బీఆర్ఎస్‌కు మహేష్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్
బీసీ బిడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే సత్తా బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు ఉందా?
బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసలు తమ పదేళ్ల కాలంలో బీసీల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పగలదా? అని ప్రశ్నించారు. అధికారం ఉన్నంత కాలం కూడా తమ జేబులు నింపుకోవడమే వారికి సరిపోయిందని, ఇప్పుడు పవర్ పోవడంతో బీసీలు గుర్తొచ్చరని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న ప్రజా పాలనను చూసి బీఆర్ఎస్‌కు భయం పట్టుకుందని, అందుకే ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. రవీంద్ర భారతిలో బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే 194 వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. వీటికి మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నాం. మహిళ కళాశాల ఏర్పాటు చేసిన వీర వనిత సావిత్రి బాయి పూలే. విద్య ఆత్మవిశ్వాసం ఇస్తుందన్న సావిత్రి బాయి మాటలు మహిళలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. సావిత్రి బాయి పూలే పేరిట యూనివర్శిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తా. అణగారిన వర్గాల విముక్తికి తన జీవితం అంకితం చేసిన గొప్ప మహనీయురాలు ఆమె. కట్టుబాట్లకు లోబడి మహిళలు బయటికి రాలేని రోజుల్లో మహిళా సాధికారత కోసం సావిత్రి బాయి పూలే పోరాడారు. ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే పేర్లను పెట్టేందుకు కృషి చేస్తాం’’ అని తెలిపారు. అనంతరం బీసీల గురించి బిఆర్ఎస్ నేతలు మాట్లాడటం అనైతికమన్నారు.
‘‘విద్య, వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తుంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క కార్పొరేషన్ కైనా నిధులు కేటాయించారా? బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సవాలు చేస్తున్నా.. బీసీ బిడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే సత్తా వారికి ఉందా? కుల సర్వే కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలంగాణలో కుల గణన సర్వేపై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతుంది. బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ లో పోరాడుతున్నాం. జ్యోతిరావు పూలే తరువాత మరొక పూలే రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కుల గణన సర్వే చేసి తీరాలి. మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన బిఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఫాం హౌస్‌లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంది. బీఆర్ఏస్, బీజేపీ పార్టీలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా?’’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కూడా బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు.
‘‘కేసీఆర్ ఫ్యామిలీ ఇష్టంవచ్చినట్టు అవినీతి, 6 గ్యారంటీలు అని విమర్శలు చేస్తోంది. కేసీఆర్ కుటుంబం సిగ్గు శరం లేకుండా మాట్లాడుతోంది. ప్రభుత్వానికి ప్రజలు ఐదు ఏళ్ల సమయం ఇచ్చారు. కేటీఆర్‌కి ఓపెన్ ఛాలెంజ్. ఉద్యమంలో ఆస్తులు అమ్ముకుంటే 2009 నుంచి 2014లో మీ ఆస్తులు ఎలా పెరిగాయి. హరీష్ రావు, కవిత ఆస్తులు అదే విధంగా పెరుగుతున్నాయి. కేసీఆర్ వద్ద అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏం ఉందో చెప్పాలి. మేము ప్రతి ఎలెక్షన్‌కి ఆస్తులు అమ్ముకుంటున్నం. కానీ మీ ఆస్తులు పెరుగుతున్నాయి. ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. కేటీఆర్.. ఐఏఎస్‌లను బకరా చేసిండు.. నాకేం సంబంధం అధికారులు చూసుకోవాలి అని కోర్టులో అంటుండు. లిక్కర్ రాణిమ్మ కవిత మీరు ఇచ్చిన లిక్కర్ సప్లై పర్మిషన్ లతోనే క్రైమ్ రేట్ పెరుగుతుంది’’ అని షబ్బీర్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.