
సిట్ విచారణకు ముగ్గురు సెలబ్రిటీలు హాజరు
బ్యాంకు లావాదేవీలు, ఒప్పందాల వివరాలు సమర్పించిన అమృతా చౌదరి, నిధి అగర్వాల్ , శ్రీముఖి
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు లో సీఐడీ సిట్ అధికారులు కొరడా ఝులిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలను విచారణ చేస్తున్నారు. శుక్రవారం హీరోయిన్లు నిధి అగర్వాల్, అమృత చౌదరి తో బాటు యాంకర్ శ్రీముఖి విచారణకు హాజరయ్యారు.
సిట్ అధికారులకు వివరాలు సమర్పణ
బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బెట్టింగ్ యాప్ యాజమాన్యాలతో చేసుకున్న అగ్రిమెంట్ వివరాలను సీఐడీ సిట్ అధికారులకు సెలబ్రిటీలు అందజేశారు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి వంటి సెల బ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై గతంలో మియాపూర్, పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మొత్తం 29 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి , యాంకర్ విష్ణుప్రియ , సిరి హనుమంతులను విచారణ చేశారు. మరో సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. గతవారమే సిట్ విచారణకు హాజరై బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయనని స్పష్టం చేశారు. గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తుండటంతో ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు ప్రకాశ్ రాజ్ తెలిపారు. ‘బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు నన్ను క్షమించండి’ అని ఆయన మీడియాముఖంగా చెప్పారు. ‘బెట్టింగ్ యాప్ లకు యువత బానిసై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడితేనే ప్రయోజనాలు ఉన్నాయని యువతకు హితవు పలికారు. సీఐడీ సిట్ అధికారులు శుక్రవారం ముగ్గురు సినీ సెలబ్రిటీలను విచారణ చేయడంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.

