తెలంగాణలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..జులై 1 నుంచి అమలు
x
కొత్త క్రిమినల్ చట్టాలు (ఫైల్ ఫొటో)

తెలంగాణలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..జులై 1 నుంచి అమలు

తెలంగాణలో జులై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్నాయి.భారతీయ న్యాయ సంహిత,నాగరిక్ సురక్ష సంహిత,సాక్ష్యా అధినియం చట్టాలు అమలులోకి రానున్నాయి.


భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక్ సురక్ష సంహిత,భారతీయ సాక్ష్యా అధినియం బిల్లులను గత ఏడాది ఆగస్టు 11వతేదీన మొదటిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్ పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ఐపీసీ(ఐఈఏ) చట్టాలకు పాతరేస్తూ ఈ కొత్త చట్టాలు జులై 1వతేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

- మూడు కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలంగాణ సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది డిసెంబర్ 25వతేదీన ఆమోదం తెలిపారు.దీంతో కొత్త చట్టాల అమలుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
భారతీయ న్యాయ సంహిత చట్టం అంటే ఏమిటి?
భారతీయ న్యాయ సంహిత చట్టంలో 358 విభాగాలున్నాయి.దేశంలోని కొత్త క్రిమినల్ కోడ్. దీనిలో 511 సెక్షన్లు ఉన్నాయి. 163 ఏళ్ల భారతీయ శిక్షాస్మృతిని ఈ కొత్త చట్టం భర్తీ చేయనుంది.వైవాహిక అత్యాచారం,వ్యవస్థీకృత నేరాలు, సైబర్ క్రైమ్ వంటి సమస్యలను పరిష్కరిస్తూ చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునికీకరించింది.

భారతీయ నాగరిక్ సురక్ష సంహిత
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. 1973 సీఆర్ పీసీని స్థానంలో ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది. ఈ చట్టం అరెస్టు,ప్రాసిక్యూషన్,బెయిల్ కోసం విధానాలను అందిస్తుంది.ఈ కొత్త చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్ష లేదా అంతకంటే ఎక్కువ శిక్ష విధించే నేరాలకు ఫోరెన్సిక్ విచారణను తప్పనిసరి చేసింది.ఈ చట్టం ప్రకారం 15 రోజుల వరకు పోలీసు కస్టడీని అనుమతించనుంది.కొత్త చట్టం ప్రకారం ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరికైనా బెయిల్‌ను కూడా నిరాకరిస్తుంది.

భారతీయ సాక్ష్యా అధినియం
భారతీయ సాక్ష్యా అధినియం చట్టం కాలం చెల్లిన భారతీయ సాక్ష్యాధారాల చట్టం స్థానంలో వచ్చింది. ఇది డిజిటల్ యుగంలోని సవాళ్లను పరిష్కరించనుంది. ఇది ఎలక్ట్రానిక్ రికార్డులను సాక్ష్యంగా సంప్రదాయ పత్రాలతో సమాన స్థాయిని ఇస్తుంది.చట్టపరమైన చర్యలను ఆధునిక వాస్తవాలకు మరింత అనుకూలంగా చేయనుంది.
పౌరుల స్వేచ్ఛకు ముప్పు
కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ చట్టాల వల్ల పోలీసు అధికారాల్లో కొన్ని మార్పులు వస్తాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.పౌరుల స్వేచ్ఛకు ముప్పు అని కొందరు న్యాయవాదులు అంటున్నారు.

కొత్త చట్టాల అమలుపై స్టే విధించాలని సుప్రీంలో పిటిషన్
కొత్తగా అమలు చేయనున్న మూడు క్రిమినల్ చట్టాల అమలుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో జూన్ 27వతేదీన పిటిషన్ దాఖలైంది. ఈ కొత్త చట్టాల అమలు సాధ్యతను అంచనా వేయడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయవాదులు సంజీవ్ మల్హోత్రా, కున్వర్ సిద్ధార్థ్,అంజలే పటేల్, ఛాయామిశ్రాలు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

కొత్త చట్టాలపై తెలంగాణ పోలీసులకు శిక్షణ
మహీంద్రా యూనివర్శిటీలో కొత్త క్రిమినల్ చట్టాలపై తెలంగాణ పోలీసు అధికారులకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది.కాలం చెల్లిన చట్టాలను నవీకరించడం,నేర న్యాయ వ్యవస్థను ఆధునీకరించడం,ట్రయల్స్‌లో ఆవిష్కరణలను తీసుకురావడం మొదలైనవి ఈ కొత్త చట్టాల లక్ష్యమని మేడ్చల్ డీసీపీ నితికా పంత్ చెప్పారు. ఈ కొత్త చట్టాల్లో లింగ సమ్మేళనం,బాధితులకు రక్షణ,న్యాయ వ్యవస్థను వేగవంతం చేయడం ప్రధానమైనవని ఆమె పేర్కొన్నారు.

బాధితులకు ఉచిత వైద్య చికిత్స
ఈ కొత్త చట్టాలు అన్ని ఆసుపత్రుల్లో మహిళలు, పిల్లలతోపాటు బాధితులకు ఉచిత ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్సకు హామీ ఇస్తున్నాయి. కొత్త చట్టాల్లో ఫాస్ట్-ట్రాక్ ఇన్వెస్టిగేషన్‌ చేయనున్నారు. కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన దర్యాప్తులకు ప్రాధాన్యతనిచ్చాయి. కేసు నమోదు చేసిన రెండు నెలలలోపు విచారణ పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నారు.కొత్తగా సమన్లను ఎలక్ట్రానిక్ గా అందించనున్నారు.

మహిళలపై నేరాల్లో...
మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి స్టేట్‌మెంట్‌లను మహిళా మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేయాలి. మహిళా మెజిస్ట్రేట్ లేనప్పుడు, పురుష మేజిస్ట్రేట్ మహిళ సమక్షంలో స్టేట్ మెంట్లను నమోదు చేస్తారు.కేసు విచారణలలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి కోర్టులు గరిష్ఠంగా రెండు వాయిదాలను మంజూరు చేస్తాయి.ఎఫ్ఐఆర్ లు ఆన్ లైన్ లో ఉంచడం, జీరో ఎఫ్ఐఆర్ ల నమోదు చేయనున్నారు.

బ్రిటీష్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలు : నల్సార్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త క్రిమినల్‌ చట్టాలను రూపొందించారని నల్సార్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు చెప్పారు. బ్రిటిషర్ల హయాంలో చేసిన భారత శిక్షా స్మృతి -1860 (ఐపీసీ), క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌-1973 (సీఆర్పీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌-1872 స్థానంలో కొత్త చట్టాలు అమలు చేయనున్నారని ఆయన చెప్పారు. ఈ చట్టాలు శిక్ష కంటే న్యాయంపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని ఆయన పేర్కొన్నారు. అసమంజసమైన వాయిదాలను అరికట్టడం ద్వారా బాధితులకు సత్వర న్యాయాన్ని అందించేందుకు కాలపరిమితిని ఈ కొత్త చట్టాలు నిర్ణయిస్తాయని ఆయన వివరించారు.

కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : మాజీ ఐజీ దామోదర్‌
న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేందుకు కొత్త క్రిమినల్‌ చట్టాలు దోహదపడతాయని మాజీ ఐజీ దామోదర్‌ చెప్పారు. ఈ కొత్త చట్టాలపై అందరూ అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారని, చిన్న నేరాలకు పాల్పడినవారికి సమాజ సేవను శిక్షగా విధించనున్నారని దామోదర్ వెల్లడించారు. ఆర్థిక,సైబర్‌ నేరాలను వ్యవస్థీకృత నేరాలుగా వర్గీకరించారని ఆయన పేర్కొన్నారు.


Read More
Next Story