కొండా సురేఖ సీటు పదిలం.. అది సమస్యే కాదన్న మహేష్ కుమార్
x

కొండా సురేఖ సీటు పదిలం.. అది సమస్యే కాదన్న మహేష్ కుమార్

నాగార్జున, కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పందించారు. తొలిసారి స్పందించినప్పుడు కొండా సురేఖను వెనకేసుకొచ్చిన ఆయన ఇప్పుడు కూడా అదే పని చేశారు.


నాగార్జున, కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పందించారు. తొలిసారి స్పందించినప్పుడు కొండా సురేఖను వెనకేసుకొచ్చిన ఆయన ఇప్పుడు కూడా అదే పని చేశారు. సమంత, హీరోగా నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ వెనక్కు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అసలు ఇది ఇంత పెద్ద సమస్య అయ్యేదే కాదని, ఆ రోజే క్లోజ్ అయ్యేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించనున్నారా? కొండ సురేఖకు మంత్రిపదవి పోయినట్లేనా? అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని ఆ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీ కొండా సురేఖతో ఉందని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాను ఏమీ మాట్లాడదల్చుకోలేదని, కోర్టు తీర్పును శిరాసవహిస్తామని ఆయన వివరించారు. కాగా ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారుతున్నాయి.

కావాలనే సమస్య చేశారా?

ఆయన మాటలను బట్టి చూస్తుంటే కొందరు కావాలనే కొండా సురేఖ వ్యాఖ్యలను పెద్ద భూతద్దంలో చూపుతూ ఇంత దూరం తీసుకొచ్చారన్న భావన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నాగార్జున వెనక నిల్చుని బీఆర్ఎసే ఈ పని చేయిస్తుందా అన్న అనుమానాలను కూడా మహేష్ కుమార్ వ్యాఖ్యలు ఉత్పన్నం చేస్తున్నాయి. అందుకనే 24 గంటల తర్వాత నాగార్జున కోర్టును ఆశ్రయించడం జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతోనే సమస్య సమసిపోయిందని మహేష్ కుమార్ అంటున్నారు. దీనంతటికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని కూడా మహేష్ కుమార్ ఆరోపిస్తునస్నారు. ‘‘నాగార్జున కుటుంబంపై కొండా సురేఖా కావాలని, అనుకుని అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేటీఆర్ వైఖరి వల్లే ఆమె అలా మాట్లాడేశారు’’ అని మహేష్ కుమార్ అన్నారు.

అలా అనుండకూడదు..

‘‘అయినా కొండా సురేఖ.. నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి అలా మాట్లాడుండాల్సింది కాదు. ఇదే విషయంలో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మరి చూద్ధాం కోర్టు ఏమని తీర్పు ఇస్తుందో’’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు అనేక చర్చలకు దారి తీస్తుండగా.. ఈ వ్యాఖ్యలతో కొండా సురేఖ మంత్రి పదవికి గండం తప్పిందన్న అంశమైతే స్పష్టం అయింది. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం కూడా తమను ఎటువంటి వివరణ కోరలేదన్న మహేష్ కుమార్ వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. గతంలో కూడా ఇదే విధంగా కొండా సురేఖను వెనకేసుకొచ్చారు మహేష్ కుమార్ గౌడ్.

గతంలో ఏమన్నారంటే..

‘‘సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. దీంతో ఈ వివాదాన్ని ఇక ముగించండి. సినిమా పెద్దలందరికి నా విన్నపం.. సినీ ప్రముఖుల మనసు నొచ్చుకున్నది. మంత్రి తన వ్యాఖ్యలని వెనుకకు తీసుకున్నారు. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండి. ఇరు వైపులా మహిళలు ఉన్నారు.. కావునా ఈ విషయాన్ని ఇంతటితో వదలండి. మహిళల మనోభావాలను కించపరచాలనేది ఆమె ఉద్దేశం కాదు. కొండా సురేఖ తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో సమంత హిరోయిన్‌గా ఎదిగిన తీరు అంటే తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు తనకు ఆదర్శం అని కూడా వివరించారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్న మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి’’ అని మహేష్ కుమార్ గౌడ్ తన వీడియోలో వివరించారు.

గతంలోనే క్లారిటీ ఇచ్చిన పొన్నం ప్రభాకర్

కాగా కొండా సురేఖ మంత్రి పదవికి ఏమీ కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలోనే హింట్ ఇచ్చేశారు. ఇదే అంశంపై స్పందించిన ఆయన.. కొండా సురేఖను ఉద్దేశించి సినిమా వాళ్లు పెడుతున్న పోస్ట్‌లను తప్పుబట్టారు. ఇకనైనా సినిమా వాళ్లు పోస్ట్‌లు పెట్టడం మానుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే కొండా సురేఖ ఒంటరి కాదంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో ఆమెకు పార్టీ అండగా ఉంటుందన్న అంశం స్పష్టమైంది. కాగా దీనినే ఈరోజు మహేష్ కుమార్ మరింత స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే.. ‘‘కొండా సురేఖ తన వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాల్సింది. ఏది ఏమైనా ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ సమస్య ముగిసినట్టే. అయినా ఇంకా సినిమా వాళ్లు ఈ అంశంపై స్పందించడం సరికాదు. బలహీనవర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదు’’ అని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Read More
Next Story