Mahesh Kumar Goud
x

బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి: మహేష్

రవీంద్ర భారతిలో ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదంపై స్పందించిన టీపీసీసీ చీఫ్.


రవీంద్ర భారతిలో గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎస్‌పీబీ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, ఆయన దేశానికే సంపద అని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం విగ్ర ప్రతిష్టాపన తీవ్ర వివాదానికి దారితీసింది. రవీంద్ర భారతిలో ఎస్‌పీబీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ కొందరు తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎస్‌పీబీ విగ్రహం వివాదంగా మారింది. దీనిపై ఈ వివాదంపై స్పందిస్తూనే మహేష్ కుమార్ గౌడ్.. ఎస్‌పీబీ విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు. ‘‘కొణిజేటి రోశయ్య, ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి, ఒక భాషకు చెందిన వారు కాదు. వారు మన దేశ సంపద. వారి విగ్రహాలను పెట్టడం వారికి మనం అందించే గౌరవం’’ అని పేర్కొన్నారు.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి జూపల్లి

డిసెంబర్ 15న రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ కోసం భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏర్పట్లను సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్ల కృష్ణారావు.. నటుడు శుభలేఖ సుధాకర్, కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ అంశాన్ని మంత్రి తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా కూడా ప్రకటించారు. ‘‘రవీంద్రభారతిలో గాన గంధర్వులు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ప్రతిష్ఠించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ సీనియ‌ర్ న‌టుడు శుభ‌లేఖ సుధాక‌ర్, క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి విగ్రహ ఏర్పాట్లను ప‌రిశీలించాను. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశాను’’ అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్‌ను నటుడు సుధాకర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగానే ఎస్‌పీబీ విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అసలు వివాదం ఏంటి?

అయితే రవీంద్రభారతి‌లో ఎస్‌పీబీ విగ్రహ ఏర్పాటును కొందరు తెలంగాణ వాదులు ఆక్షేపించారు. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్.. రవీంద్ర భారతి దగ్గరకు వచ్చి విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నటుడు శుభలేఖ సుధాకర్, పృథ్విరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ గడ్డపై గద్దర్, అందెశ్రీ లాంటి వారికి ముందు గౌరవం దక్కాలని, బయట వ్యక్తులకు కాదని పృథ్వీ అన్నారు. జైయ జైయ హే తెలంగాణ పాటను పాడటానిక నిరాకరించిన వ్యక్తి ఎస్‌పీబీ అని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని పెట్టడాన్ని తాము అంగీకరించబోమని అన్నారు. ఈ వివాదం తీవ్రం అవుతున్న క్రమంలో దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

Read More
Next Story