
‘అమాయకుల్ని చంపే వారితో చర్చలేంటి?’
మావోలు దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా? మావోయిస్ట్ సానుభూతి పరులు సాధించింది ఏంటి? అని ప్రశ్నించారు.
మావోయిస్ట్‌లతో చర్చించాలి అన్న అంశంపై కేంద్ర సహాయ మంత్రి బండిసంజయ్ మరోసారి స్పందించారు. అసలు తుపాకులు పట్టి అమాయకులను హతమార్చే వారితో చర్చలు చేసే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. ‘‘మావోలు పట్టిన తుపాకులకు ఎంతమంది బలయ్యారు, ఎందరు అమాయకులు అసువులు బాసారు. ఈ హత్యలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. రామగుండంలో పర్యటించిన ఆయన మావోలతో చర్చించడంపై కేంద్రం వైఖరి ఏంటి అన్న అంశంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందని అన్నారు.
‘‘మావోలు దశాబ్దాలుగా అమాయకులను కాల్చి చంపిన సంగతి గుర్తు లేదా? మావోయిస్ట్ సానుభూతి పరులు సాధించింది ఏంటి? మావోలు ఎవరైనా తుపాకీని విడిచి లొంగిపోవాల్సిందే? జన జీవన స్రవంతిలో కలవాల్సిందే. పౌర హక్కుల సంఘం నేతలారా.. సక్సల్స్‌కు నచ్చజెప్పండి’’ అని స్పష్టం చేశారు. అనంతరం కులగణన అంశంపై కూడా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అసలు కులగణనే కాదు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పుల తడక అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో సర్వే మాత్రమే జరిగిందని అన్నారు. అసలు బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన పార్టీనే కాంగ్రెస్ అని చురకలంటించారు.