ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకుండా కార్పొరేట్ శక్తుల కోసం పనిచేస్తుందని, దేశంలో ఉన్నది కార్పొరేట్ ప్రజాస్వామ్యం అని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.
‘‘ప్రజల సమస్యను పరిష్కరిస్తారా? సమస్యను అడగకుండా చేస్తారా? ఒక సమూహాన్ని, ప్రజా ప్రతిఘటనను ఎక్కడైనా అణచివేయగలరా? ప్రభుత్వం ప్రజలకోసం పనిచేయకుండా కార్పొరేట్ శక్తులకోసం పనిచేస్తోంది. కాబట్టి మన దేశంలో ఉన్నది కార్పొరేట్ ప్రజాస్వామ్యం.’’ అని పౌరహక్కుల నేత, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు.
‘ఆదివాసీ హక్కులు- కార్పొరేటీకరణ-సంఘీభావ ఉద్యమాల’ పై హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండవ రోజు శనివారం జరిగిన జాతీయ సదస్సులో ‘అభివృద్ధి నమూనా- పర్యావరణ విధ్వంసం’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు.
‘‘ప్రకృతి వనరులు తరిగిపోవడమనేది అందరి సమస్య. మనిషిని తోసేసి అభివృద్ధి అంటే ఎలా? మనిషిని తోసేసి సంపదను సృష్టించి, ఇదే అభివృద్ధి అంటే ఎలా? ప్రకృతి వనరులు పరిమితంగా ఉంటాయి. తవ్వేస్తుంటే కొంతకాలానికి తరిగిపోతాయి. దాంతో ప్రకృతి విధ్వంసం జరిగిపోతుంది. ఫలితంగా మానవ జాతి కూడా విధ్వంసం అయిపోతుంది. ఈ భూమిని పూర్తిగా నాశనం చేయకముందే ఈ పాలకులు వేరే గ్రహానికి వెళ్లిపోయి, ప్రకృతి వనరులను అక్కడ తవ్వుకోమని చెపుతున్నాను. అక్కడ ప్రకృతి వనరులు అయిపోయాక ఆ తరువాత ఈ భూగ్రహానిక రమ్మనంటున్నాను. అప్పటి వరకురావద్దనే అంటున్నాను’’ అంటూ వ్యంగ్యంతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
‘‘ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఎకనమిక్స్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవంబర్ ఒకటి నుంచి అమలు చేయనున్న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తున్నట్టు చెప్పారు. చెట్లను నరకకుండా అభివృద్ధి సాధ్యం కాదని, అందుకోసం 2 లక్షల 75 వేల చెట్లను నరికేస్తామని ఆయన అంటారు. నాలుగు లేన్ల రోడ్ల కోసం 53 లక్షల 43 వేల చెట్లను నరకాల్సి వచ్చిందని కూడా చెప్పారు. చెట్లను నరకకుండా అభివృద్ధి సాధ్యం కాదా అని ప్రశ్నిస్తున్నాను. ఢిల్లీలో ఒకక్క చెట్టును నరికితే జరిమానా విధిస్తారు. లక్షల చెట్లను నరికే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి ఏ జరిమానా విధిస్తారు? కాంగ్రెస్ పాలనలోని చివరి 8నెలల్లో నక్సలైట్ల దాడులు పెరిగినందున 29 పోలీసు శిబిరాలను ఏర్పాటుచేయదలిచామని ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే 25 పోలీసు శిబిరాలున్నాయి. ఇవి చాలక మరో 29 శిబిరాలు పెడతారా?’’ అని హరగోపాల్ ప్రశ్నించారు.
‘‘ఈ దేశంలో పర్యావరణ చట్టాలున్నాయి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలున్నాయి. ఆదివాసీలకు హక్కులున్నాయి. ఇవ్వేవీ ప్రభుత్వాధినేతలకు పట్టవు. వాళ్లకు కావలసిందల్లా గ్రోత్ రేట్ 8 శాతం పెంచాలా? 9శాతం పెంచాలాఅన్నదే లెక్క. రాజ్యాంగంలో సమానత్వ భావన ఉంది. రాజ్యాంగం ఏమైంది? చట్టాలేమైనాయి? రాజ్యాంగంలో స్వయం పాలనను గౌరవిస్తామన్నారు, ఏమైనాయి? గ్రామ సభలో తీర్మానాలతో, చట్టాలతో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రికి పనిలేదు.’’ అంటూ హరగోపాల్ విరుచుకుపడ్డారు.
బాధలు శాశ్వతం కాదు : బాబూరావు
‘‘ప్రకృతికి అనుకూలంగా లేకపోతే నాగరికతలు పోతాయి. సింగరేణి గనుల్లో బొగ్గు తవ్వకాల్లో అనుసరించాల్సిన చట్టాల్లో 18 అతిక్రమణలున్నాయని తేలింది. ఈ గనులు నష్టాల్లో నడుస్తున్నాయి కనుక ఈ అతిక్రమణలు తప్పవని సమధానం ఇస్తారు.’’ అని శాస్త్రవేత్త బాబూరావు ఈ సదస్సులో ప్రసంగిస్తూ అన్నారు. ‘‘ప్రభుత్వాల ఆటలు సాగనప్పుడు హింసకు పాల్పడతాయి. పౌర నిరసనను కూడా సహించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనిషి మిగలాలంటే పోరాడాలి. పాలకులు శాశ్వతం కాదు కనుక, వారు పెట్టే బాధలు కూడా శాశ్వతం కాదు’’ అని పేర్కొన్నారు.
ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, కిషోర్ ఖాన్, ఈశ్వర్, బట్టు వెంకటేశ్వర్లు ప్యానల్ అధ్యక్షతన ఈ సదస్సు జరిగింది. ఈ రెండురోజుల సదస్సులో ఇదే చివరి సెషన్. అనంతరం ఆదివాసీ కళాకారులు ముందునడువగా, ఆదివాసీ హక్కుల పోరాటానికి మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రదర్శనను నిర్వహించారు
Next Story