
‘బీఆర్ఎస్ రాజ్యాంగం ఓ పెద్ద జోక్’
శాసనమండలిలో భావోద్వేగభరితంగా ప్రసంగించిన కవిత.
బీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ రాజ్యాంగం ఓ పెద్ద జోక్‌లా ఉందని విసుర్లు విసిరారు. సోమవారం శాసనమండలిలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆమె పలు భావోద్వేగానికి లోనయ్యారు. ఇదే తన చివరి శాసనమండలి ప్రసంగమని ప్రకటిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన ఎమ్మెల్సీ పదవికి సమర్పించిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. ప్రసంగం మధ్యలో కన్నీళ్లు పెట్టుకున్న కవిత… వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను, కానీ బలమైన శక్తిగా తిరిగి చట్టసభల్లోకి వస్తానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కవిత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడాన్ని తాను అంగీకరించలేదని వెల్లడించారు. తెలంగాణలో సాధించిన ఫలితాలు ఏమిటో చెప్పకుండానే జాతీయ రాజకీయాల వైపు వెళ్లడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఈడీ, సీబీఐ కేసుల్లో మూడేళ్ల పాటు తాను ఒంటరిగా పోరాడినట్లు కవిత తెలిపారు. ఆ సమయంలో పార్టీ నుంచి కనీస మద్దతు కూడా లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ తనపై కక్షతో జైలుకు పంపిందని, ఆ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు తనకు అండగా నిలవలేదని చెప్పారు. పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానెళ్లు, పత్రికలు కూడా తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రభుత్వ పనితీరులో చోటు చేసుకున్న అవినీతిపై తాను నిరంతరం ప్రశ్నించానని కవిత తెలిపారు. సిద్దిపేట, సిరిసిల్లలో నిర్మించిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే దెబ్బతిన్నాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి నిర్మాణాల్లోనూ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇసుక దందాల కోసమే నేరెళ్ళ ఘటన చోటు చేసుకుందని విమర్శించారు. కాళేశ్వరం అంశంపై ఆరోపణలు వచ్చినప్పటికీ పార్టీ పెద్దలు మౌనం పాటించారని వ్యాఖ్యానించారు.
హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం పెద్ద జోక్‌లా ఉందని విమర్శించారు. పార్టీ నడిచే విధానంలో నైతిక విలువలు కనిపించడం లేదని శాసనమండలి సాక్షిగా తెలిపారు. తన సస్పెన్షన్‌కు ముందు కనీస వివరణ కూడా అడగకుండా పార్టీ నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘నా ఇద్దరు కొడుకుల మీద ఒట్టు వేసి చెబుతున్నా, బీఆర్ఎస్‌తో నాది ఆస్తుల పంచాయితీ కాదు, ఆత్మగౌరవ పంచాయితీ అని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలోకి వచ్చానని, బతుకమ్మ పండుగను ప్రజల్లోకి తీసుకెళ్లానని గుర్తు చేశారు. ఉద్యమకారులకు ఆర్థిక సాయం చేయాలని కోరినా స్పందన రాలేదు’’ అని చెప్పారు.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించలేకపోవడం తనకు అవమానంగా మారిందని కవిత అన్నారు. ఉద్యమకారుల మాటలు కేసీఆర్ వరకు చేరకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం తాను ఎప్పుడూ పార్టీని అడగలేదని, ఉద్యమంలో పార్టీలకు అతీతంగా పనిచేశానని స్పష్టం చేశారు. తన రాజీనామాపై స్పందించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భావోద్వేగాల్లో తీసుకున్న నిర్ణయమై ఉండవచ్చని పేర్కొన్నారు. రాజీనామాపై పునరాలోచన చేయాలని సూచించారు.
దీనికి కవిత స్పందిస్తూ నాలుగు నెలల క్రితమే రాజీనామా సమర్పించానని, బీఆర్ఎస్ పార్టీతో ఇక తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మరోసారి కోరారు. శాసనమండలిలో కవిత చేసిన ఈ ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. వ్యక్తిగా బయటకు వెళ్తున్నానన్న ఆమె వ్యాఖ్యలు, బలమైన శక్తిగా తిరిగి వస్తానన్న ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

