వినూత్న బోధనతో ఉత్తమ ఉపాధ్యాయులయ్యారు...
x
ఉపాధ్యాయురాలికి అవార్డు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

వినూత్న బోధనతో ఉత్తమ ఉపాధ్యాయులయ్యారు...

విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్న ఉత్తమ ఉపాధ్యాయులను గురుపూజోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.


‘‘గురు బ్రహ్మ..గురు విష్ణు..గురు దేవో మహేశ్వరహ: ’’అన్నట్లు గురుపూజోత్సవం సందర్భంగా శుక్రవారం ఉత్తమ గురువుల సేవలను గురించి గుర్తు చేసుకుంటున్నాం. ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి వారికి సన్మానించారు. సృజనాత్మకత, ఆచరణాత్మకత, వినూత్న బోధనా పద్ధతులతో ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 51 మంది ఉపాధ్యాయుల వినూత్న విద్యాబోధనలపై రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి, స్కూల్ లీడర్ షిప్ అకాడమీ ట్రయల్ బ్లేజర్స్ పేరిట వార్షిక సంపుటిని ప్రచురించింది.


పాఠశాలలో లంచ్ లైబ్రరీ
విద్యార్థులతో కథలు రాయించి వాటటిని ముద్రించి పుస్తకాలను లంచ్ లైబ్రరీలో ఉంచిన ఘనత ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పొరెడ్డి అశోక్ కు దక్కింది. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడంతోపాటు దాతల సహకారంతో పుస్తకాలను కొని పాఠశాలలో లంచ్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా దండే పల్లి మండలం దుబ్బగూడ గ్రామ స్కూలుకు పిల్లలు బడికి రాకుంటే వారి ఇంటికి టీచర్ వసంత వెళ్లి వారి తల్లిదండ్రులను ఒప్పించి పాఠశాలకు తీసుకువచ్చి పాఠాలు బోధిస్తున్నారు. బొమ్మలు, ఆటపాటల ద్వారా పాఠాలు చెబుతూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. లక్కెట్టిపేట మండలం దౌడపల్లి స్కూలులో పనిచేస్తున్న బుర్ర గిరిధర్ అభినయ గేయాలు, ఆటపాటలు,కథల ద్వారా పాఠాలు చెబుతున్నారు.

విద్యార్థులు మెచ్చిన మాస్టారు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు లుందే రాము విద్యార్థులతో సేంద్రీయ సుద్దముక్క తయారీ, విత్తనాలు నాటే పాదరక్షలు రూపొందించారు.ఈయన విద్యార్థులకు సాంఘీక శాస్త్రాన్ని చర్చలు, ఏకపాత్రాభినయం, సర్వే, ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్య విలువలపై ప్రయోగాత్మకంగా పాఠాలు చెప్పి విద్యార్థుల మెప్పు పొందారు.

కృత్రిమ మేధతో గోండు భాషలో మహాభారత్
కృత్రిమ మేధను ఉపయోగించి గోండు భాషలో మహాభారతాన్ని అనువదించిన ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ టీచర్ తొడసం కైలాస్ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపది మూర్ముల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

పాటలతోనే విద్యాబోధన
కొందరు ఉపాధ్యాయులు ఆట పాటల ద్వారా విద్యార్థుల మనసులో నాటుకునేలా విద్యా బోధన చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుక పాటలతోనే పాఠాలు చెబుతూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. విద్యా బోధన సామాగ్రితోపాటు సినిమా పాటలను పేరడి పాటలుగా జోడించి పాఠాలు చెబతున్నారు. ‘‘నేను గోదారమ్మా...గోదారమ్మనే...మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ లో పుట్టానే అంటూ గోదావరి నది విశిష్ఠతపై రేణుక పాఠం చెప్పారు. చర్ల మండలం కొరకటంపాడు ప్రాథమిక పాఠశాల టీచర్ బస్సోజీ వెంకటేశ్వర్లు పూరిపాకగా ఉన్న స్కూలును దాతల సాయంతో రేకుల షెడ్డుగా మార్చారు. కల్లూరు మండలం చెన్నూరు స్కూలు టీచర్ దంతాల సుధాకర్ నాటికల ద్వారా పాఠాలు చెప్పడమే కాకుండా బడిబాటలో బైక్ యాత్ర నిర్వహించారు.

యూట్యూబ్ ఛానెళ్లతో విద్యాబోధన
ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని పాఠాలను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధించడం ద్వారా పలువురు ఉపాధ్యాయులు ప్రశంసలు అందుకున్నారు. పిల్లల్ని భాగస్వాములను చేస్తూ ఆసక్తికరంగా విద్యా బోధన చేసేందుకు వీలుగా ఆటలు, పాటలు, నృత్యాల ద్వారా విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగిస్తున్నారు. తెలంగాణలో పలువురు ఉపాధ్యాయులు సొంతంగా యూట్యూబ్ ఛానెళ్లను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా విద్యా బోధన సాగిస్తున్నారు. భువనగిరి జిల్లాకు చెందిన జ్యోతిర్మయి, నల్గొండకు చెందిన మ్యాథ్స్ మూర్తి, ఖమ్మం జిల్లాకు చెందిన డి కృష్ణారావు యూట్యూబ్ ఛానెళ్లను ప్రారంభించి విద్యాబోధన చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పలు పాఠశాలల పేరిట ఛానెళ్లు వెలిశాయి.

పిల్లలతో నాటికల ద్వారా బోధన
మెదక్ జిల్లా దంతాలపల్లి ప్రాథమిక పాఠశాల టీచర్ ఎన్ కవిత నాటికల్లో పిల్లలతో పాత్రలు వేయించి పాఠాలు చెబుతున్నారు. దీంతోపాటు 250 వీడియోలను తీసి వాటిని యూట్యూబ్ ఛానెల్ లో పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ స్కూల్ టీచర్ ఎ శ్వేత నాటికలు, పాత్రల రూపంలో పాఠాలు చెబుతున్నారు.



49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

తెలంగాణలో గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5వతేదీన 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర విద్యా శాఖ ఎంపిక చేసింది. ఈ మేరకు జీఓ ఆర్టీ నంబరు 138 పేరిట రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా గురువారం సాయంత్రం విడుదల చేశారు. తెలంగాణలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం 161 మంది ఉపాధ్యాయుల ప్రతిపాదనలను పంపించగా రాష్ట్ర విద్యా ఎంపిక కమిటీ 49 మంది టీచర్లను బెస్ట్ టీచర్లుగా ఎంపిక చేసింది. గురుకుల పాఠశాలల నుంచి 31 మంది, ఎస్ జీటీలు 12 మంది, ఎయిడెడ్ స్కూళ్ల నుంచి ముగ్గురు, తెలంగాణ మోడల్ స్కూళ్ల నుంచి ఇద్దరు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నుంచి ఒకరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా తాజాగా విడుదల చేసిన జీఓలో పేర్కొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
హైదరాబాద్ శిల్పకళా వేదికపై గురుపూజోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు.


Read More
Next Story