
Revanth Reddy | ‘కుల గణనలో ఒక్క తప్పూ లేదు’
మోదీ విషయంలో తాను తప్పేమీ చెప్పలేదని రేవంత్ అన్నారు.
తమ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో ఒక్క తప్పు కూడా లేదని, ఉంటే దాన్ని వెంటనే చూపాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆయన హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు అంశాలపై రేవంత్.. రాహుల్‌తో చర్చించారు. రాహుల్.. రాష్ట్ర పరిస్థితులను వివరించారు రేవంత్. అనంతరం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన అంశంపై చర్చించారు. ప్రజలు చెప్పిన వివరాలే రికార్డుల్లో నమోదయ్యాయని, ఒక్కో ఎన్యుమరేటర్‌కి 150 ఇళ్లు మాత్రమే కేటాయించామని ఆయన చెప్పారు.
‘‘కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో 4 కేటగిరీలు మాత్రమే చూపారు. అందులో 'బీసీ'లు 51% శాతం, 'ఎస్సీ'లు 18%, 'ఎస్టీ'లు 10% శాతం, మిగతావాళ్ళు 'ఓసీ'లుగా చూపారు. మా సర్వేలో మొత్తం 5 కేటగిరీలుగా విభజించి, ముస్లింలలో ఉన్న బీసీలను కూడా కలిపి చెప్పాము. ఆ ప్రకారం హిందూ, ముస్లిం బీసీలంతా కలిసి 56% అయ్యారు. 42% బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి, పార్లమెంట్ ఆమోదానికి పంపిస్తాం. రాజకీయ జోక్యానికి తావులేకుండా కమిషన్ ద్వారానే ప్రాసెస్ చేస్తున్నాం. కేసీఆర్ సర్వేలో ఎస్సీలు 82 కులాలుగా చూపారు. కానీ ఉన్నవి 59 కులాలే. స్పెల్లింగ్ తప్పుగా ఎంట్రీ అయినా దాన్ని మరో కులంగా చూపారు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసిన నేను పట్టించుకోను’’ అని తెలిపారు.
‘‘రాహుల్ గాంధీ చెప్పిన మేరకే కులగణన సహా అన్నీ చేస్తున్నాను. మోదీ విషయంలో నేను ఎటువంటి తప్పుడు కామెంట్ చేయలేదు. ఆయన హోదాను తగ్గించి లేదా అగౌరవపరిచి మాట్లాడలేదు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నాను. కిషన్ రెడ్డి కూడా అదే మాట చెప్పారు. కాకపోతే ఎప్పుడు బీసీ గా మారారు అన్న తేదీ సమయం విషయంలోనే తేడా ఉండొచ్చు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన తేదీనే నేను అంగీకరిస్తున్నాను’’ అని స్పష్టం చేశారు.