ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సజ్జనార్ క్లారిటీ..
తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయన్న వార్తలపై సజ్జనార్ స్పందించారు. ఫలానా జీవో ప్రకారమే టికెట్ల పెరుగుదల జరుగుతుందని చెప్పారు.
‘‘దసరా ధమాకా ఆఫర్‌గా టీఎస్ఆర్టీసీ ఛర్జీలు పెంచింది. ప్రతి టికెట్‌పై 50 నుంచి 70 శాతం ఛార్జీలు వసూలు చేస్తోంది. ఆర్టీసీ ప్రయాణికులు అలెర్ట్ కావాలి’’ కొన్ని రోజులుగా ఈ ప్రచారం తెలంగాణ అంతటా జోరుగా సాగుతోంది. ఈ వార్తలు విన్న బస్సు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కసారిగా అంతంత ఛార్జీలు ఎలా పెంచుతారని సదరు అధికారులను ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. కాగా తాజాగా ఈ అంశంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టతనిచ్చారు. బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో బస్సు ఛార్జీలు విపరీతంగా పెరిగాయంటూ జరుగుతున్నది కేవలం ప్రచారమేనని, అటువంటిదేమీ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా బస్సు ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని, ఎప్పుడూ ఉన్న ఛార్జీలతోనే ఆర్టీసీ నడుస్తుందని చెప్పారు. ఈ టికెట్ ధరలపై ఆయన మరికొన్ని కీలక అంశాలను కూడా వెల్లడించారు. ప్రజలు ఎవరూ కూడా భయపడొద్దని వివరించారు. తమ సంస్థకు ధరల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయని, ఎంత అనుకుంటే అంత మేర ధరలను పెంచడం సాధ్యం కాదని కూడా వ్యాఖ్యానించారాయన.
ధరల్లో అంతవరకే వెసులుబాటు
‘‘ప్రధాన సండగలైన సంక్రాంతి, దసర, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, దీపావళి, ఉగాధి సహా పలు ఇతర సందర్బాల్లో కూడా ప్రజలు అధిక మొత్తంలో సొంతూళ్లకు వెళ్తుంటారు. వారి కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రద్దీ అధికంగా ఉంటే జిల్లా బస్సులను కూడా ఈ స్పెషల్ కేటగిరీల్లోకి చేర్జి జిల్లాల వైపు మరల్చడం జరుగుతంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్సులు చాలా సందర్భాల్లో రద్దీ లేక ఖాళీగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ స్పెషల్ బస్సులకు అయ్యే డీజిల్ ఖర్చుల వేరకు టికెట్ ధరను సవరించుకోవడం కోసం 2003లో జీవో నెంబర్ 16న రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ప్రకారం బస్సు టికెట్ ధరలను రూ.1.50 వరకు మాత్రమే సవరించుకునే వెసులుబాటు ఉంది. అది కూడా ప్రత్యేక బస్సులకే పరిమితం’’ అని ఆయన వివరించారు.
మహాలక్ష్మీ పథకంతో పెరిగిన రద్దీ
రేటు పెరుగుదలపై క్లారిటీ ఇచ్చిన సజ్జనార్ అనంతరం ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం అమలు తర్వాత ఆర్టీసీలో రద్దీ పెరిగిందని తెలిపారు. ‘‘మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం మేర రద్దీ పెరిగింది. గతంతో పోల్చితే సంక్రాంతి, రాఖీ పౌర్ణమి, తదితర పండుగలకు బస్సుల్లో ప్రయాణాలు పెరిగాయి. ఆయా సమయాల్లో ఒకవైపే రద్దీ ఎక్కువగా ఉంటోంది. తిరుగు ప్రయాణంలో బస్సులన్నీ ఖాళీగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పండుగుల్లో నడిచే స్పెషల్ బస్సులకు చార్జీలను జీవో ప్రకారం సవరించడం జరుగుతోంది’’ అని వివరించారు.
‘‘టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 9 వేలకు పైగా బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతుంది. ఆ 500 స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. మిగతా 8500 రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. పండుగ సమయాల్లో రెగ్యులర్ , స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో తేడాలుండటం సాధారణం. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు వెళ్లేటప్పుడు రెగ్యులర్ సర్వీసుల్లో ప్రయాణిస్తే సాధారణ టికెట్ ధరనే ఉంటుంది. తిరుగుప్రయాణంలో స్పెషల్ బస్సును వినియోగించుకుంటే జీవో ప్రకారం సవరణ చార్జీలుంటాయి’’ అని అన్నారు.
‘‘ప్రయాణికులకు సమాచార నిమిత్తం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ ప్లే బోర్డులను సంస్థ ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఆర్టీసీ సిబ్బంది కూడా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలను టికెట్ జారీ సమయంలో ప్రయాణికుడికి తెలియజేయడం జరుగుతుంది. పండగ సమయాల్లో మాత్రమే జీవో ప్రకారం స్పెషల్ సర్వీసుల్లో టికెట్ ధరలను సవరించడం జరుగుతుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తుంది. సాధారణ రోజుల్లో యథావిధిగా సాధారణ టికెట్ ధరలే ఉంటాయి. స్పెషల్ సర్వీసులకు టికెట్ ధరలను సవరించడం సంస్థలో అనవాయితీగా వస్తోంది’’ అని తెలిపారు.