపించటం ద్వారా పుస్తకాలు చదవాలన్న ఆసక్తిని పెంచేందుకు కృషిచేస్తున్న’’ట్లు చెప్పారు. ‘‘లైబ్రరీని పిల్లలకు అందుబాటులో ఉంచటం, పుస్తకాలను క్రమపద్దతిలో అమర్చటం లాంటివి స్కూళ్ళల్లో టీచర్లే చేస్తున్నార’’ని అన్నారు. ‘‘2023-24 విద్యా సంవత్సరంలో స్కూళ్ళలో 15వేల పుస్తకాలను అందుబాటులో ఉంచామని చెప్పిన రాజీవ్, 2024-25లో 26 పుస్తకాలను అందుబాటులోకి తెచ్చి’’నట్లు చెప్పారు. అలాగే ‘‘ఈఏడాది మరిన్ని ఎక్కువపుస్తకాలను స్కూళ్ళకు పంపబోతున్న’’ట్లు జాయింట్ డైరెక్టర్ రాజీవ్ చెప్పారు. ప్రభుత్వ కృషివల్ల చిన్నపిల్లల్లో పుస్తకాలు చదవాలన్న ఆసక్తి పెరుగుతున్నదని తమ అధ్యనంలో తేలిందన్నారు.
ఆసక్తి పెరుగుతోంది : కండోజు
చదువుపై పిల్లల్లో ఆసక్తిని పెంచే రీడింగ్ ప్రోగ్రామ్ లో సర్వశిక్ష అభయాన్ తో కలిసి ‘రూమ్ టు రీడ్’ అనే స్వచ్చంధ సంస్ధ కూడా కృషిచేస్తోంది. ఈ సంస్ధ స్టేట్ హెడ్ కండోజు నరసింహాచారి మాట్లాడుతు ‘‘ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చిన్నపిల్లల్లో చదువుపై ఆసక్తిని కలిగించేందుకు తమసంస్ధ కృషిచేస్తున్నద’’ని చెప్పారు. ‘‘1,2,3 తరగతులు చదువుతున్న పిల్లల్లో పుస్తకాలు చదవటంపై ఆసక్తిని పెంచేట్లుగా తమసంస్ధ ప్రయత్నాలు చేస్తోంద’’న్నారు. ‘‘ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 50 పాఠశాలలు, సిద్ధిపేట జిల్లాలో 30 స్కూళ్ళల్లోని ప్రైమరీ తరగతుల పిల్లలకు చదవటంపై ఆసక్తిని పెంచుతున్న’’ట్లు చారి తెలిపారు. ‘‘పిల్లల్లో ఒకసారి చదువుపై ఆసక్తి కలిగితే అందులోను చిన్నపుడే ఆసక్తి ఏర్పడితే చదివే అలవాటు వయసుతో పాటు పెరిగిపెద్దది అవుతుంద’’ని చారి తెలిపారు.
చాలామంచి కార్యక్రమం: పల్లె
‘‘రీడింగ్ ప్రోగ్రామ్ చాలామంచి కార్యక్రమం’’గా ఏటూరి నాగారం స్కూలు టీచర్ పల్లె నాగరాజు అభివర్ణించారు. ‘‘పుస్తకాలు చదవే అలవాటును చిన్నప్పటి నుండే చేస్తే మానసికంగా ఆరోగ్యంగా పిల్లలు ఎదుగుతార’’ని అభిప్రాయపడ్డారు. ‘‘తమ స్కూలులో పిల్లలను ప్రతిరోజు క్రమంతప్పకుండా చదివిస్తున్న’’ట్లు చెప్పారు. ‘‘ఇందుకోసం పిల్లలకు ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింద’’న్నారు. ‘‘పుస్తకాలు చదవాలన్న ఆసక్తి ఇప్పుడిప్పుడే తమ స్కూలు పిల్లల్లో పెరుగుతోంద’’ని పల్లె నాగరాజు తెలిపారు.