
HILTలో అందుకు అవకాశం ఇవ్వలేదు: శ్రీధర్ బాబు
హిల్ట్ పాలసీపై ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్(HILT) పాలసీపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. పారిశ్రామిక భూములపై కుంభకోణం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రూ.5లక్షల కోట్లు వచ్చే భూములను రూ.5వేల కోట్లకే అమ్ముకునే కుట్రలో కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ పాలసీపై తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ్కు ఫిర్యాదు చేశారు. అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా తాజాగా హిల్ట్ పాలసీపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. విపక్షాలు చేస్తున్నవన్నీ అసత్యు ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలని అన్నారు. HILT పాలసీలో లీజు భూములను కన్వర్షన్‌కు అనుమతే లేదని చెప్పారు.
‘‘పట్టాలు ఉండి, సొంత భూములు ఉన్నవారికే కన్వర్షన్ ఫీజు పెట్టాం. గత ప్రభుత్వమే సర్కార్ భూములను ప్రైవేటు వ్యక్తులకు అత్తగారి సొమ్ములా పంచుకుంది. వారికి ధారాదత్తం చేస్తూ జీవోను కూడా విడుదల చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములపై యాజమాన్య హక్కులను పారిశ్రావేత్తలకు ఇస్తూ జీవో తెచ్చారు. ఖాయిలా పడిన పరిశ్రమల భూములను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం హిల్ట్ ద్వారా మేం చేస్తున్నాం. ఈ పాలసీలో ఎస్ఆర్‌ఓ రేటు కన్నా ఎక్కువ ఫీజు పెట్టాం’’ అని ఆయన చెప్పారు.

