
మంత్రుల మధ్య విభేదాలు లేవు
అభిప్రాయ భేదాలు సహజమేనని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ
ఇటీవలె మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. మంత్రుల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలు సహజం. ఈ విభేదాలను ఆయన తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద వ్యవస్థలో మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ వాదినని చెప్పుకొచ్చారు. పదవుల కోసం పార్టీలు మారే స్వభావం తనది కాదని శ్రీధర్ బాబు అన్నారు. తాను ఇతర పార్టీల నుంచి రాలేదని, తరతరాలుగా మేం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నామని శ్రీధర్ బాబు అన్నారు.
ఇదిలా వుండగా ప్రస్తుతం ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఐదారుగురు మంత్రుల మధ్య విభేదాలున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ తదితరులు ఇటీవలె వార్తలలో నిలిచారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సహచరమంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తన శాఖలో ఆ మంత్రుల పెత్తనమేమిటని కొండా సురేఖ ప్రశ్నించారు. ఇంతటితో ఆగకుండాముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. మేడారం టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం పెరిగిందన్నారు. తన అనుచరులకు టెండర్లు కట్టబెట్టడానికి పొంగులేటి ప్రయత్నిస్తున్నారన్నారు. దేవాదాయ శాఖలో పొంగులేటి పెత్తనమేమిటన్నారు. పొంగులేటి జోక్యాన్ని నిరసిస్తూ కొండా దంపతులు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో అటవీ భూముల నుంచి క్లియరెన్స్ కోసం ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ ఇటీవలె అటవీ అధికారులతో సమావేశమయ్యారు. చీప్ ఫారెస్ట్ కన్సర్వేటర్ తో సమావేశం కావడాన్ని కొండాసురేఖ తప్పు పట్టారు. తన శాఖలో వివేక్ పెత్తనమేమిటని ప్రశ్నించారు. వివేక్ తో వివాదం ముగిసినప్పటికీ పొంగులేటి విషయంలో ముదురుతోంది. టెండర్లలో తాను జోక్యం చేసుకోలేదని పొంగులేటి వివరణ ఇచ్చుకున్నారు. అలాగే అడ్లూరి , పొన్నం ప్రభాకర్ మధ్య విభేదాలు వచ్చినప్పటికీ పొన్నం క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది.
Next Story