టీఎస్పీఎస్పీ చేతిలో దగాపడ్డ పీఈటీ అభాగ్యుల కథ ఇది
x
టీఎస్పీఎస్సీ కార్యాలయం

టీఎస్పీఎస్పీ చేతిలో దగాపడ్డ పీఈటీ అభాగ్యుల కథ ఇది

పీఈటీ అభ్యర్థులు ఆరు సంవత్సరాల క్రితం పరీక్ష రాశారు. అయినప్పటికీ టీఎస్పీఎస్సీ నిర్వాకం వల్ల వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. వాళ్ల గోస ఏంటీ? ఏం జరిగింది..


పోరాటాల గడ్డలో పుట్టినందుకు గర్వపడాలా.. ప్రతి విషయానికి ఎలుగెత్తి అలసిపోతున్న పట్టించుకోనందుకు తలదించుకోవాలా.. తెలంగాణకు పోరాటాల గడ్డ అని పేరుంది. అందుకని అడుగడుగుక్కి పోరాడ్డమే పనా.. ఎన్నని చెప్పాలి.. ఏమని చెప్పాలి.. ఎంతదాకా పోరాడాలి.. ఎన్ని సంవత్సరాలు పోరాడాలి. స్వరాష్ట్రం వచ్చిందన్నా సంబరమే లేకుండా చేద్దామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైన కంకణం కట్టుకుందా? లేదా అసలు పరీక్షలు నిర్వహించడం మానీ నిరుద్యోగులకు ‘ఓపిక’ ఉందా, లేదా అని మరో పరీక్ష పెడుతుందా? ఏంటీదీ? ఓ నిరుద్యోగి ఆవేదన..

టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉదాసీనత లేదా నిర్లక్ష్యం అంతాఇంతాకాదు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 616 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు(పీఈటీ) భర్తీకి 2017లో టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఇందులో 1232 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే తరువాత పోస్టులు న్యాయవివాదంలో చిక్కుకున్నాయి.

దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం గత ఏడాది హైకోర్టు నియామక ప్రక్రియ పూర్తి చేయమని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకూ టీఎస్పీఎస్సీ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారిన తరువాత టీఎస్పీఎస్సీ సభ్యులు మొత్తం రాజీనామా చేశారు. దాంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అసలు మాకు ఉద్యోగాలు ఇస్తారా? లేరా అనే ఆందోళన అభ్యర్థుల్లో ఉంది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ కు నోటిఫికేషన్ లో ఇచ్చిన వయో పరిమితి దాటిపోయారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, తరువాత పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి.

దీంతో అభ్యర్థులు ఇంకా టెన్షన్ పడుతున్నారు. ఈ ఉద్యోగాల్లో మహిళలకు ప్రభుత్వం 450 ఉద్యోగాలను కేటాయించింది. గురుకుల పాఠశాలల్లో ఎక్కువగా బాలికలే ఉన్నందున 80 శాతం పీఈటీ పోస్టులు మహిళలకే కేటాయించారు. అయితే ఇదీ కూడా తరువాత న్యాయ వివాదాలకు కేంద్రంగా మారింది.

అసలు వీళ్లకు నిబంధనలు తెలియవా?

నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యూకేషన్ నిబంధనలు పాటించకపోవడం వల్ల పీఈటీ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. నిబంధనల ప్రకారం 8వ తరగతి విద్యార్థులకు బోధించడానికి పీఈటీలు తప్పనిసరిగా ఫిజికల్ ఎడ్యూకేషన్లో డిప్లోమాతో పాటు ఇంటర్మీడియోట్ పాస్ అయి ఉండాలి.

అలాగే తొమ్మిది, పదో తరగతి వరకూ బోధించాలంటే ఫిజికల్ ఎడ్యూకేషన్ తో పాటు గ్రాడ్యూయేట్లు అయి ఉండాలి. దాంతో పాటు తప్పనిసరిగా జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా ఈవెంట్ లో పాల్గొని ఉండాలి. అయితే టీఎస్ఫీఎస్సీ ఈ వివరాలు పట్టించుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో భర్తీల ప్రక్రియ కాస్త న్యాయవివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

ఈ వివాదం కాస్త హైకోర్టుకు చేరింది. ఉన్నత న్యాయస్థానం అభ్యర్థులను రెండు కేటగిరీలుగా విభజించాలని అక్టోబర్ 26, 2022న తీర్పు చెప్పింది. మెరిట్ ఆధారంగా ఫలితాలను ప్రకటించి పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ దీనిని పట్టించుకోలేదు. తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ రావడం, టీఎస్సీపీఎస్సీ నిర్వాకాల ఫలితంగా బోర్డు మొత్తం రాజీనామా చేయడంతో వీళ్ల పరిస్థితి మొదటికొచ్చింది.

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తరువాత రాబోయే సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే సరికి మరో ఆరు నెలలు పట్టేలా ఉంది. ఈలోపే పీఈటీ అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్లు ఇప్పించాలని కోరుతున్నారు.

టీఎస్పీఎస్సీ అంత అసమర్థ బోర్డును నేను ఎప్పుడూ చూడలేదని త్రివేణీ ఇన్ స్టూట్ డైరెక్టర్ అన్నం కళింగరెడ్డి అన్నారు. ‘ఒక పరీక్ష నిర్వహించి ఫలితాలు ఇవ్వడానికి ఏడు సంవత్సరాల సమయం తీసుకుంటారా? నోటిఫికేషన్ లో ఇచ్చిన ఏజ్ రిలాక్స్ కూడా దాటిపోతోంది. ఇంకా వారికి ఎప్పుడు అపాయిట్ మెంట్ లెటర్లు ఇస్తారు’ అని ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ రాజకీయ నిరుద్యోగులకు పునరావాసంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టీఎస్పీఎస్సీని సంస్కరించాలని డిమాండ్ చేశారు. ‘నోటిఫికేషన్ ఇచ్చిన రెండు నెలల్లో పరీక్షలు నిర్వహించాలి, పరీక్షలు అయ్యాక 15 రోజుల్లో ఫలితాలు ఇవ్వాలి. ఫలితాలు వచ్చాక 15 రోజుల్లో అపాయింట్ మెంట్ లెటర్లు ఇవ్వాలి’ అని కళింగ రెడ్డి కోరుతున్నారు.

Read More
Next Story