జూపార్కులో సునామీ బసంత్ జిరాఫీ ఇక లేదు...
హైదరాబాద్ నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో 20 ఏళ్ల వయసున్న సునామీ బసంత్ జిరాఫీ మృతి చెందింది. జిరాఫీ కళేబరానికి జూ సిబ్బది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సునామీ బసంత్ జిరాఫీ అనారోగ్యంతో కన్నుమూసింది. 20 ఏళ్ల పాటు సందర్శకులకు కనువిందు చేసిన ఈ జిరాఫీ వృద్ధాప్యంతోపాటు అనారోగ్యంతో మరణించింది.
రంగురంగుల చారలతో ఎతైన జిరాఫీ అందమైన నడకతో జాపార్కు సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేది. 2004వ సంవత్సరంలో సునామీ విపత్తు సంభవించిన సమయంలో న్యూఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్కులో బసంత్ అనే మగ జిరాఫీ జన్మించింది. సునామీ రోజు జన్మించిన జిరాఫీకి సునామీ బసంత్ అని జూ అధికారులు నామకరణం చేశారు. 2009లో జూల మధ్య జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా అధికారులు ఈ జిరాఫీని హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తీసుకొచ్చారు.
సునామీ బసంత్ కు ఆర్థరైటిస్ సమస్య
సునామీ బసంత్ వెనుక భాగంలో ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతుండేది. గత రెండు సంవత్సరాల నుంచి జిరాఫీ కాళ్ల ఆర్థరైటీస్ తో చికిత్స చేశామని జూపార్కు పశువుల డాక్టర్ ఎంఏ.హకీమ్ * ‘ ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సునామీ బసంత్ జిరాఫీ మరణానంతరం నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్థుతం సన్నీ అనే మగ జిరాఫీ ఉందని డాక్టర్ హకీం చెప్పారు. వృద్ధాప్యం కారణంగా జూపార్కులో గతంలో ఓ అరుదైన తాబేలు మరణించింది.
జిరాఫీ కళేబరానికి పోస్టుమార్టం
జిరాఫీ కళేబరానికి పశువైద్య నిపుణులు పోస్టుమార్టం చేశారు. జిరాఫీ మృతికి అసలు కారణాన్ని నిర్ధారించడానికి వాటి నమూనాలను సేకరించి రాజేంద్రనగర్ లోని వెటర్నరీ కళాశాల, సీసీఎంబీ లాకోన్స్ కు పంపించారు.
జిరాఫీ కళేబరానికి పూలమాలలు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఐఎఫ్‌ఎస్ డైరెక్టర్ అండ్ క్యూరేటర్ డాక్టర్ సునీల్ ఎస్. హిరేమత్, జూ సిబ్బంది సంతాపం వ్యక్తం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిరాఫీ ఎన్‌క్లోజర్ వద్ద రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.సునామీ బసంత్ జూలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటని, అందమైన నడకతో పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షించిందని జూపార్కు క్యూరేటర్ డాక్టర్ సునీల్ చెప్పారు. జిరాఫీ మృతితో జూ ప్రధాన జంతువును కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.
Next Story