
‘టెలిఫోన్ ట్యాపింగ్’ శ్రవణ్ రావు చీటింగ్ కేసులో అరెస్టు
అరెస్టయిన శ్రవణ్ ను జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించారు
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న నిందితుడు శ్రవణ్ రావు మరో చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. అఖండ్ ఇన్ఫ్రాటెక్ అనే సంస్ధను చీట్ చేసినందుకు క్రైం పోలీసులు శ్రవణ్ అరెస్టుచేసి రిమాండుకు పంపారు. విషయం ఏమిటంటే అఖండ్ ఇన్ ఫ్రాటెక్ కంపెనీ ఆధ్వర్యంలో 2008 నుండి అనేక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. 2022తో అఖండ్ కంపెనీ ఎండీ ఆకర్ష్ కృష్ణను కలిసిన శ్రవణ్ తనను తాను కర్నాటకలోని సండూర్, బళ్ళారిలోని ఎకోర్ ఇండస్ట్రీస్ ఐరన్ ఓర్ కంపెనీకి ఏజెంటుగా పరిచయంచేసుకున్నాడు. ముడిఇనుము సరఫరాలో టన్నుకు రు. 300 కోట్లు లాభం వస్తుందని నమ్మించాడు. అఖండ్ కంపెనీ ద్వారా ముడిఇనుము బిజినెస్ చేయచ్చని, అలా చేసిన బిజినెస్ లో తనకు కమీషన్ ఇచ్చేట్లుగా ఆకర్ష్ ను ఒప్పించి అగ్రిమెంటు కూడా చేయించాడు.
కమీషన్ అగ్రిమెంట్ అయిన తర్వాత 2022 నవంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు విడతలవారీగా రు. 23 కోట్ల బిజినెస్ కూడా జరిగింది. జరిగిన బిజినెస్ కు సంబంధించి అఖండ్ కంపెనీ యాజమాన్యం శ్రవణ్ కు పూర్తి డాక్యుమెంట్లు అందించింది. అయితే బళ్ళారి, సండూర్ కంపెనీల నుండి బిజినెస్ తాలూకు ఇన్వాయిసులు ఏవీ అఖండ్ కంపెనీకి రాలేదు. ఇదేవిషయమై శ్రవణ్ ను ఆకర్ష్ ఎన్నిసార్లు అడిగినా ఉపయోగంలేకపోయింది. దాంతో ఆకర్ష్ నేరుగా బళ్ళారిలోని ఎకోర్ కంపెనీ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డిని కలిసి మాట్లాడారు. అయితే తమకంపెనీ నుండి అఖండ్ కంపెనీ పేరుతో ఇన్ వాయిసులను శ్రవణ్ తీసేసుకున్నట్లు ఉమా చెప్పటంతో ఆకర్ష్ కు షాక్ తగిలింది. అఖండ్ కంపెనీ తన సొంతకంపెనీగా శ్రవణ్ తనతో చెప్పి అవసరమైన ఇన్ వాయిసులను తీసేసుకున్నట్లు వివరించాడు.
జరిగిన విషయాలను గమనించిన ఆకర్ష్ తమ కంపెనీకి రావాల్సిన రు. 6.58 కోట్ల కమీషన్ శ్రవణ్ తో పాటు ఆయన భార్య స్వాతిరావు, ఎకోర్ సంస్ధ డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డి తీసుకుని తనను మోసగించినట్లు నిర్ధారించుకున్నారు. దాంతో పై ముగ్గురిపై ఆకర్ష్ పోయిన నెల 25వ తేదీన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై శ్రవణ్ ను విచారించిన పోలీసులు తర్వాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అరెస్టయిన శ్రవణ్ ను జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించారు. మొత్తానికి ఏదో పద్దతిలో శ్రవణ్ అరెస్టయి జైలుకు వెళ్ళాడు.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బయటపడిన టెలిఫోన్ ట్యాపింగ్(Telephone tapping case) కేసు తెలంగాణలో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్(KCR) అండచూసుకుని ప్రత్యర్ధుల వేలాది మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ లో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ టీ ప్రభాకరరావుతో పాటు శ్రవణ్ కూడా కీలకపాత్రదారి. ట్యాపింగ్ కేసులో మొదటి అరెస్టు జరగ్గానే ప్రభాకరరావుతో పాటు శ్రవణ్ కూడా అరెస్టుభయంతో దేశం విడిచిపారిపోయాడు. ఏడాదికి పైగా అమెరికా(America)లోనే తలదాచుకున్న ఈ నిందితుడు సుప్రింకోర్టులో పిటీషన్ వేసి అరెస్టు నుండి రక్షణపొందిన తర్వాత ఇండియాకు తిరిగొచ్చాడు. ఏప్రిల్ నెలనుండి ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నాడు. ఇప్పటికి మూడుసార్లు విచారణకు హాజరైనా శ్రవణ్ మాత్రం అధికారులు అడిగిన మొబైల్ ఫోన్లను, వివరాలను మాత్రం ఇవ్వటంలేదని తెలిసిందే. దాంతో శ్రవణ్ ముందస్తుబెయిల్ ను రద్దుచేయాలని సుప్రింకోర్టులో సిట్ అధికారులు పిటీషన్ దాఖలుచేశారు. ట్యాపింగ్ కేసు విచారణ ఎలాగున్నా చీటింగ్ కేసులో శ్రవణ్ ను సీసీఎస్ పోలీసులు అరెస్టుచేయ్యాడు. ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి.