కలెక్టర్ మీద దాడిలో కీలకవ్యక్తి పట్నం నరేందరరెడ్డి నేపధ్యం ఇదే
టీవీ, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా పట్నం పేరు మారుమోగిపోతోంది. నిజానికి పట్నం పెద్ద నేతేమీ కాదు
గడచిన మూడురోజులుగా తెలంగాణా రాజకీయల్లో పట్నం నరేందరరెడ్డి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. టీవీ, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా పట్నం పేరు మారుమోగిపోతోంది. నిజానికి పట్నం పెద్ద నేతేమీ కాదు. జిల్లాను ప్రభావితం చేయగలిగిన నేతో లేకపోతే రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేత కూడా కాదు. కులసంఘాలలో ప్రముఖ నేత కూడా కాదు. కేవలం మాజీ ఎంఎల్ఏ మాత్రమే. అలాంటి వ్యక్తి ఇన్నిరోజులు వరుసగా వార్తల్లో వ్యక్తిగా ఎలా నిలుస్తున్నారు ? ఏ కారణంగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు ? ఎలాగంటే, కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల(lagacharla) గ్రామసభలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్(Vikarabad Collector Pratik Jain) మీద దాడి జరిగింది. ఫార్మా కంపెనీలకు 3 వేల ఎకరాలను సేకరించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మా పరిశ్రమమీద ప్రత్యేక దృష్టిపెట్టింది.
అందుకని తన హయాంలో ఫార్మా ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో తన నియోజకవర్గం కొడంగల్(Kodangal) లోనే భూములను సేకరించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 వేల ఎకరాల భూసేకరణ జరిగితే అవసరాల మేరకు వేరే చోట్ల కూడా భూములను సేకరించాలని అనుకన్నారు. అందుకనే మొదటగా కొడంగల్ లోనే భూసేకరణకు కలెక్టర్ శ్రీకారంచుట్టారు. పరిశ్రమలకు భూములంటే ఒకపుడు వ్యవసాయేతర భూములను కేటాయించేవారు. కాని ఇపుడు వ్యవసాయభూములనే సేకరిస్తున్నారు. ఎప్పుడైతే కొత్తగా రేవంత్ ఫార్మా పరిశ్రమలకు భూ సేకరణ అని ప్రకటించారో వెంటనే బీఆర్ఎస్ వ్యతిరేకించటం మొదలుపెట్టింది. తమ హయాంలో ఫార్మా పరిశ్రమలకు సేకరించిన 14 వేల ఎకరాలుండగా ఇపుడు కొత్తగా మళ్ళీ భూములు సేకరించాల్సిన అవసరం ఏమిటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS working president KTR) పదేపదే ప్రశ్నిస్తున్నారు.
మొన్న సోమవారం కలెక్టర్ ఆధ్వర్యంలో గ్రామసభ జరిగింది. ఫార్మా పరిశ్రమకు భూములిచ్చేట్లుగా కలెక్టర్ రైతులు, గ్రామస్తులను ఒప్పంచేట్లుగా మాట్లాడారు. ఈ నేపధ్యంలోనే సడెన్ గా కలెక్టర్, అధికారులపై కొందరు దాడిచేశారు. కలెక్టర్ మీద జరిగిన దాడి సంచలనమైపోయింది. దాడి ఘటన వీడియోలను పోలీసులు విశ్లేషించినపుడు బీఆర్ఎస్ లోకల్ నేత సురేష్ ప్రముఖంగా కనబడ్డాడు. రైతులు, గ్రామస్తులను సురేష్ రెచ్చగొట్టి దాడిచేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన దగ్గర నుండి సురేష్ మాయమైపోయాడు. దాంతో అతని ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ డేటాను పోలీసులు విశ్లేషించారు. పట్నం నరేందరరెడ్డి-సురేష్ మధ్య దాడికి ముందురోజు 84 ఫోన్ కాల్స్ నడిచినట్లు గుర్తించారు. గ్రామస్తులతో పాటు రైతులను రెచ్చగొట్టమని సురేష్ ను పట్నం బాగా రెచ్చగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. అందుకనే పట్నంను పోలీసులు అరెస్టుచేసి రిమాండుకు తరలించింది. కలెక్టర్ మీద దాడి ఘటనలో నరేందర్ కీలకమైన వ్యక్తి కాబట్టే వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు.
ఇంతకీ నరేందరరెడ్డి(Patnam Narendar Reddy) ఎవరు ? పట్నం మహేందరరెడ్డి(Patnam Mahendar Reddy)కి తమ్ముడు. పట్నం మహేందరరెడ్డి టీడీపీ, బీఆర్ఎస్ లో ప్రముఖ నేతగా చెలామణి అయ్యారు. మహేందరరెడ్డి తమ్ముడిగానే నరేందరరెడ్డి టీడీపీ(TDP)తో రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఒకసారి ఎంఎల్సీ అయ్యారు. నాలుగుసార్లు రంగారెడ్డి జిల్లాలోని తాండూరు(Tandur) నియోజకవర్గంలో ఎంఎల్ఏ అయిన మహేందర్ రెడ్డి టీడీపీని వదిలేసి టీఆర్ఎస్ లో చేరినపుడు నరేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరాడు. రంగారెడ్డి జిల్లాలో మహేందరరెడ్డి చక్రం తిప్పిన సమయంలో 2018 ముందస్తు ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి ఎంఎల్ఏగా పోటీచేశాడు. కొడంగల్ లో బీఆర్ఎస్ లో గట్టి నేతలు లేకపోవటంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందరరెడ్డి కేసీఆర్(KCR) తో మాట్లాడుకుని తన సోదరుడు నరేందర్ రెడ్డిని కొడంగల్ లో పోటీచేయించారు.
అప్పట్లో రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతలా ప్రయత్నించిందో అందరికీ తెలిసిందే. రేవంత్ ఇంటిమీద తరచూ పోలీసులు దాడులు చేశారు. ఇంట్లో డబ్బులు దాచినట్లుగా సమాచారం ఉందని అర్ధరాత్రి, తెల్లవారి, మధ్యాహ్నం అన్న తేడాలేకుండా సోదాలపేరుతో ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేశారు. అర్ధరాత్రి తలుపులు తీయకపోతే బద్దలు కొట్టి మరీ సోదాలు జరిపారు. సరిగా పనిచేసుకోనివ్వకుండా రేవంత్ ను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ప్రచారంలో, రోడ్డుషోల్లోను, వేదికల మీద కూడా అడుగడుగునా ఆంక్షలు పెట్టారు. ఇంతచేస్తే రేవంత్ మీద నరేందరరెడ్డి గెలిచింది సుమారు 9 వేల ఓట్ల మెజారిటితో మాత్రమే. 2018-23 మధ్య ఎంఎల్ఏగా పనిచేసిన నరేందరరెడ్డి ఇదే కొడంగల్లో 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. నరేందర్ ఓడిపోవటమే కాకుండా బీఆర్ఎస్ కూడా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో పట్నం మహేందరరెడ్డి బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే తమ్ముడు నరేందర్ మాత్రం బీఆర్ఎస్ లోనే కంటిన్యు అవుతున్నారు. 2023 ఎన్నికల వరకు ఒకేపార్టీలో ఉన్న సోదరులిద్దరు ఇపుడు చెరోపార్టీలో ఉన్నారు.
కేసీఆర్, కేటీఆర్ కు బద్ధశతృవైన రేవంత్ మీద 2018లో ఎంఎల్ఏగా గెలిచాడు కాబట్టి నరేందర్ రెడ్డికి పార్టీ, ప్రభుత్వంలో బాగా ప్రాధాన్యత దక్కింది. 2023 ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీలో కీలక నేత మహేందర్ కాంగ్రెస్ లో చేరటంతో కేసీఆర్, కేటీఆర్ కు నరేందర్ మరింత సన్నిహితమైపోయాడు. ఆ సన్నిహితంతోనే ఇపుడు కొడంగల్ లో రైతులు, గ్రామస్తులను రెచ్చగొట్టేందుకు సురేష్ ను నరేందర్ పావుగా ఉపయోగించుకున్నాడనే ప్రచారం పెరిగిపోతోంది. కలెక్టర్ మీద దాడి జరగటం, అందులో నరేందర్ కీలకపాత్రదారుడిగా పోలీసులు గుర్తించటంతోనే వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు.