
పులుల జంట కరీనా, శంకర్
Kakatiya Zoo Park | హైదరాబాద్ నుంచి పులుల జంట హన్మకొండకు తరలింపు
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతుప్రదర్శన శాలలోని రెండు పులులను హన్మకొండలోని కాకతీయ జూపార్కుకు తరలించారు. పులుల జంట హన్మకొండలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సందర్శకులను ఆకట్టుకున్న రెండు పులులను హన్మకొండ జూపార్కుకు తరలించారు. శంకర్ అనే పేరు గల పదేళ్ల వయసున్న మగపులి, కరీనా అనే పేరున్న 15 ఏళ్ల వయసుగల ఆడ పులి జంటను వరంగల్ ఉమ్మడి జిల్లా సందర్శకుల కోసం హన్మకొండలోని జూపార్కుకు తరలించామని నెహ్రూ జూలాజికల్ పార్కు డిప్యూటీ డైరెక్టరైన పశువుల డాక్టర్ డాక్టర్ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- హన్మకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న కాకతీయ జూపార్కులో జంట పులుల నివాసం కోసం ప్రత్యేకంగా ఎన్ క్లోజర్లు నిర్మించారు. హైదరాబాద్ నగరం నుంచి ప్రత్యేక ట్రక్కుల్లో వరంగల్ నగరానికి తరలించి, కాకతీయ జూపార్కులోని విశ్రాంతి గృహంలో వాటిని ఉంచారు. పులుల పరిశీలన అనంతరం రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండలోని కాకతీయ జూపార్కులోని ఎన్ క్లోజర్లను ప్రారంభించారు.
- రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చొరవతో నెహ్రూ జూపార్కు అసిస్టెంట్ డైరెక్టరు కె వై సుభాష్, భద్రాచలం అటవీశాఖ అధికారి భీమానాయక్, హన్మ కొండ అటవీశాఖ అధికారి లావణ్య కృషితో హన్మకొండ జూపార్కుకు పులులను తీసుకువచ్చారు. పులులను డాక్టర్ ప్రవీణ్ కుమార్ పరీక్షించారు.
పులుల సంరక్షణపై ఎనిమల్ కీపర్లకు శిక్షణ
నెహ్రూ జూలాజికల్ పార్కులో 22 పులులుండగా, వీటిలో రెండింటిని హన్మకొండలోని కాకతీయ జూపార్కుకు తరలించామని ఆయన పేర్కొన్నారు.పులుల జంట హైదరాబాద్ జూపార్కులోనే జన్మించినందున వరంగల్ వాతావరణానికి అనుకూలంగానే ఉంటాయని డాక్టర్ హకీం చెప్పారు. పులులను హన్మకొండ జూపార్కుకు తరలించే ముందు వీటి ఆలన పాలన, ఆహారం ఎన్ని సార్లు పెట్టాలి అనే అంశాలపై జూపార్కులోని ఎనిమల్ కీపర్లకు శిక్షణ ఇచ్చామని ఆయన వివరించారు.
జూపార్కులోనే జన్మించిన పులుల జంట
శంకర్, కరీనా పులుల జంట హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో జన్మించాయి. శంకర్ పదేళ్లపాటు, కరీనా 15 ఏళ్ల పాటు హైదరాబాద్ జూపార్కులో సందర్శకులకు కనువిందు చేశాయి.నెహ్రూజూపార్కులో పులుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వీటిలో జంట పులులను అక్కడి సందర్శకుల కోసం హన్మకొండ జూపార్కుకు తరలించామని జూపార్కు ప్రజాసంబంధాల విభాగం అధికారి హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పులుల కోసం రూ.70లక్షలతో ఎన్ క్లోజరు
కాకతీయ జూపార్కులో పులుల కోసం రూ.70 కోట్లతో ఎన్ క్లోజరును నిర్మించామని హన్మకొండ డీఎఫ్ఓ బి లావణ్య చెప్పారు. ఈ శీతాకాలంలో పులులకు వెచ్చదనాన్ని అందించేలా వాటర్ హీటర్స్ ను ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. శంకర్, కరీనా పులుల జంట మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని, దీంతో ఈ పులుల జంటను కాకతీయ జూపార్కుకు తీసుకువచ్చామని అటవీశాఖ అధికారులు చెప్పారు. కాకతీయ జూపార్కులో ఓ చిరుత పులి కూడా ఉంది.
దత్తత ఇస్లాం : అటవీశాఖ అధికారులు
హన్మకొండలోని కాకతీయ జూపార్కుకు తీసుకువచ్చిన పులులను వన్యప్రాణుల ప్రేమికులకు, కార్పొరేట్ సంస్థలకు దత్తత ఇస్తామని అటవీశాఖ అధికారులు చెప్పారు. ఒక్కో పులికి ఏడాది ఆహారం కోసం రూ.3లక్షలు అవుతుందని, ఎవరైనా దీన్ని దత్తత తీసుకోవచ్చని అధికారులు కోరారు.
Next Story