
ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి.. తల్లిపైనే అనుమానం..!
పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే పిల్లల మరణానికి కారణం ఏంటి అనే అంశంపై స్పష్టత వస్తుంది. రజిత, చెన్నయ్యలను ఇంకా పూర్తిస్థాయిలో విచారించలేదు అని ఎస్పీ తెలిపారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాట్లు స్థానిక సీఐ నరేష్ చెప్పారు. ప్రస్తుతానికి తండ్రిని అదుపులోకి తీసుకున్నామని, పిల్లల తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. కాగా చిన్నారుల మృతి వెనక కారణం తెలుసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
అయితే ఈ ఘటన స్థానికంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. భర్త చెన్నయ్యే.. భార్య, పిల్లలను మట్టుబెట్టడానికి ప్లాన్ చేశాడా? చెన్నయ్యతో కలిసి జీవించలేక పిల్లలను చంపి తాను చనిపోవాలని రజిత భావించిందా? ఫుడ్ పాయిజన్ కారణంగా పిల్లలు మరణించారా? ఒక పిల్లలను చంపి, తాను చనిపోవాలని రజిత భావించి ఉంటే అందుకు కారణం ఏంటి? చెన్నయ్యే హత్యకు ప్లాన్ చేసి ఉంటే.. అలా ఎందుకు చేయాలనుకున్నాడు? ఇలా మరెన్నో అనుమానాలు ఈ ఘటన చుట్టూ వినిపిస్తున్నాయి.
సీఐ నరేష్ చెప్పిన వివరాల పరకారం.. అమీన్‌పూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య, అతని భార్య రజిత నివాసముంటున్నారు. వారికి ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) ఉన్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కుటుంబమంతా కలిసి భోజనం చేశారు. చెన్నయ్య అన్నం, పప్పుతో భోజనం చేశాడు. రజిత, ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిన్నారు. భోజనం తర్వాత చెన్నయ్య తన పనికి వెళ్లాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. అప్పటికే పిల్లలు నిద్రిస్తున్నారు. రజిత.. చెన్నయ్య కోసం మేల్కొని ఉంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రజితకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చి ఇబ్బంది పడుతుండటంతో.. చెన్నయ్య.. ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు.
ఆమె అక్కడ చికిత్స పొందుతుండగా.. ఇంటికి వచ్చిన చెన్నయ్య పిల్లలను పరిశీలించగా వారు మరణించినట్లు గుర్తించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈమేరకు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన అనుమానితుడిగా చెన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అతను తన భార్యపై అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. పెరుగన్నంలో విషం కలుపి పిల్లలకు పెట్టి, తాను తిని ఆత్మహత్యకు తన భార్య పాల్పడి ఉంటుందని చెన్నయ్య అనుమానిస్తున్నాడు. దీంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముందుకు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా చెన్నయ్య, ఆయన కుటుంబం గురించి స్థానికంగా ఆరా తీస్తున్నారు. ఉపాది కోసం కొంతకాలంగా చెన్నయ్య, ఆయన కుటుంబం అమీన్‌పూర్‌లోనే ఉంటున్నట్లు స్థానికలు చెప్పారు. అంతేకాకుండా చెన్నయ్య, రజిత మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్థానికులు చెప్తున్నారు. చెన్నయ్యకు రజిత రెండవ భార్య అని, ముగ్గురు పిల్లలు కూడా వారి సంతానమేనని స్థానికులు చెప్పారు.
‘‘ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే పిల్లల మరణానికి కారణం ఏంటి అనే అంశంపై స్పష్టత వస్తుంది. రజిత, చెన్నయ్యలను ఇంకా పూర్తిస్థాయిలో విచారించలేదు. ఏ విషయం ఇప్పుడే చెప్పలేం. ఈ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకంగా మారనుంది’’ అని ఎస్సీ పరితోష్ పంకజ్ తెలిపారు. అదే విధంగా పెరుగు ప్యాకెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజిత ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి అంగడి నుంచి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నారు. దాంతోనే పిల్లలు, తాను భోజనం చేశామని తెలిపిందని, పిల్లలకు ఏమైన విషయం కూడా ఆమెకు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. పిల్లలను చూడాలని రజిత అడుగుతుందని, కానీ తాము ఇంకా ఏ విషయం చెప్పలేదని పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.