హైదరాబాద్ లో ‘ట్రంప్ ఎవెన్యూ’ అవసరమా?
x
Donald J Trump

హైదరాబాద్ లో ‘ట్రంప్ ఎవెన్యూ’ అవసరమా?

ట్రంప్ విధానాల వల్ల లక్షలాది భారతీయ విద్యార్థులు నరకయాతన పడినవిషయాన్ని అపుడే మర్చిపోయారా?


హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్, టాటా జంక్షన్, విప్రో సెంటర్...ఇవన్నీ ఎక్కడున్నాయి ? ఎప్పుడు వచ్చాయి అనే అయోమయంలో ఉన్నారా ? ఇపుడు లేవు కాని తొందరలోనే రాబోతున్నాయి.

హైదరాబాద్ లోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో ఏర్పాయిన అమెరికా కాన్సులేట్ కార్యాయలం ఉన్న ప్రాంతానికి మొత్తంగా అమెరికా అద్యక్షుడు ‘డొనాల్డ్ జే ట్రంప్ ఎవెన్యు’ అని పేరుపెట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారత విదేశాంగ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి తెలియచేసింది కూడా.

అయితే, రోడ్లకు ట్రంప్ పేరు పెట్టడంతో పాటు వివిధ కార్పరేట్ కంపెనీల పేర్లు పెట్టడం రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. సాధారణంగా విద్యారంగంలో ఇలాంటి నామకరణాలు కనిపిస్తుంటాయి. కళాశాలలకు పూర్వీకుల జ్ఞాపకార్థం చాలా మంది భూములు నిధులు విరాళాలు ఇస్తుంటారు. అపుడు కళాశాలకు వారి పేరు పెట్టడం, లేదా కళాశాలలో ఏదైనా భవనానికి వారిపేరు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాని ఇలా రోడ్లుకు కార్పొరేట్ కంపెనీల పేర్లు పెట్టడం వింత. ఎందుకంటే, కంపెనీలు ముందు ముందు వివాదాలలో చిక్కుకుంటుూ ఉంటాయి. ఈ పేరు పట్టణ ప్రజలకు ఇబ్బంది కలిగించవచ్చు. అపుడు పేరు మార్చాలని, ఆపేరు తొలగించాలనే డిమాండ్ రావచ్చు. ఇలాంటి ఇబ్బందికరమయిన పరిణామాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గమనించే స్థితిలో లేదు.

వ్యాపార, వాణిజ్య సంబంధాలలో భారత అమెరికాల మధ్య ఎలాంటి సమస్యలు లేవని , అమెరికా ఇన్వెస్టర్లు స్వేఛ్చగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టవచ్చనే సందేశమీయడమే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో ట్రంప్ ఎవెన్యూ ఏర్పాటు వెనక ఉద్దేశమని ఒక సీనియర అధికారి వ్యాఖ్యానించారు. " ఇపుడున్న పరిస్థితుల్లో ట్రంప్ సంతోషపడితే అమెరికా మొత్తం సంతోష పడినట్లే. ముఖ్యంగా తెలంగాణకు వస్తున్నఇన్వెస్టర్లకు భరోసా కలుగుతుంది.హైదరాబాద్ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడికి, అమెరికా ప్రముఖ ఇన్వెస్టర్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మార్చి 2000లో బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చారు. 2024 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ అధినేత హైదరాాబాద్ వచ్చారు.2017 నవంబర్ లో డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్ వచ్చారు. ఈ పర్యటనలన్నీ కూడా ఇన్వెస్టర్ సమ్మేళనాలే. ఇపుడు ట్రంప్ ను ఆహ్వనించలేదు. కాకపోతే, అమెరికా నుంచి సుమారు 50 మంది ఉన్న ప్రతినిధుల బృందం రైజింగ్ తెలంగాణ సమ్మిట్ కు వస్తుంది. విదేశీ ప్రతినిధులకు సంబంధించి ఇదే పెద్ద బృందం. అమెరికన్ కాన్సలేట్ ఉనన కారిడార్ కి ట్రంప్ పేరు పెట్టినందున వీరందరిలో తెలంగాణ మీద గౌరవం పెరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు కూడా సంతోషిస్తాడు. దీనివల్ల అమెరికా ఇన్వెస్టర్లు, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది," అని పేరు ఉటంకిండానికి ఇష్టపడని ఆ సీనియర్ అధికారి వివరించారు.


హైదరాబాద్ లోని ప్రధాన రోడ్లకు దేశ, అంతర్జాతీయ స్ధాయిలోని ప్రముఖుల, సంస్ధల పేర్లు పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఢిల్లీ లో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ( US-India Strategic Partnership Forum: USISPF) సమావేశంలో ప్రకటించారు.

ఇందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్, రతన్ టాటా, విప్రో, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటిపేర్లను ప్రభుత్వంపరిశీలిస్తోంది. సోమ, మంగళవారాల్లో హైదరాబాద్ లో జరగబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నేపధ్యంలో ప్రభుత్వ పేర్ల ప్రతిపాదన మరోసారి చర్చనీయాంశమైంది. పేర్ల పెట్టడానికి సంబంధించిన ప్రతిపాదనల సమాచారాన్ని రేవంత్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపింది.

హైదరాబాద్ కు ‘గ్లోబల్ మ్యాప్’ లో మరింత చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఆలోచన. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర రావిర్యాల నుండి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు డిసైడ్ అయ్యింది. రావిర్యాల ఇంటర్ చేంజ్ కు ఇప్పటికే టాటా ఇంటర్ చేంజ్ అని పేరు పెట్టేశారు. ఇందులో భాగంగానే ట్రంప్ ఎవెన్యు పేరు కూడా దాదాపు ఫైనల్ అయినట్లే. ఢిల్లీలో ఈమధ్యనే జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులో రేవంత్ మాట్లాడుతు హైదరాబాద్ లోని ముఖ్య జంక్షన్లకు ప్రముఖ వ్యక్తులు, సంస్ధల పేర్లను పెట్టబోతున్నట్లు రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే.

"కొన్ని కీలకమయిన రోడ్లకు ప్రముఖ పేర్లు పెట్టడం తప్పులేదు. అది స్నేహపూర్వక ధోరణి," కాంగ్రెస్ నేత సుధాకర్ గౌడ్ ప్రభుత్వం చర్యను సమర్థించారు. అయితే, తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ భారతీయ విద్యార్థుల పట్ల, భారతీయ దిగుమతుల తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. ట్రంప్ విధానాలు పూర్తిగా భారత వ్యతిరేక నిర్ణయాలు. ట్రంప్ శతృవైఖరి వల్ల లక్షలాది అమెరికా లో ఉంటున్న భారతీయ విద్యార్థులు, ఐటి ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. వేలాది మందికాళ్లు కు బేడీలు వేసి వెనక్కి పంపించారు. మానవత్వంలేకుండా ట్రంప్ ప్రభుత్వం ప్రవర్తించింది. భారతీయులంతా ట్రంప్ ను ఒక శతృవుగా చూస్తున్నారు. ఇలాంటపుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ట్రంప్ ఎవెన్యూని ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి, కాంగ్రెస్ పార్టీ దీనిని గమనించాలి,"అని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇలాగే కార్పొరేట్ కంపెనీల పేర్ల మీద రోడ్లను నామకరణం చేయడం కూడా సరైంది కాదని ప్రవీణ్ కుమార్ అన్నారు. " ఒక రోడ్డుకు ఒక కంపెనీ పేరో, దాని యజమాని పేరో పెడతారు. కొంత కాలం తర్వాత కంపెనీ ఏదో స్కాంలో ఇరుక్కోవచ్కు. కంపెనీ అధినేత దేశం విడిచిపారిపోవచ్చు. అపుడేం చేస్తారు. దేశానికో లేదా రాష్ట్రానికో ఎనలేని సేవచేసి కీర్తిశేషులయిన రతన టాటా వంటి వారి పేరు గుర్తుంచుకోవడం వేరు. ఇన్వెస్ట్ మెంట్స్ పెడతారన్న ఆశతో అన్ని కంపెనీలకు ప్రత్యేక హోదా ఇవ్వడం వేరు. ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి," అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే, సంస్థల పేర్ల మీద రోడ్లకు నామకరణం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. అంతకంటే మందు చేయాల్సిన పని ఒకటి ఉందని అది హైదరాబాద్ పేరును మార్చడం అని కేంద్ర హ ోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ చెప్పారు.




హైదరాబాద్ చరిత్ర ను అర్థవంతం చేస్తూ ఈ మహానగరం పేరును భాగ్యనగరం గా మ ార్చాలని బండి సంజయ్ ఎక్స్ లో పేర్కొన్నారు.

గ్లోబల్ దిగ్గజం గూగుల్ సేవలకు గుర్తుగా ముఖ్యమయిన రోడ్డుకు గూగుల్ స్ట్రీట్ అని పేరు పెట్టబోతోంది. అలాగే మైక్రోసాఫ్ట్ పేరుతో జంక్షన్ రాబోతున్నది. ఇప్పటికే గచ్చిబౌలిలో విప్రో జంక్షన్ ఏర్పాటయింది. రోడ్లకు ప్రముఖుల, సంస్ధలపేర్లను పెడితే హౌదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపువస్తుందని రేవంత్ ఆలోచిస్తున్నారు.

Read More
Next Story