
మునిగిపోయిన ఎంజీబీఎస్..ప్రయాణీకుల అవస్తలు
శుక్రవారంఅర్ధరాత్రికి వర్షపునీరు+వరదనీరు బస్టాండులోకి ఒక్కసారిగా ప్రవేశించాయి
మహాత్మాగాంధి బస్టాండ్ ముణిగిపోయింది. ఛాదర్ ఘాట్ లో ఉన్న ఎంజీబీఎస్ చరిత్రలో మొదటిసారి మునిగిపోయింది. గడచిన రెండురోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా జంటజలాశయాలు ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్ నుండి నీటిని అధికారులు దిగువప్రాంతాలకు వదిలిపెట్టారు. అప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలనుండి దిగువకు వదిలేసిన నీరు మూసీనదిలో కలుస్తోంది. దానికి అదనంగా భారీవర్షాలు కలవటంతో నీరు ఒక్కసారిగా బస్టాండును ముంచెత్తింది. శుక్రవారంఅర్ధరాత్రికి వర్షపునీరు+వరదనీరు బస్టాండులోకి ఒక్కసారిగాప్రవేశించాయి. ఫలితంగా బస్టాండ్ మొత్తం ఒక్కసారిగా జలదిగ్భందంలోకి వెళిపోయింది. జలాశయాల్లోని నీరంతా మూసీనదిలోకి చేరుతోంది. బస్టాండ్ మూసీ ఒడ్డునే ఉండటంతో నీరంతా లోపలకు వచ్చేసింది.
బస్టాండు మొత్తం వరద, వర్షపునీటితో ముణిగిపోయింది. బస్టాండ్ చరిత్రలో నీటముణిగిపోవటం ఇదే మొదటసారి. బస్టాండ్ చుట్టుపక్కలున్న మూసారంబాగ్, ఛాదర్ ఘాట్ ప్రాంతాలు కూడా వర్షపునీటితో ముణిగిపోయాయి. ఒక్కసారిగా బస్టాండులోకి నీరువచ్చేయటంతో వందలాదిప్రయాణీకులు భయంతో వణికిపోయారు. పండగ సందర్భంగా తమఊర్లకు వెళ్ళటానికి వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు పరిస్ధితి అన్యాయంగా తయారైంది. బస్టాండులో ఉండేందుకు లేదు అలాగని బస్టాండు బయటకు వచ్చేందుకు లేదు. పరిస్ధితిని గమనించిన ఆర్టీసీ అధికారులు వెంటనే కొందరు ప్రయాణీకులను ఆగివున్న బస్సుల్లోకి ఎక్కించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరక్కపోవటంతో హైడ్రాతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, పోలీసులు బస్టాండుకు చేరుకున్నారు.
నీటిలోనే బస్టాండులో ఎక్కడికక్కడ తాళ్ళని కట్టి ప్రయాణీకులను బస్టాండు నుండి బయటకు తీసుకొస్తున్నారు. బయట రెడీచేసిన రక్షిత వాహనాల్లో ఎక్కించి అతికష్టంమీద దూరంగా విడిచిపెడుతున్నారు. బస్టాండ్ మొత్తం జలమయమైపోయిన విషయం తెలియటంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఉన్నతాధికారులతో పరిస్ధితిని సమీక్షిస్తున్నారు. బాధితులకు అవసరమైనసహకారం అందించేందుకు మున్సిపల్, ఫైర్, ఇరిగేషన్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, అధికారులను అప్రమత్తంచేశారు. శనివారం ఉదయం 8గంటలకు కూడా పరిస్ధితిలో మార్పేమీరాలేదు. కాకపోతే వర్షంతీవ్రత తగ్గుముఖంపట్టడంతో కొంతసేపటిలో పరిస్ధితి నార్మల్ గా అవుతుందని అనుకుంటున్నారు.
బస్టాండును నీరు ముంచెత్తటంతో బయటప్రాంతాల నుండి రావాల్సిన బస్సులను చుట్టుపక్కల ప్రాంతాల్లోని బస్టాండులకు తరలిస్తున్నారు. 1978లో బస్టాండులోకి ఇలా నీరుచేరిందని అధికారులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పటినుండి నగరంలో ఎంతటి భారీవర్షాలు కురిసినా బస్టాండ్ అయితే ఎప్పుడు ముణగలేదు. అలాంటిది ఇపుడు మూసీలోకి 33 వేల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండటంతో ఒక్కసారిగా వరదనీరు, వర్షపునీరు కలిసి బస్టాండును ముంచెత్తాయి.