రేవంత్ కు మంచి మార్కులు పడతాయి
x
Revanth and KCR

రేవంత్ కు మంచి మార్కులు పడతాయి

కొందరు పాలకులు మిగిలిన ప్రాంతంతో పోల్చినపుడు తమ జిల్లా, నియోజకవర్గం లేకపోతే కనీసం తమ గ్రామాన్నయినా బాగా డెవలప్ చేసుకుంటారు.


అధికారంలో ఉన్నవారు పరిపాలనలో అన్నీ ప్రాంతాలను సమానంగా చూడాలి. కాని ఆచరణలో అది ఎక్కడా జరగదు. కొందరు పాలకులు మిగిలిన ప్రాంతంతో పోల్చినపుడు తమ జిల్లా, నియోజకవర్గం లేకపోతే కనీసం తమ గ్రామాన్నయినా బాగా డెవలప్ చేసుకుంటారు. ఇదే సమయంలో మరికొందరు తమ జిల్లా కాదుకదా చివరకు తమ నియోజకవర్గం, గ్రామాన్ని కూడా పట్టించుకోరు. ఇప్పుడు విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నియోజకవర్గం కొడంగల్లులోని సొంతూరు కొండారెడ్డిపల్లిని అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. ఇంతకాలం అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్న కొండారెడ్డిపల్లి రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జోరుగా పరుగులు తీస్తోంది.

దసరాపండుగ సందర్భంగా రేవంత్ తన గ్రామానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసుకున్న భవనాలకు ప్రారంభోత్సవాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేయబోతున్నారు. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే వంగూరు మండలకేంద్రం నుండి ఇతర గ్రామాలకు డబుల్ రోడ్లు వేయటంకోసం రు. 50 కోట్లు మంజూరుచేశారు. రోడ్డుపనులు కూడా చాలా వరకు అయిపోయాయి. సొంత గ్రామంలో అభివృద్ధిపనులకు రు. 30 కోట్లతో పనులు జోరుగా సాగుతున్నాయి. సొంత మండలంలో అభివృద్ధి పనులకు రేవంత్ ఇప్పటికే రు. 170 కోట్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో కొండారెడ్డిపల్లి అభివృద్ధి కోసమే రు. 50 కోట్లు మంజూరయ్యాయి. మండలకేంద్రం వంగూరులో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు, వంగూరు నుండి జూపల్లి వరకు బీటీ డబుల్ రోడ్డు, శ్రీశైలం నేషనల్ హైవే రాంనగర్ స్టేజి నుండి కొండారెడ్డిపల్లికి బీటీ రోడ్డు నిర్మాణం, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనం నిర్మాణ పనులకు శంకుస్ధాపనలు చేయబోతున్నారు.

కొండారెడ్డిపల్లి గ్రామపంచాయితీ భవనాన్ని రు. 72 లక్షలతో నిర్మించారు. పైలెట్ ప్రాజెక్టు కింద గ్రామం మొత్తాన్ని సోలార్ మయం చేయబోతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ, వ్యవసాయ మోటార్లకు, కమర్షియల్ అవసరాలకు మొత్తం సోలార్ విద్యుత్ నే వాడేట్లుగా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. పై మూడు క్యాటగిరీల వాడకానికి వీలుగా పెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా సోలార్ విద్యుత్ అందించాలన్నది రేవంత్ ఆలోచన. అన్నీ అవసరాల వాడకానికి పోగా మిగిలిన సోలార్ విద్యుత్ ను అమ్మగా వచ్చిన డబ్బుతో పంచాయితిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. గ్రామంలోని 500 ఇళ్ళు, 66 కమర్షియల్, 870 వ్యవసాయ కనెక్షన్లకు తొందరలో నూరుశాతం సోలార్ విద్యుత్తు వాడేట్లుగా రేవంత్ అవసరమైన ఏర్పాట్లుచేస్తున్నారు. మండలకేంద్రంలోని వంగూరులో ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ బాగా డెవలప్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధికి అవసరమైన ప్రణాళికలు రెడీచేయమని అధికారులను ఆదేశించారు.

తన గ్రామంలోని ఆంజనేయ, శివాలయాల నిర్మాణం కోసం ఇప్పటికే రేవంత్ రు. 4 కోట్ల సొంత నిధులు ఖర్చుచేశారు. అలాగే రు. 65 లక్షలతో మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో బీసీ సంక్షేమ భవనాన్ని నిర్మించారు. మొత్తంమీద సొంతగ్రామం కొండారెడ్డిపల్లిలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, పంచాయితీ కార్యాలయం, బీసీ సంక్షేమభవనంతో పాటు వంగూరు మండలకేంద్రాన్ని కూడా రేవంత్ పెద్దస్ధాయిలో డెవలప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుండి ఇప్పటివరకు మండలం కేంద్రంతో పాటు సొంతగ్రామం అభివృద్ధికి రేవంత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటం సంతోషించాల్సిన విషయమే. ఇలాంటి డెవలప్మెంటే అన్నీ చోట్లా చేస్తే రాష్ట్రంలోని జనాలంతా మరింత సంతోషిస్తారు.

కేసీఆర్ ఏమిచేశారు ?

ఇక కేసీఆర్ విషయం చూస్తే రేవంత్ స్ధాయిలో పెద్దగా డెవలప్ చేయలేదని అర్ధమవుతోంది. గజ్వేలు నియోజకవర్గం మర్కోకు మండలంలోనే ఎర్రవల్లి గ్రామం ఉంటుంది. నిజానికి కేసీఆర్ సొంతగ్రామం చింతమడకను దూరంగా పెట్టి ఎర్రవల్లినే సొంతగ్రామంగా చూసుకుంటున్నారు. గడచిన 15 ఏళ్ళుగా బీఆర్ఎస్ అధినేత చింతమడకను వదిలిపెట్టి ఎర్రవల్లి ఫాంహౌసులోనే ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి కేసీఆర్ సొంతగ్రామం ఏదంటే జనాలకు ముందు ఎర్రవల్లే గుర్తుకొస్తుంది. ఈ గ్రామంనుండి బయటకు వెళ్ళటానికి అవసరమైన బీటీ(బ్లాక్ టాప్) రోడ్లు వేయించారు. గ్రామంలో 500 ఇళ్ళంటే 400 ఇళ్ళ స్ధానంలో కొత్తగా డబుల్ బెడ్ రూములు నిర్మించారు. ఇంటికి రెండు బర్రెలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇచ్చింది ఒక్కోటి మాత్రమే. మర్కోకు కేంద్రంలో పోలీసుస్టేషన్ ఉండగా దాన్ని కాదని తన పాంహౌసుకు 5 కిలోమీటర్ల దగ్గరగా మరోక మోడల్ పోలీసుస్టేషన్ కట్టించారు. అయితే ఈ పోలీసుస్టేషన్ జనాలకు పెద్దగా ఉపయోగ పడట్లేదని సమాచారం. ప్రతి ఇంటికి మంచినీటి కొళాయుంది.

ఇంతచేసిన కేసీఆర్ గ్రామంలోని నిరుద్యోగయువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మాత్రం కల్పించలేకపోయారు. నిజానికి ఎర్రవల్లి గ్రామం హైదరాబాదుకు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వాయుకాలుష్యంలేని ఇండస్ట్రీస్ లో దేన్ని ఎర్రవల్లికి దగ్గరలో ఏర్పాటు చేయించినా వందలమందికి ఉద్యోగ, ఉపాధి దొరికేదే. అలాగే భూముల ధరలు కూడా బాగా పెరిగేవి. ఎందుకనో కేసీఆర్ ఆ దిశగా ఆలోచించలేదు. పైగా మండలకేంద్రం మర్కోకు డెవలప్మెంట్ మీద కూడా పెద్దగా దృష్టిపెట్టలేదు. కేసీఆర్ తో పోల్చిచూసినపుడు అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డికి ఎక్కువ మార్కులే వస్తాయనటంలో సందేహంలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా గజ్వేలు నియోజకవర్గం, మర్కోకు మండలం, ఎర్రవల్లి గ్రామంలో జరగాల్సినంత డెవలప్మెంట్ జరగలేదు.

రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నది 10 నెలల క్రితమే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎంతకాలం కుర్చీలో కూర్చుంటారో ఎవరూ చెప్పలేరు. బహుశా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు రేవంత్ తన నియోజకవర్గం, మండల కేంద్రంతో పాటు సొంత గ్రామాన్ని జెట్ స్పీడుతో డెవలప్ చేయిస్తున్నారు. మరి ఏ స్ధాయిలో డెవలప్ చేయగలరో వెయిట్ చేసి చూడాల్సిందే.

జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదా ?

ఇదే విషయాన్ని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణా’తో మాట్లాడుతు ‘కేసీఆర్ హయంలో నియోజకవర్గంలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేద’న్నారు. ‘నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి విషయాన్ని కేసీఆర్ పట్టించుకోలేద’ని మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేలులో జక్కని పోటీచేసి ఓడిపోయారు. ‘గ్రామంలో రోడ్లు వేసి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించిన కేసీఆర్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించుంటే నియోజకవర్గం ఇంకా బాగా డెవలప్ అయ్యుండేద’ని అభిప్రాయపడ్డారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదన్న అసంతృని వ్యక్తంచేశారు. ‘నియోజకవర్గంలో ఏదైనా ఐటి కంపెనీని పెట్టించుంటే బాగుండేద’ని సంజయ్ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story