
రేవంత్ మీద టాలివుడ్ గెరిల్లా దాడి....
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ) 400 ఎకరాలపై టాలివుడ్ ప్రముఖులు కొందరు ఘాటుగా స్పందించారు.
మొన్నటివరకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాలంటేనే టాలివుడ్ జనాలు భయపడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఇపుడు రేవంత్ పై కొందరు టాలివుడ్ జనాలు రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్(Revanth) కు టాలివుడ్ ప్రముఖులకు గ్యాప్ పెరిగిపోయింది. రేవంత్ ముఖ్యమంత్రయిన తర్వాత చాలామంది ప్రముఖులు అభినందించను కూడా లేదు. తర్వాత ఏదోసందర్భంగా నందిఅవార్డుల స్ధానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు రేవంత్ చేసిన ప్రకటనను టాలివుడ్(Tollywood) పట్టించుకోలేదు. గద్దర్ అవార్డుల ప్రధానంపై అభిప్రాయాలు చెప్పాలని రేవంత్ కోరినా సినీ ప్రముఖులు స్పందించలేదు. కొందరేమో సినీపరిశ్రమకు గద్దర్ కు ఏమిటి సంబంధమని పరోక్షంగా రేవంత్ ను నిలదీసినట్లుగా మాట్లాడారు. ఆతర్వాత అక్కినేని నాగార్జున(Akkineni nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా కూల్చేయటంతో టాలివుడ్ జనాల్లో రేవంత్ అంటే ఒక్కసారిగా భయంపెరిగిపోయింది.
ఆమధ్య పుష్ప సినిమా(Pushpa Movie) రిలీజ్ సందర్భంగా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు హీరో అల్లు అర్జునే(Allu Arjun) కారణమని పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపటం పెద్ద సంచలనమైపోయింది. ఈ తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ తాను ఉన్నంతవరకు సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని ప్రకటించారు. రేవంత్ ప్రకటనతో టాలివుడ్ మొత్తం ఉలిక్కిపడింది. ఎందుకంటే బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదంటే బడా నిర్మాతలు, పెద్ద హీరోలు బాగా ఇబ్బందిపడిపోతారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని సినీప్రముఖులు వేరేదారిలేక రేవంత్ తో రాజీ చేసుకున్నారు. ఎఫ్డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మధ్యవర్తిత్వంతో కొందరు సినీప్రముఖులు రేవంత్ తో భేటీ అయి గ్యాప్ ను తగ్గించుకునే ప్రయత్నంచేశారు. ఆ తర్వాత రేవంత్-టాలివుడ్ కు మధ్య పెద్దగా వివాదాలు ఏమీ రేగలేదు.
అయితే ఈమధ్య వివాదాస్పదమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి(హెచ్సీయూ) 400 ఎకరాలపై టాలివుడ్ ప్రముఖులు కొందరు ఘాటుగా స్పందించారు. ఉపాసన కొణిదెల(Upasana Konidela), రేణుదేశాయ్(RenuDesai), ప్రకాష్ రాజ్(Prakash Raj), సమంత(Samantha), నాగ్ అశ్విన్ లాంటి మరికొందరు రేవంత్ ప్రభుత్వాన్ని తప్పుపడుతు గట్టిగా ట్విట్టర్లో అనేక ట్వీట్లు పెట్టారు. ఎవరు కూడా రేవంత్ ను డైరెక్టుగా పేరుపెట్టి విమర్శలు చేయనప్పటికీ చేసిన విమర్శలు, వ్యాఖ్యలన్నీ రేవంత్ ను ఉద్దేశించి చేసినవే అని అర్ధమైపోతోంది. హెచ్సీయూ(HCU) పరిధిలో ఉన్న 400 ఎకరాల్లో వేలాది చెట్లను తొలగిస్తే హైదరాబాద్ కు ఆక్సిజన్ హబ్ దెబ్బతింటుందని ఉపాసన, రేణుదేశాయ్ తమ అభ్యంతరాలను వ్యక్తంచేశారు. వేలాది చెట్లను నరికేస్తే పక్షి, జంతుజాలం ఎక్కడికి పోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాలను నరికేసి వాతావరణ సమస్యలకు కారణమవుతున్న ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డారు. ఆందోళనచేస్తున్న విద్యార్ధులను అభినందించిన ప్రకాష్ రాజ్ తాను విద్యార్ధులకు మద్దతుగా నిలబడుతున్నట్లు ప్రకటించారు.
అశ్విన్ నాగ్ హెచ్సీయూ ఉదంతంపై స్పందిస్తు ‘ఇదంతా మనఖర్మ’ అని ట్వీటారు. ‘వేలాది చెట్లు కొట్టేసి బయోడైవర్సిటీని దెబ్బతీయటం ప్రభుత్వానికి తగద’ని సమంత ట్వీట్ చేశారు. ప్రభుత్వం చేస్తున్నది తప్పని సమంత తేల్చేశారు. కొందరైతే హెచ్సీయూ భూముల్లో చెట్ల నరికివేత వల్ల నెమళ్ళు, జింకలు ఇబ్బందులు పడుతున్నాయంటు కొన్ని ఫొటోలు, వీడియోలను కూడా తమ ట్వీట్లకు ట్యాగ్ చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హెచ్సీయూలో ఏమి జరుగుతున్నది అన్నవిషయాన్ని వీరిలో ఒక్కరుకూడా ప్రత్యక్షంగా యూనివర్సిటీకి వెళ్ళి చూడలేదు. మీడియాలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియా పోస్టులు, బీఆర్ఎస్, బీజేపీ నేతల ఆరోపణలు, ప్రకటనల ఆధారంగా మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు.
సినీ ప్రముఖుల్లో చాలామంది బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కు మద్దతు ఉండే సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు, వీడియోలు, సమాచారాన్నిమాత్రమే ఆధారంగా చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చిపోయారు. అంతేకాని హెచ్సీయూలో అసలు నిజాలు ఏమిటి అన్న విషయాన్నిపట్టించుకున్నట్లు లేదు. ఒక్కసారిగా ఇంతమంది టాలివుడ్ ప్రముఖులు రేవంత్ ప్రభుత్వానికి ఎందుకిలా రెచ్చిపోయారు ? ఎందుకంటే చాలాకాలంగా రేవంత్ పై లోలోపల పెరిగిపోతున్న మంటే కారణమని అర్ధమవుతోంది. నంది స్ధానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని రేవంత్ చెప్పటం టాలివుడ్ కు ఏమాత్రం ఇష్టంలేదు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా ఏమీ మాట్లాడలేకపోయారు.
పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అల్లుఅర్జున్ పై కేసు పెట్టి అరెస్టుచేయటాన్ని టాలివుడ్ లో చాలామంది తట్టుకోలేకపోయారు. అయితే ఆ విషయమై బహిరంగంగా ఎవరూ రేవంత్ ను తప్పుపట్టే సాహసంచేయలేదు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తే భవిష్యత్తులో తమకు ఎక్కడ సమస్యలు వస్తాయో అని భయపడ్డారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న రేవంత్-టాలివుడ్ సంబంధాలను మంత్రి కొండాసురేఖ మరింతగా దిగజార్చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని అక్కినేని నాగార్జునను కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేసినట్లు కొండా చేసిన ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపాయి. కొండాసురేఖ(Konda Surekha) ఆరోపణల వెనుక రేవంతే ఉన్నాడని చాలామంది టాలివుడ్ ప్రముఖులు అనుమానించారు. ఇలాంటి అనేక అంశాలను మనసులో పెట్టుకున్న టాలివుడ్ జనాల్లో కొందరు ఇపుడు అవకాశం దొరికిందని హెచ్సీయూ వివాదంపై ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఎక్కడా పేరుప్రస్తావించకుండానే ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని టాలివుడ్ ప్రముఖుల్లో కొందరు రేవంత్ పై గొరిల్లా ఫైట్ చేస్తున్నట్లే అనుమానంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రేగినపుడల్లా టాలివుడ్ జనాలు రేవంత్ పై పరోక్షంగా గళమెత్తేందుకు సిద్ధపడుతున్నట్లే అనిపిస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.