రేపు ఈద్ ఉల్ ఫితర్ పండుగ...ఫిత్రా దానంతో ముగియనున్న రమజాన్
x
HYDERABAD-MACCA-MASGID

రేపు ఈద్ ఉల్ ఫితర్ పండుగ...ఫిత్రా దానంతో ముగియనున్న రమజాన్

ఉపవాసాలు, వెల్లివిరిసిన దాతృత్వంతో పవిత్ర రమజాన్ మాసం గురువారం జరగనున్న ఈదుల్ ఫితర్ పండుగతో ముగియనుంది.ఈద్ పండుగ వేళ నెలకొన్న సందడి, ఫిత్రా దానాలపై కథనం...


దాతృత్వానికి ప్రతీకగా నిలచిన పవిత్ర రమజాన్ పండుగ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గురువారం జరుపుకోనున్నారు. ఈ రమజాన్ మాసంలో జకాత్ విరాళాలు ఇవ్వడమే కాకుండా పండుగకు మూడు రోజుల ముందు నిరుపేదలు కూడా పండుగ జరుపుకునేలా ముస్లింలు ఫిత్రా పేరిట దానం చేస్తున్నారు. మానవాళికి దాతృత్య సందేశాన్ని ఇచ్చేదే రమజాన్. ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని ముస్తాబు చేశారు.

- ఫిత్రా అంటే పండుగ సందర్భంగా తనతోపాటు పేదలకు కూడా సంతోషాన్నివ్వడం. పేదసాదలకు దానం చేయాలనే ధర్మం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. ఈ దాన ధర్మం ప్రకారం ఫిత్రాను రమజాన్ సందర్భంగా నగదు లేదా సరకుల రూపంలో అందజేస్తున్నారు. మూడు పూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదలకు ఈ ఫిత్రాదానాన్ని ఇస్తుంటారు. ఉపవాస వ్రతాలు ముగిసిన తర్వాత దేవుడికి కృతజ్ఞతగా ఈ ఫిత్రాదానాన్ని విధిగా చేస్తుంటారు. నిరుపేదలు కూడా రమజాన్ పండుగ జరుపుకునేందుకు వీలుగా వారికి ఫిత్రా దానం అందిస్తుంటారు.
ముస్లింలు రమజాన్ సందర్భంగా వారి వారి కుటుంబంలోని ప్రతీ సభ్యుడి పేరిట పేదలకు ధనం లేదా ఆహారధాన్యాలను ‘ఫిత్రా’ కింద పంచి పెడుతున్నారు. ఫిత్రా దానం కింద ఒక్కోక్కరు 1750 గ్రాముల గోధుమలు, లేదా మూడున్నర కిలోల రాగి జావ, లేదా 245రూపాయలు, ఖర్జూరమైతే మూడున్నర కిలోలు ఫిత్రా కింద ఇవ్వాలని హైదరాబాద్ మసీదు ఇమాం రిజ్వాన్ ఖురేషి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఇతర ఆహారధాన్యాలు, లేదా దానికి సమానమైన డబ్బును విధిగా దానం చేస్తున్నారు. వారివారి ఆర్థిక స్థోమతను బట్టి గోధుమలు, ఖర్జూరాలు, కిస్మిస్ ఫిత్రా కింద ఇస్తున్నారు. ఫిత్రా ఇవ్వడం వల్ల తమ చెడు తలంపులు, అసత్యాలు, పొరపాట్లు క్షమించబడతాయని ముహమ్మద్ ప్రవక్త సెలవిచ్చారు. 52.5 గ్రాముల వెండి లేదా 75గ్రాముల బంగారం ఉన్న ప్రతీ వ్యక్తి ఫిత్రాను విధిగా దానం చేయాలి.

రేపు ఈద్ ఉల్ ఫితర్ పండుగ
రమజాన్ నెల ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత గురువారం ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ పండుగను జరుపుకోనున్నారు. ఈ పండుగ సందర్భంగా కొత్త దుస్తులు ధరించి ఈద్గాకు వెళ్లి భక్తిశ్రద్ధలతో నమాజు చేస్తారు. అనంతరం సేమియా, డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఖీర్ తినిపించుకుంటూ ఒకరినొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కఠోర ఉపవాసాలు, దాతృత్వంతో వెల్లివిరిసిన రమజాన్ మాసం ఈద్ ఉల్ ఫితర్ పండుగతో ముగియనుంది. గల్స్ దేశాల్లో ఈద్ పండుగను మంగళవారమే జరుపుకున్నారు. దీంతో సౌదీ అరేబియాతో పాటు గల్ఫ్ దేశాల్లో నివాసముంటున్న మన హైదరాబాదీలకు ఇక్కడి బంధుమిత్రులు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ఉల్ ఫితర్ పండుగ కోసం హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు.

చార్మినార్ వద్ద రమజాన్ షాపింగ్ సందడి
రమజాన్ పండుగ నేపథ్యంలో చార్మినార్ వద్ద రాత్రివేళ షాపింగ్ సందడి నెలకొంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతుల్లో చార్మినార్, లాడ్ బజార్, గుల్జార్ హౌస్, పత్తర్ గట్టి ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి. రేపు పండుగ కావడంతో బుధవారం పెద్ద సంఖ్యలో ముస్లింలు షాపింగ్ కు తరలివచ్చారు. రాత్రివేళ ఇఫ్తార్ తర్వాత షాపింగుకు వస్తుండటంతో ఓల్డ్ సిటీ కళకళలాడుతుంది. ఒక వైపు షాపింగ్ సందడి మరో వైపు హలీం, బిర్యానీ, పత్తర్ కా ఘోష్, మటన్ మరగ్ మసాలా రుచులను చవిచూసేందుకు ప్రజలు చార్మినార్ ప్రాంతానికి తరలివచ్చారు. పండుగ కోసం ముస్లింలు సుర్మా, టోపీలు, అత్తరు, కుర్తా, పైజమాలు కొనుగోలు చేస్తున్నారు. రమజాన్ షాపింగ్ సందడితో చార్మినార్ నైట్ బజార్ కోలాహలంగా మారింది.

క్షమాగుణం ముఖ్యం
మనసులో కల్మషాలు, పాత వైషమ్యాలను వదిలి రమజాన్ మాసంలో ముస్లింలందరూ ఒకరికొకరు క్షమాగుణంతో ఒక్కటవ్వడం ఈదుల్ ఫితర్ పండుగ ప్రత్యేకమని జమాతే ఇస్లామీ హింద్ హైదరాబాద్ నగర అధ్యక్షుడు డాక్టర్ ముబషీర్ అహ్మద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రమజాన్ రోజాలను అల్లాహ్ స్వీకరించాలంటే ప్రతీ ఒక్కరిలో క్షమాగుణం ముఖ్యమని అహ్మద్ పేర్కొన్నారు. జకాత్ దానాన్ని మొదట వారి వారి బంధువుల్లో ఉన్న నిరుపేదలకు ఇస్తున్నారు. అనంతరం ఇరుగుపొరుగున నివాసముంటున్నవారిలో పేదలను గుర్తించి జకాత్ దానాలు చేయడం రమజాన్ నెలలో ప్రధానమైందని డాక్టర్ అహ్మద్ వివరించారు.

ఇజ్రాయెల్ ఉత్పత్తుల బాయ్ కాట్
పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ముస్లింలు ఇజ్రాయెల్ దేశ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని ప్రచారం చేపట్టారు. ఈదుల్ ఫితర్ ఫండుగ సందర్భంగా ముస్లిములు చేసే షీర్ కుర్మాలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన నెస్లే కంపెనీ తయారు చేసే మిల్క్ మెయిడ్ వాడుతుంటారు. కానీ ఈ సారి ఇజ్రాయెల్ దేశ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పాలస్తీనాకు సంఘీభావంగా నెస్లే మిల్క్ మెయిడ్ బదులు మన దేశీయ పాల కంపెనీ అమూల్ తయారు చేసిన మిల్క్ మెయిడ్ ను వినియోగించుకోవాలని మత పెద్దలు వాట్సాప్ లో ప్రచారం చేపట్టామని పాత నగరానికి చెందిన ప్రముఖ ఇస్లామిక్ రచయిత ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Read More
Next Story