పోకిరీలున్నారు..పారాహుషార్
x
యువతిని వేధిస్తున్న పోకిరీలు (ఫైల్ ఫొటో : షీ టీమ్ సౌజన్యంతో)

పోకిరీలున్నారు..పారాహుషార్

హైదరాబాద్ లో బహిరంగ వేడుక ఏదైనా పోకిరీల వేధింపులు పెరుగుతున్నాయి.గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా పోకిరీలున్నారు జర జాగ్రత్త అంటూ షీ టీమ్ అలర్ట్ ప్రకటించింది.


ఖైరతాబాద్ లోని మహా గణపతిని దర్శించుకునేందుకు నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, బాలికలు తరలివచ్చారు. భక్తి భావంతో బడా గణేష్ ను చూసేందుకు వచ్చిన మహిళలను కొందరు పోకిరీలు లైంగికంగా వేధించారు. క్యూలైన్లలో మహిళలు, యువతుల వెనుక ఉండి లైంగికంగా వేధించిన 900 మంది పోకిరీలను మఫ్టీలో విధుల్లో ఉన్న షీ టీమ్ బృందాలు వీడియో తీసి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయి. ఈ ఏడాది కేవలం పదిరోజుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు 900 మంది పోకిరీలను షీ టీమ్ పట్టుకోవడం సంచలనం రేపింది. వినాయక నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో శనివారం ఇదే అదనుగా తీసుకొని పోకిరీలు అమ్మాయిలను అనుచితంగా తాకుతూ లైంగికంగా వేధిస్తున్నారని షీటీమ్ డీసీపీ లావణ్య నాయర్ చెప్పారు. పోకిరీల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండి, ఎవరైనా వేధిస్తే షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు.


15 షీ టీమ్ బృందాలతో నిఘా
ఖైరతాబాద్ బడా గణేష్ మండపం వద్ద పోకిరీలను పట్టుకునేందుకు సీసీటీవీ నిఘాతో పాటు 15 షీ టీమ్ మఫ్టీ బృందాల సభ్యులు జనంలో కలిసి తిరుగుతూ మహిళలను వేధిస్తున్న పోకిరీలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తమ మఫ్టీ షీ టీమ్ పోలీసులు మహిళలను వేధిస్తుండగా వీడియోలు తీసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని నగర డీసీపీ డాక్టర్ లావణ్య నాయర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గణేష్ విగ్రహం వద్ద జనసమూహంలో తమను ఎవరూ గమనించరని పోకిరీలు బాలికలను టచ్ చేస్తూ లైంగికంగా వేధించారని, అలాంటి పోకిరీల ఆటను సివిల్ దుస్తుల్లో ఉన్న షీటీమ్ కట్టించిందని డీసీపీ తెలిపారు.



అనుచితంగా తాకారు...

ఫోన్ లో మాట్లాడుతూ ఒంటరిగా గణేష్ మండపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన ఒంటరి మహిళను ఇద్దరు పురుషులు వెంటాడారు. గుర్తుతెలియని వ్యక్తులు తనను అనుచితంగా తాకారని, తన అనుమతి లేకుండా రంగులు పూశారని, నోటిలో ప్రసాదం పెట్టారని ఓ మహిళ షీ టీమ్ కు ఫిర్యాదు చేశారు. తాను మండపాన్ని దర్శించుకునేందుకు వస్తే తన రొమ్ములను ఓ పోకిరీ అనుచితంగా తాకారనని మరో మహిళ ఫిర్యాదు చేశారు.

మహా గణపతి వద్ద 900 మంది పోకిరీల అరెస్ట్
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద గత పదిరోజుల్లో 900 మంది పోకిరీలను షీ టీమ్ పట్టుకొని, వారిపై కేసులు నమోదు చేసింది.కేవలం పదిరోజుల్లోనే ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర మహిళలను 900 మంది పురుషులు లైంగిక వేధించడం సంచలనం రేపింది. బాలికలను వేధించిన పోకిరీల్లో 55 మంది మైనర్లు కూడా ఉన్నారని షీటీమ్ తెలిపింది. తాము పట్టుకున్న పోకిరీలను వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి వదిలేశామని, పదేపదే నేరాలు చేసిన పోకిరీలపై కేసులు నమోదు చేశామని షీ టీమ్ పోలీసులు చెప్పారు.

ప్రతీ ఏటా పోకిరీల బెడద
2024వ సంవత్సరంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనంలో మహిళలను లైంగికంగా వేధించిన 285 మంది పోకిరీలను అరెస్టు చేశారు. 2022వ సంవత్సరంలో 240 మంది పోకిరీలు పట్టుబడ్డారు. ఇలా ప్రతీ ఏటా గణేష్ మండపాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో మహిళలను పోకిరీలు వేధిస్తూనే ఉన్నారని డీసీపీ లావణ్య నాయర్ చెప్పారు. మహిళలు ఒంటరిగా వచ్చినపుడు అపరిచితులతో మాట్లాడవద్దని, ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి రావాలని డీసీపీ సూచించారు. ఎవరైనా పోకిరీలు వేధిస్తే షీ టీమ్ కు ఫిర్యాదు చేయాలని డీసీపీ కోరారు.

పోకిరీలకు షీ టీమ్ కౌన్సెలింగ్


రాచకొండలో 152 మంది పోకిరీల అరెస్ట్

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గత 15 రోజుల్లో 152 మంది పోకిరీలను షీటీమ్ అరెస్ట్ చేసింది. గణేష్ మండపాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిలు మహిళలు, బాలికలను వేధిస్తుండగా మఫ్టీలో ఉన్న షీ టీమ్ వీడియో సాక్ష్యాలతో వారిని పట్టుకుంది. రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్ 152 మంది పోకిరీలను పట్టుకొని వారికి కౌన్సెలింగ్ చేసింది. ఓ మైనర్ బాలికను ప్రేమ పేరిట వేధిస్తుండగా నిందితుడిని అరెస్టు చేశారు.ఇంజినీరింగ్ చదువుతున్న యువతిని వేధిస్తున్న పోకిరీకి పోలీసులు అరదండాలు వేశారు. తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళను పెళ్లాడాలని ఒత్తిడి చేస్తున్న యువకుడిని పోలీసు కటకటాల్లోకి నెట్టారు. యాదగిరిగుట్ట ఓల్డ్ బస్టాండులో బాలికలను వేధిస్తున్న యువకులను షీ టీమ్ అరెస్ట్ చేసింది. పోకిరీల వేధింపులపై తమకు ఫిర్యాదు చేయాలని రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి కోరారు.


Read More
Next Story