చిలుకూరికి 10 కి.మీ. ట్రాఫిక్ జామ్ అయ్యేంత జనం ఇవాళే ఎందుకెళ్ళారు?
వీకెండ్ వచ్చిందంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద రద్దీ పెరిగిపోతుంది. అయితే ఈరోజు మరో ప్రత్యేక కార్యక్రమం ఉందని తెలియడంతో భక్తులు విపరీతంగా బారులు తీరారు.
వీకెండ్ వచ్చిందంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ వద్ద రద్దీ పెరిగిపోతుంది. అలాంటిది చిలుకూరు బాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలైతే ఆ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంటుందో ఈజీగా చెప్పొచ్చు. శుక్రవారం నుండి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు మొదలవడంతో ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మరో ప్రత్యేక కార్యక్రమం ఉందని తెలియడంతో భక్తులు విపరీతంగా బారులు తీరారు.
చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తడంతో హైదరాబాద్ శివార్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మాసబ్ ట్యాంక్ నుంచి మెహిదీపట్నం, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు వెళ్లే వాహనాలన్నీ ట్రాఫిక్ లో నిలిచిపోయాయి. గచ్చిబౌలి లోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు పైన కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ముందే ప్రయాణికులకు ట్రాఫిక్ అడ్వైజరీలు జారీ చేసినప్పటికీ ఊహించని రీతిలో చిలుకూరు వెళ్లేవారి సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ కంట్రోల్ కష్టమైంది.
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు?
శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కీలక ప్రకటన చేశారు. సంతానం లేని స్త్రీలకు శుక్రవారం గరుడ ప్రసాదం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుండే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి జనం బారులుగా తరలివచ్చారు. ఆలయానికి వచ్చేవారి వాహనాల రద్దీ పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
DON’T MISS IT🚨April 19th Friday Chilkur Garuda prasadam for childless women. Thousands have been blessed by this prasadam. Women desirous of the prasadam should reach Chilkur by 8am. The Garuda prasadam is given FREE of cost. @csranga pic.twitter.com/5fgTTWYy8t
— String (@StringReveals) April 13, 2024
ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్...
చిలుకూరు ఆలయానికి వెళ్లేవారి రద్దీ పెరగడంతో సైబరాబాద్ పోలీసులు ఉదయమే ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. చిలుకూరు బాలాజీ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా చిలుకూరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పెరిగింది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ వైపు నుండి అజీజ్ నగర్ మీదుగా చిలుకూరు వెళ్లడం కష్టం అవుతుంది. మెహిదీపట్నం నుండి నార్సింగి, గండిపేట, శంకరపల్లి వైపుగా చిలుకూరు వెళ్లే ఆల్టర్నేటివ్ రూట్ మ్యాప్ ని సూచించారు. అయినప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
Traffic Update
— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) April 19, 2024
An alternative route to reach Chevella from Mehdipatnam. pic.twitter.com/Qm3kWUmhx7
మొయినాబాద్ ట్రాఫిక్ సిఐ పవన్ కుమార్ ఏం చెప్పారంటే..
ఈరోజు తెల్లవారుజాము నుండి భక్తుల అత్యధిక సంఖ్యలో ఆలయానికి వచ్చారు. 10.30 గంటలకే దాదాపు 60 వేల మంది వరకూ దర్శనానికి వచ్చారు. గరుడ ప్రసాదం కూడా ఉదయం కొద్దిసేపు ఇచ్చి ఆపేసారు. ఆలయ నిర్వాహకులు 5000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశాము. కానీ అనుకోని విధంగా ఎక్కువమంది భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని చెప్పారు.