
‘బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోంది’
మూడు ముక్కలాట పోరు తాళలేక కేసిఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యిండు.
తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తన ఉనికిని కాపాడుకోవడానికి తెగ తాపత్రయపడుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. అందుకోసమే తెలంగాణ.. దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నా కావాలని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఏమీ లేకపోతే గాలిలో విషయాలను సృష్టించి.. పెద్ద రాద్దాంతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారంటూ చురకలంటించారు. ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం అంటూ ఎద్దేవా చేశారు. దానికి తోడు బీఆర్ఎస్‌లో ప్రస్తుతం మూడు ముక్కలాట నడుస్తోందని పేర్కొన్నారు.
‘‘బిఆర్ఎస్ లో కవిత, కేటీఆర్, హరీష్ రావు పోరుతో మూడు ముక్కలాట నడుస్తోంది. మూడు ముక్కలాట పోరు తాళలేక కేసిఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యిండు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బిఆర్ఎస్ పార్టీ కనపడదు. మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోదీ వైఖరితో ఆయన సత్తా ఏంటో తేలిపోయింది. భారత్ - పాక్ వార్ లో అమెరికా జోక్యంపై దేశ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి. యుద్దం తో సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏమిటి? అన్న విషయంపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా పాలన అందిస్తున్నాం’’ అని చెప్పారు.
‘‘సిఎం రేవంత్,మంత్రులు సఖ్యతతో ప్రజాభిప్రాయానికి మేరకు పాలన. సిఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల సర్వే నిర్వహించి చరిత్ర సృష్టించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. కేంద్రం జనగణన తో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ,కాంగ్రెస్ పార్టీ విజయం. సిఎం రేవంత్ రెడ్డి,మంత్రుల పాలనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. పార్టీ సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించేలా సలహా మండలి కమిటీ. పార్టీకి - ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయడానికి కమిటీ దోహదపడుతుంది. రోజువారీ పొలిటికల్ యాక్టివిటీ కోసం పొలిటికల్ అఫైర్స్ కమిటీలను నియమిస్తాం’2 అని తెలిపారు.
‘‘రాజ్యాంగ పరిరక్షణ కోసం సంవిధాన్ బచావో కమిటీ ఏర్పాటు చేసి కొంత మంది సీనియర్లకు, శాసన సభ్యులకు చోటు కల్పిస్తాం. 2026లో డిలిమిటేషన్ దృష్ట్యా పార్టీకి సలహాలు ,సూచనల కోసం డిలిమిటేషన్ కమిటీని నియమిస్తాం. పార్టీలోని కొత్త , పాత నేతల మధ్య సమన్వయం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. అసత్య ప్రచారం పై మంత్రి కొండా సురేఖ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయబోతున్నారు. బీజేపీ, బిఆర్ఎస్ నేతలు దిగజారి కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ తరహాలో సోషల్ మిడియలో విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు క్షుణ్ణంగా అధ్యయనం చేసి చట్టం తెచ్చే యోచన చేస్తున్నాం’’ అని వెల్లడించారు.
‘‘తెలంగాణలో సీఎం మార్పు అనేది ప్రతిపక్షాల కల్పిత కుట్రే. ఉచిత బస్సు మొదలు సన్న బియ్యం పంపిణీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బృహత్తర కార్యకమాలను చేపట్టింది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కుంటుపడిన విద్య, వైద్య రంగాలను మెరుగుపరుస్తున్నాం. విద్య పరంగా రూ. 200 కోట్లతో అధునాతన , సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను ఏర్పాటు చేయబోతున్నాం. వైద్యం పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి బలోపేతం చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 65 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది’’ అని చెప్పారు.