కాంగ్రెస్, బీఆర్ఎస్ లో పెరిగిపోతున్న ‘ఫిరాయింపు’ల టెన్షన్
x
Speaker and BRS Defection MLAs

కాంగ్రెస్, బీఆర్ఎస్ లో పెరిగిపోతున్న ‘ఫిరాయింపు’ల టెన్షన్

విచారణ పూర్తయిన ఎనిమిదిమంది ఎంఎల్ఏల అనర్హతపై బుధవారం నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి


వేటు వేస్తారా ? వేటునుండి తప్పించుకుంటారా ? ఇపుడిదే రెండు ప్రధానపార్టీల నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పదిమంది ఎంఎల్ఏలు ఫిరాయించిన విషయం తెలిసిందే. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయించాలని (BRS)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR)కేటీఆర్, కొందరు ఎంఎల్ఏలు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోవటంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపేక్షిస్తున్నారని ఆరోపిస్తు కారుపార్టీ నేతలు ముందు హైకోర్టుకు తర్వాత సుప్రింకోర్టుకు వెళ్ళారు. సుప్రింకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఫిరాయింపు ఎంఎల్ఎలపై విచారణ జరుపుతున్నారు. పదిమందిలో ఎనిమింది ఎంఎల్ఏల విచారణ పూర్తయిపోయింది. మిగిలిన ఇద్దరు ఎంఎల్ఏలకు స్పీకర్ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాకుండా సమయం కావాలని కోరుతున్నారు.

ఈనేపధ్యంలోనే విచారణ పూర్తయిన ఎనిమిదిమంది ఎంఎల్ఏల అనర్హతపై బుధవారం నిర్ణయం తీసుకుంటారని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి. ఈరోజు మధ్యాహ్నం సుమారు 3.30 గంటల ప్రాంతంలో తన కార్యాలయానికి రావాలని స్పీకర్ నుండి ఫిరాయింపు ఎంఎల్ఏలు, వాళ్ళ లాయర్లతో పాటు ఫిరాయింపు ఎంఎల్ఏల మీద కేసులు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏలతో పాటు వాళ్ళ లాయర్లకు సమాచారం అందించారు. ఎనిమిది మంది ఎంఎల్ఏల ఫిరాయింపు ఆరోపణలపై విచారణ పూర్తయిపోయింది కాబట్టి, సుప్రింకోర్టును స్పీకర్ అడిగిన నాలుగువారాల గడువు కూడా అయిపోయింది కాబట్టి ఈరోజు కచ్చితంగా ఎనిమింది పై తననిర్ణయాన్ని స్పీకర్ ప్రకటిస్తారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.

బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు, గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ, చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య, బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి అనర్హతపైన ఈరోజు స్పీకర్ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. అలాగే విచారణకు హాజరుకాని స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని పైన చెప్పిన ఎనిమిది మంది ఎంఎల్ఏలు స్పీకర్ ముందు తమ వాదనలు వినిపించారు. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనేందుక రుజువులు కూడా చూపించారు. వీళ్ళు చూపించిన రుజువులు ఏమిటంటే తాము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, పార్టీ ఫండ్ కింద అసెంబ్లీ నుండి తాము అందుకుంటున్న జీతాల్లోనుండి కొంతమొత్తాన్ని పార్టీనాయకత్వం మినహాయించుకుంటోందని ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆధారాలను చూపించారు. ఇదేసమయంలో పార్టీఆఫీసులకు రాకపోవటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవటం, నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవ్వటాన్ని కేటీఆర్ అండ్ కో పార్టీ మారారు అనేందుకు ఫిరాయింపులకు వ్యతిరేకంగా వాదిస్తున్నారు.

తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించుంటే తమ జీతాల్లోనుండి నాయకత్వం పార్టీ ఫండ్ ఎందుకు తీసుకుంటోంది అన్నప్రశ్నకు బీఆర్ఎస్ నాయకత్వం సమాధానం చెప్పలేకపోతోంది. ఇలాంటి పాయింట్ల మీదే రెండువైపుల లాయర్ల నెలల తరబడి వాద ప్రతివాదాలు వినిపించారు. రెండువైపుల వాదనలు విన్న స్పీకర్ ఫైనల్ గా ఈరోజు ఏమి తీర్పు చెప్పబోతున్నారు అన్నవిషయంలోనే ఫిరాయింపులతో పాటు రెండుపార్టీల్లోను టెన్షన్ పెంచేస్తోంది. చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.

Read More
Next Story