ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పులుండవ్: కోమటిరెడ్డి
x

ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్‌లో మార్పులుండవ్: కోమటిరెడ్డి

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్‌లపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.


రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం మరో ముందడుగు వేయనుంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు రోడ్లుభవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. ఈ టెండర్లను డిసెంబర్‌లోపు పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాకుండా డిసెంబర్‌లోనే ఆర్ఆర్ఆర్ పనులను కూడా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోదీ.. 2017-18లోనే ఆమోదం తెలిపినా బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే జాప్యం చేసిందని, భూసేకరణ చేయకుండా తాత్సారం ఆడిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రైతులను అన్యాయం జరగకుండా ధర్నాల్లో పాల్గొన్నామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉండటంతో రైతులకు మార్కెట్ రేట్ ఇప్పించి భూసేకరణ చేశామని చెప్పారు.

అవసరాలకు తగ్గట్టు మార్పులు..

‘‘నేను మంత్రిగా అయిన కొత్తలో ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం కోసం భూసేకరణ కేవలం 6శాతమే జరిగింది. ఆ తర్వాత మా ప్రభుత్వం మిగిలిన 98శాతానికి పైగా పూర్తిచేశాం. నాలుగు లేన్ల ఆర్ఆర్ఆర్‌పై 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆర్ఆర్ఆర్‌ను 6లేన్లగా మార్చుకున్నాం. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవపూర్ వయా భువనగిరి, చౌటుప్పల్ వరకు 161.518 కిలోమీటర్ల నార్త్ పార్ట్ ఉండనుంది. భూసేకరణ కోసం రూ.6వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రం చెరిసగం వాటా వేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.3 వేల కోట్ల హడ్కో రుణం తెచ్చాం. ఇప్పటికే పలుసార్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశాం. ఇటీవల నేను, సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర అధికారులతో సమావేశమయ్యాం. పనులను వేగవంతం చేయాలని మాట్లాడాం’’ అని వెల్లడించారు.

రైతులకు ఆందోళన వద్దు..

‘‘ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం అలైన్‌మెంట్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ప్రాజెక్ట్ పనులు జనవరిలో ప్రారంభిస్తాం. అందుకు కేంద్ర సహకారం కోరాం. దక్షిణ భాగం విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతుల అంగీకారంతోనే ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్తాం. నేను కూడా రైతు బిడ్డనే.. రైతుకు అన్యాయం జరిగితే ఊరుకుంటానా? త్వరలో సీఎంను కలిసి మంత్రుల కమిటీ వేస్తాం’’ అని రైతులకు భరోసా ఇచ్చారు.

అవన్నీ అసత్య ప్రచారాలే..

‘‘కొన్ని రోజుల్లో సోషల్ మీడియా, పలు పత్రికల్లో రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో అసత్య ప్రచారం జరుగుతోంది. వాటిని చూసి రైతులు ఎవరూ ఆందోళన చెందకండి. రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ, నిర్మాణం కోసం రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది. వైఎస్ఆర్ హయాంలో కట్టిన ఓఆర్ఆర్‌ను బీఆర్ఎస్.. రూ.7వేల కోట్లకు అమ్ముకుంది. ఇప్పుడు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అబద్దపు ప్రచారాలతో రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వాళ్ల ట్రాప్‌లో రైతులు పడకండి. అలైన్‌మెంట్ విషయంలో పెద్దోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయం ఉండదు. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. నల్లగొండ బిడ్డగా ఈ గడ్డకు అన్యాయం జరగనివ్వను’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story