
అప్పుడు సర్పంచ్... ఇప్పుడు కూలీ
ఐదేళ్లు ప్రజాప్రతినిధిగా పేద ప్రజలకు సేవలు
కుల వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తి రిజర్వేషన్ వర్తించడంతో గ్రామస్థుల కోరిక మేరకు ఏక గ్రీవంగా సర్పంచ్ అయ్యారు. ఐదేళ్లు సర్పంచ్ గా పని చేసినా ఆయన ఏమీ సంపాదించుకోలేకపోయారు. పందులను సాకే కులవృత్తిలో ఉన్న కుర్ర ఎల్లయ్య సర్పంచ్ కాగానే అధికారుల కోరిక మేరకు కులవృత్తిని వదులుకున్నాడు. ప్రస్తుతం జీవనోపాధికి దినసరి కూలీ అవతారమెత్తారు.
కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య 2014లో సర్పంచ్ గా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి వరకు ఎస్ సి సామాజిక వర్గానికి చెందిన ఎల్లయ్య పందులు మేపుతూ జీవనోపాధి పొందేవారు. నర్సన్నపల్లి ఎస్సి సామాజిక వర్గానికి రిజర్వ్ కావడంతో ఎల్లయ్య సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. గ్రామస్థుల కోరిక మేరకు ఎల్లయ్యకు పోటీగా అభ్యర్థి నిల్చోకపోవడంతో ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిల్చిన్న ఎల్లయ్య సర్పంచ్ గా ఉన్న ఐదేళ్ల కాలంలో సంపాదించుకోలేదని గ్రామస్థులు చెబుతుంటారు.
ప్రస్తుతం ఎల్లయ్య కెసీఆర్ ప్రభుత్వ హయాంలో వచ్చిన డబుల్ బెడ్ రూం తప్పితే మరే ఆధారం లేదు. సర్పంచ్ కాకమునుపు ఎల్లయ్య పూరి గుడిసెలోనే నివాసముండేవారు. సర్పంచ్ అయిన తర్వాత కూడా నిరుపేద జీవితాన్ని గడిపిన ఎల్లయ్య కుల వృత్తిని మానలేదు. పందులను మేపుతూ జీవనోపాధి పొందారు. హుందాగా బ్రతకాలని అధికారుల కోరికమేరకు కుల వృత్తిని త్యజించారు. తనకున్న పందులను కూడా అమ్మివేశారు. ప్రస్తుతం సర్పంచ్ పదవీకాలం ముగియడంతో బతుకుదెరువు కోసం కూలీ అవతారమెత్తారు. రోజు కూలీ చేసుకుని భార్యా పిల్లలను పోషించుకుంటున్నారు. జీవితంలో ఒకసారి సర్పంచ్ అయితే చాలు ఒక తరానికి ఆస్తులను కూడగట్టే అవకాశమున్నప్పటికీ ఎల్లయ్య మాత్రం నిజాయితీగా బ్రతికినట్టు గ్రామస్థులు చెబుతుంటారు .
తనతో పాటు ఎన్నికైన సర్పంచ్ లు ఎంతో కొంత కూడగట్టుకుని దర్జాగా బ్రతుకుతుంటే తాను మాత్రం కూలీగా బ్రతుకుతున్నట్టు మాజీ సర్పంచ్ ఎల్లయ్య వాపోయారు. ఉపాధి చూపించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

