రేవంత్ కు ఈమె పెద్ద తలనొప్పిగా తయారైందా ?
x
ఫోటో ఎక్స్ నుంచి

రేవంత్ కు ఈమె పెద్ద తలనొప్పిగా తయారైందా ?

బడ్జెట్ సమావేశాల ముందు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వైఖరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది.


సరిగ్గా బడ్జెట్ సమావేశాల ముందు 2001 బ్యాచ్ కు చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వైఖరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైందనిపిస్తుంది. మంగళవారం నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారి వ్యవహారం చర్చకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.


ఇంతకీ విషయం ఏమిటంటే స్మితా సబర్వాల్ అని ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు. సివిల్ సర్వీసు ఎంపికలో దివ్యాంగుల కోటా అవసరమా ? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఆమె అభిప్రాయం ఏమిటంటే ఐఏఎస్ సర్వీసులో దివ్యాంగుల కోటా అవసరం లేదనే. పైలెట్లుగా విమానయాన సంస్ధలు దివ్యాంగులను తీసుకుంటున్నాయా ? దివ్యాంగుడిగా ఉన్న సర్జన్ల దగ్గరకు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటారా ? అంటు స్మిత ట్విట్టర్ వేదికగా తేనెతుట్టెను కదిపారు.

ట్విట్టర్లో ఆమె ప్రశ్నలు వేయటం ఆలస్యం దివ్యాంగుల సంఘాలు, ప్రతిపక్షాలు చివరకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆమెపై విరుచుకుపడుతున్నారు. దివ్యాంగుల కోటాలో ఐఏఎస్ కు ఎంపికైన పూజా ఖేడ్కర్, ప్రఫుల్ దేశాయ్ తదితరులపై ట్విట్టర్లో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదం నడుస్తుండగానే స్మిత తన అభిప్రాయాలను ట్విట్టర్లో ఉంచారు. వ్యక్తిస్వేచ్చ ప్రకారం చూస్తే ఆమె తన అభిప్రాయాలను చెప్పటంలో తప్పేమీలేదు. అయితే ఐఏఎస్ అధికారిగా తన వ్యక్తిగతఅభిప్రాయాలను సోషల్ ప్లాట్ ఫారమ్ ట్విట్టర్లో పంచుకోవచ్చా అనేది ఇపుడు పెద్ద పాయింట్ అయిపోయింది.

తన అభిప్రాయాలను స్మిత ట్విట్టర్లో పంచుకోగానే యూపీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే బాలలత ఘాటుగా స్పందించారు. మరికొందరు వికలాంగులతో కలిసి దివ్యాంగురాలైన బాలలత మీడియాతో మాట్లాడినపుడు స్మితపై వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. స్మితకు మానసిక వైకల్యం ఉందంటు ధ్వజమెత్తారు. అలాగే బీఆర్ఎస్ ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావు కూడా ఆమెను తప్పుపట్టారు. కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యయుడు జీ నిరంజన్ మాట్లాడుతు దివ్యాంగుల కోటా విషయంలో స్మిత తప్పుగా మాట్లాడినట్లు అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్మిత వెంటనే క్షమాపణలు చెప్పాలని నిరంజన్ డిమాండ్ చేశారు.

రేవంత్ టార్గెట్

సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత వ్యక్తంచేసింది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమే. అయినా ప్రభుత్వంలో సీనియర్ బ్యూరోక్రాట్ గా ఉంటు యూపీఎస్సీ ఎంపిక విధానాన్ని తప్పుపట్టడమే ఇపుడు సమస్యగా మారింది. సివిల్ సర్వీసులో దివ్యాంగుల కోటా అనవసం అనే అభిప్రాయాన్ని బహిరంగంగా ఎందుకు వ్యక్తంచేశారో అర్ధంకావటంలేదు. మాట్లాడేటపుడు ఏచిన్న పొరబాటు జరిగినా సోషల్ మీడియా చీల్చి చెండాడేస్తోంది. అలాగే ప్రతిపక్షాలు, హక్కుల సంఘాలు ఆందోళనలు మొదలుపెట్టేస్తాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితకు ఈ విషయాలు తెలీవని అనుకునేందుకు లేదు. తన వ్యాఖ్యలపై గోల మొదలవుతుందని తెలిసి కూడా స్మిత ట్విట్టర్లో కామెంట్లు చేశారంటే ఉద్దేశ్యపూర్వకంగానే ఆమె వ్యాఖ్యలు చేశారని అర్ధమవుతోంది.

దివ్యాంగుల కోటాపై ఆమె వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఆమె వ్యక్తిగత అబిప్రాయంగా అనిపించటంలేదు. యూపీఎస్సీతో పాటు కేంద్రప్రభుత్వాన్ని తప్పుపడుతున్నట్లుగానే ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇపుడందరు రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. దివ్యాంగులను అవమానించిన స్మితపై వెంటనే చర్యలు తీసుకోవాలంటు దివ్యాంగుల సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్లు చేస్తున్నాయి. ఇదే విషయం అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వస్తే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

స్మిత ఒంటరయ్యారా ?

దివ్యాంగుల కోటాపై చేసిన కామెంట్లతో అన్నీ వైపుల నుండి స్మితపై దాడులు మొదలయ్యాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సహచర ఐఏఎస్ అధికారుల్లో ఎవరి నుండి కూడా స్మితకు మద్దతు దొరకలేదు. విషయం చాలా సెన్సిటివ్ అవటంతో మిగిలిన ఐఏఎస్ అధికారులు ఎవరూ స్మితా సబర్వాల్ కు మద్దతుగా రావటంలేదని అర్ధమవుతోంది. ఇదే సమయంలో ఎవరూ బహిరంగంగా ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించటం కూడా లేదు. ఏదేమైనా తాజా వివాదంలో స్మిత ఒంటరైపోయినట్లు అర్ధమవుతోంది. మరి ఈ వివాదంలో నుండి స్మిత ఎలా బయటపడతారు ? రేవంత్ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.

Read More
Next Story