రాష్ట్రాల విభజనలో ఈ మూడు అంశాలే కీలకమా ?
x
Revanth and Naidu

రాష్ట్రాల విభజనలో ఈ మూడు అంశాలే కీలకమా ?

ఆర్ధికసంబంధమైన అంశాల దగ్గర పీటముడిపడింది. దాంతో విభజన అంశాలు కాస్త వివాదాలుగా మారిపోయి పరిష్కారం కాకుండా సా....గుతునే ఉన్నాయి.


రెండు తెలుగురాష్ట్రాల మధ్య విభజన అంశాలు పరిష్కారం కాకుండా కంటిన్యు అవుతున్నాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రులైన కేసీయార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి అంశాలపరిష్కారం విషయంలో సరైన శ్రద్ధచూపలేదు. దానికితోడు ఆర్ధికసంబంధమైన అంశాల దగ్గర పీటముడిపడింది. దాంతో విభజన అంశాలు కాస్త వివాదాలుగా మారిపోయి పరిష్కారం కాకుండా సా....గుతునే ఉన్నాయి.

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడుమాసాలకు ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావటంతో రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అసలు రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి కీలకమైన పాయింట్లు ఏమిటనే విషయమై చర్చలు మొదలయ్యాయి. చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నా కీలకమైనవి మాత్రం మూడుగా అర్ధమవుతోంది. అవేమిటంటే ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, విద్యుత్ బకాయిల చెల్లింపు, హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కలున్న కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ విభజన కీలకంగా మారింది. విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను 58:42 నిష్పత్తిలో పంచారు. అంటే ఏపీకి 58 శాతం, తెలంగాణాకు 42 శాతం చొప్పున పంపకాలు జరగాలి. అదేపద్దతిలో ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన కూడా జరగాలి. కాని కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఈ నిష్పత్తికి అంగీకరించకుండా చెరిసగం అన్నట్లుగా పట్టుబట్టారు. దాంతో దాని పంపకం ఆగిపోయింది.

ఇక విద్యుత్ సంస్ధ బకాయిల విషయమై ఏపీకి తెలంగాణా రు. 6500 కోట్లు చెల్లించాలని విభజన చట్టంలో ఉంది. అయితే దీన్నికూడా కేసీయార్ లెక్కచేయలేదు. తాము ఏపీకి రు. 6500 కోట్లు చెల్లించటం కాదని ఏపీనే తెలంగాణాకు చెల్లించాలంటు అడ్డం తిరిగారు. దాంతో విద్యుత్ బకాయిల అంశం కూడా వివాదంగా మారిపోయింది. హైదరాబాద్ లోని కేంద్రప్రభుత్వ రంగం సంస్ధల విభజన కూడా ఇలాగే వివాదాల్లో కూరుకుపోయింది. దీని విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వ రంగసంస్ధలు హైదరాబాద్, చుట్టుపక్కల సుమారు 110 దాకా ఉన్నాయి. వీటి విభజన కోసం అప్పటి కేంద్రప్రభుత్వం షీలాబిడే కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ హైదరాబాద్ వచ్చి అన్నీ ప్రభుత్వరంగ సంస్ధల ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. ఆర్ధికపరమైన అంశాలతో పాటు మార్కెట్ విలువ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది.

ప్రభుత్వరంగ సంస్ధలను హైదరాబాద్ నుండి తరలించటం సాధ్యంకాదు కాబట్టి వాటి మార్కెట్ విలువను లెక్కకట్టి ఏపీకి దక్కాల్సిన 58 శాతం వాటాను డబ్బురూపంలో తెలంగాణా ప్రభుత్వం ఏపీకి చెల్లించాలని నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను కేసీయార్ లెక్కచేయలేదు. హైదరాబాద్ లో ఉండే అన్నీ కేంద్రప్రభుత్వరంగంసంస్ధలు తెలంగాణాకే సొంతం కాబట్టి ఏపీ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించేదిలేదని చెప్పారు. దాంతో ఇదికూడా పెద్ద వివాదంగా మారిపోయింది. ఇలా ఏ అంశంచూసినా వివాదంగా మారిపోయింది. అసలు విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమాత్రం ఆసక్తిచూపలేదు. దాంతో సమస్యలు విదాదాలుగా మారటంతో పాటు రెండు రాష్ట్రాల్లోను రెండు ప్రభుత్వాలు మారిపోయాయి.

ఓటుకునోటు కేసు నేపధ్యంలో కేసీయార్ దెబ్బకు చంద్రబాబు హైదరాబాద్ వదిలేసి వెళ్ళి విజయవాడలో కూర్చున్నారు. దాంతో తెలంగాణా సెక్రటేరియట్ లోని ఏపీ వాటాకు వచ్చిన నాలుగు భవనాలను చంద్రబాబు పాడుపెట్టేశారు. ఏపీ సచివాలయాన్ని అమరావతికి మార్చిన తర్వాత ఏపీ వాటాగా వచ్చిన భవనాలను అలాగే ఉంచేయటంతో అవి పాడైపోయాయి. ఈ భవనాలతో పాటు దిల్ కుష్ గెస్ట్ హౌస్, గ్రీన్ ల్యాండ్ గెస్ట్ హౌస్ లాంటి చాలా భవనాలను చంద్రబాబు పట్టించుకోలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సచివాలయంలోని నాలుగు పెద్ద భవనాలను కేసీయార్ కు ఇచ్చేశారు. దాంతో అన్నీ భవనాలను కూలగొట్టి కేసీయార్ కొత్త సచివాలయాన్ని నిర్మించుకున్నారు. ఆ నాలుగు భవనాలకు మార్కెట్ ప్రకారం ఎంత విలువ లెక్కకట్టారో తెలీదు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏపీ ఆధీనంలో ఉన్న అన్నీ భవనాలను తెలంగాణా ప్రభుత్వం తీసేసుకుంటుందని రేవంత్ ఈమధ్యనే ప్రకటించారు. భవనాలన్నింటినీ తీసేసుకోవటం అంటే ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు.

భవనాలను తీసుకోవాలని అనుకున్న తెలంగాణా ప్రభుత్వం వాటి మార్కెట్ విలువను ఏపీ ప్రభుత్వానికి చెల్లిస్తుందా ? లేకపోతే గెస్ట్ హౌస్ భవనాలు కేవలం పదేళ్ళు మాత్రమే ఏపీ ప్రభుత్వం వాడుకుని కాలపరిమితి అయిపోయిన తర్వాత తిరిగి తెలంగాణా ప్రభుత్వానికి ఇచ్చేయాలా అన్నది స్పష్టతలేదు. పదేళ్ళు భవనాలను వాడుకున్నందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వానికి అద్దెచెల్లించాలని అప్పట్లో కేసీయార్ డిమాండ్ చేశారు. మరి ఆ అద్దెల విషయాన్ని రెండు ప్రభుత్వాలు ఏ విధంగా పరిష్కరించుకుంటాయో చూడాలి.

ఇదే విషయమై కాంగ్రెస్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి నిరంజన్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘సమస్యలను పరిష్కారం చేసుకుంటేనే రెండు రాష్ట్రాలకు మంచిద’న్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చొరవచూపించాలన్నారు. ‘ఆస్తులు అప్పులను విభజన చట్టం ప్రకారం 58:42 నిష్పత్తి ప్రకారం పరిష్కారించుకోవాల’న్నారు. ‘సమస్యల పరిష్కారం అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా కేసీయార్ పదేళ్ళు తెలంగాణా సెంటిమెంటును ప్రయోగించి కాలంగడిపేసి’నట్లు ఆరోపించారు. ‘విభజన సమస్యల పరిష్కారానికి రేవంత్ సిద్ధంగా ఉన్నట్లే చంద్రబాబు కూడా చొరవచూపించాల్సిన అవసరముంద’ని నిరంజన్ అభిప్రాయపడ్డారు. ‘సమస్యలను పరిష్కరించుకోకుండా అలాగే పెండింగులో పెట్టుకోవటం రెండు రాష్ట్రాలకు మంచిదికాద’ని నిరంజన్ అభిప్రాయపడ్డారు.

Read More
Next Story