ప్రజలకు TSSPDCL అలర్ట్
తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) మంగళవారం సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది.
రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో మూడు రోజులపాటు ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) మంగళవారం సేఫ్టీ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల్లో ఆకస్మిక మార్పుల కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఈదురు గాలుల కారణంగా నేలపై పడే విద్యుత్ తీగల వల్ల కరెంట్ షాక్ కి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నేలపై పడిన కరెంట్ వైర్లను తాకవద్దని TSSPDCL ప్రజలను కోరింది. అలాగే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేలకూలినట్లు గమనించినట్లయితే వెంటనే TSSPDCL ఉద్యోగులకి గానీ, అధికారులకు గానీ తెలియజేయాలని సూచించింది. విద్యుత్ లైన్లకు చిక్కుకున్న చెట్ల నుండి పడిపోయిన కొమ్మలను తీయవద్దని ప్రజలను కోరింది, ఇది మరింత ప్రమాదాలకు దారి తీస్తుంది అని హెచ్చరించింది.
విద్యుత్ స్తంభాన్ని తాకి వ్యక్తి మృతి...
హైదరాబాద్ దూద్‌బౌలికి చెందిన 40 ఏళ్ల ఫక్రు అనే వ్యక్తి బహదూర్ పురాలో వర్షం పడుతున్న సమయంలో కరెంటు స్తంభాన్ని పట్టుకుని రోడ్డుని దాటుతుండగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతను బాగా తాగి పడిపోయాడు అనుకున్నారు. కాసేపటి తర్వాత బహదూర్ పురా పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యుత్ షాక్ తో మరణించాడని నిర్ధారించారు. స్థంభానికి పవర్ ఆఫ్ చేశారు. ఫక్రూ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునున్నట్టు ఇన్‌స్పెక్టర్ ఆర్. రఘునాథ్ తెలిపారు.