Mandakrishna | ‘ఎస్సీ వర్గీకరణలో లోపాలు.. వాటిని సరిదిద్దాలి’
15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11శాతం రిజర్వేషన్ దక్కాలి.
తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు పోరాటం చేశామని, తమ పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు. అనేక కమిషన్లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చాయని చెప్పారు. మాదిగ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు కల్పించాలని తాము సుప్రీంకోర్టులో కూడా విన్నవించుకున్నామని, అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఎస్సీ వర్గీకరణ నివేదిక రిపోర్ట్‌లో మాత్రం మాదిగలకు మరోసారి అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ నివేదికలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన నివేదికలో 9శాతం రిజర్వేషన్లే దక్కుతున్నాయని అన్నారు.
‘‘15 లక్షల జనాభా ఉన్న మాలలకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. 32 లక్షలు ఉన్న మాదిగలకు ఏ ప్రాతిపదికన తీసుకున్నా 11శాతం రిజర్వేషన్ దక్కాలి. ప్రభుత్వ ప్రతిపాదించిన రిజర్వేషన్ల పంపిణీలో లోపాలను సరిదిద్దాలి. మాకు రావాల్సిన దానికంటే 2శాతం తక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి’’ అని మందకృష్ణ వ్యాఖ్యానించారు.
నివేదిక రిజర్వేషన్లు ఇలా..
ఎస్సీల్లోని 59 ఉప కులాలను 1,2,3 గ్రూపులుగా విభజించాలని జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ వన్ లో 15 కులాలకు చెందిన 3.2 శాతం జనాభా ప్రాతిపదికగా ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సు చేసింది. గ్రూప్ 2 లోని 18 ఉపకులాల ఎస్సీలు 62.74 శాతం ఉన్నా, వారు విద్యా, ఉద్యోగాల్లో వెనుకబడి ఉన్నారని కమిషన్ గుర్తించింది. వీరికి విద్యా, ఉద్యోగాల్లో 9 శాతం రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. మెరుగైన ప్రయోజనాలు పొందిన గ్రూప్ 3కి చెందిన 26 ఉప కులాలున్నాయని, వీరి జనాభా 33.96 శాతం ఉండగా వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఎస్సీ కమిషన్ నివేదికకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.