సహచర మంత్రిని దూషించిన పొన్నం ప్రభాకర్
x

సహచర మంత్రిని దూషించిన పొన్నం ప్రభాకర్

తీవ్ర పరిణామాలు ఆయనే బాధ్యతంటూ హెచ్చరించిన అడ్లూరి లక్ష్మణ్.


తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక ఘటన చోటుచేసుకుంది. మంత్రుల మధ్య విభేదాలు తలెత్తాయి. సహచర మంత్రిని ఒక మంత్రి పరుషపదజాలంతో దూషిస్తే, ఇంకో మంత్రి పక్కన కూర్చున్నా ఓర్చుకోలేకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దళిత నాయకుడయినా అడ్లూరి లక్ష్మణ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల కొన్ని నెలల క్రితం మంత్రిపదవిని కట్టబెట్టింది. తాజాగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి అడ్లూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. దాంతో ఆయన రాని సమయంలో లక్ష్మణ్‌ను ఉద్దేశించి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు అక్కడే ఉన్న మైక్‌లో రికార్డ్ అయ్యాయి. అవి కాస్తా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ జాతి వాడనని తనను అలా అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

పొన్నం క్షమాపణ చెప్పాలి..

ఈ మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘జరిగిన పొరపాటును ఒప్పుకుని క్షమాపణ చెప్తే పొన్నం ప్రభాకర్‌కు గౌరవంగా ఉంటుంది. మాదిగలు అంటే మీకు అంత చిన్న చూపా. అన్న మాటను సమర్థించుకుంటూ ఇప్పటి వరకు మౌనంగా ఉన్నావంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అని అన్నారు. అనంతరం మంత్రి వివేక్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సహచర మంత్రిని, ఎస్సీ సామాజిక వర్గం నేతను పట్టుకుని అటువంటి మాట అంటే చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నించారు.

పక్కన కూడా కూర్చోలేరా..?

‘‘నేను పక్కన కూర్చుంటే వివేక్ ఓర్చుకోవడం లేదు. పొన్నం ప్రభాకర్ తరహాలో అహంకారంగా మాట్లాటం నాకు రాదు. నా దగ్గర డబ్బులు లేవు. నేను కాంగ్రెస్ జెండాను నమ్ముకుని ఉన్నవాడిని. మంత్రిగా మూడు నెలల ప్రొగ్రెస్ చూసుకోండి. నేను మాదిగను కాబట్టే నాకు మంత్రి పదవి వచ్చింది. పొన్నం ప్రభాకర్ తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలి. నేను మంత్రి కావడం, మా సామాజిక వర్గంలో పుట్టడం తప్పా? నేను త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలుస్తా’’ అని చెప్పారు.

ఇలాంటివి పార్టీకి మంచిది కాదు: మహేష్ కుమార్

పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించారు. విషయం చేయిదాటి పోకముందే ఆయన రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరు నేతలు కూడా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అయితే ఈ విషయంలో పొన్నం వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కావని సూచించారు.

నా మాటలు వక్రీకరించారు: పొన్నం..

తన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగడంతో పొన్నం ప్రభాకర్ స్పందించారు. తన మాటలను వక్రీకరించారని అన్నారు. అడ్లూరిపై తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. కొందరు కావాలనే తన మాటలను వక్రీకరించి పార్టీలో కుమ్ములాటలు పెట్టేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

Read More
Next Story