ఈ ఐదుగురు అభ్యర్థులు తమకోసం ఓటు వేసుకోలేరు !!
x

ఈ ఐదుగురు అభ్యర్థులు తమకోసం ఓటు వేసుకోలేరు !!

ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారు కావొచ్చు. అందుకే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. కానీ ఓటుని తమ కోసం తాము వేసుకోలేని పరిస్థితి ఐదుగురు ఎంపీ అభ్యర్థులకు ఎదురైంది. 


ఒక్కోసారి ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారు కావొచ్చు. అందుకే ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. నాయకులు ప్రచారంలో పేరుపేరునా అభ్యర్ధిస్తున్నా.. మీ అమూల్యమైన ఓటుని వేసి నన్ను ఆశీర్వదించండి అని ఓటర్లను విజ్ఞప్తి చేస్తుంటారు. కానీ అదే అమూల్యమైన ఓటుని తమ కోసం తాము వేసుకోలేని పరిస్థితి తెలంగాణలోని ఐదుగురు ఎంపీ అభ్యర్థులకు ఎదురైంది.

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ తన ఓటు తనకోసం వేసుకోలేరు. అలాగని మరో మజ్లిస్ అభ్యర్ధికి కూడా ఓటు వేయలేరు. అసదుద్దీన్ రాజేంద్ర నగర్ లో నివాసం ఉంటున్నారు. రాజేంద్ర నగర్ చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. దీంతో హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఆయన ఓటు వేయలేరు. చేవెళ్లలోనే ఓటు వేయాల్సి ఉంది. అయితే అక్కడ మజ్లిస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఆయన ఇతర పార్టీ అభ్యర్ధికి కానీ, నోటాకి కానీ ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇంకో విశేషమేమంటే అసదుద్దీన్ ఇప్పటి వరకు ఎప్పుడూ తన ఓటు తనకి వేసుకోలేదు.

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత కి కూడా ఇదే పరిస్థితి. ఆమె తన ఓటు తనకోసం వినియోగించుకోలేరు. ఆమె ఓటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉంది. కంటోన్మెంట్ మల్కాజిగిరి పార్లమెంటు కిందకి వస్తుంది. దీంతో ఆమె మల్కాజిగిరి పార్లమెంటు, కంటోన్మెంట్ ఉపఎన్నికలకు ఓటు వేయనున్నారు.

హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్ కూడా తన ఓటు తన కోసం వేసుకోలేరు. ఆయన ఓటు జూబిలీహిల్స్ లో ఉంది. ఇది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంది. దీంతో ఆయన సికింద్రాబాద్ స్థానాల్లో ఓటు వేయాలి.

చేవెళ్ల బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఓటు కుత్బుల్లాపూర్ లో ఉంది. ఇది మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఉంది. దీంతో ఆయన చేవెళ్లలో తన కోసం ఓటు వేసుకోలేరు.

కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఓటు తాండూరులో ఉంది. ఇది చేవెళ్ల లోక్ సభ పరిధిలో ఉంటుంది. కానీ ఆమె మల్కాజిగిరి నుంచి పోటీ చేయనుండటంతో తన కోసం తన ఓటు ఉపయోగించుకోలేరు.


Read More
Next Story