Urea Shortage | ‘యూరియాను చూడనోళ్లు కూడా విమర్శిస్తున్నారు’
x

Urea Shortage | ‘యూరియాను చూడనోళ్లు కూడా విమర్శిస్తున్నారు’

వర్షాలు, యూరియా సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.


తెలంగాణలో యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. యూరియా ఎక్కడ అందదో అని రాత్రిళ్లు సరఫరా కేంద్రాల దగ్గరే రైతులు పడుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూరియా కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధాలు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ చేతకానితనం, ముందుచూపు లేకపోవడం వల్లే ఇప్పుడు రైతులు ఇన్ని తిప్పలు పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు పదేపదే విమర్శలు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎవరికి తమ మద్దతు పలకాలి అన్న విషయాన్ని కూడా తెలంగాణ రైతులకు అందే ఎరువులతో ముడిపెట్టారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రం, కాంగ్రెస్ ఎవరైతే సెప్టెంబర్ 9 కల్లా 2లక్షల టన్నుల ఎరువు తెలంగాణకు తెస్తారో వారి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంపై సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుట్టిబుద్దెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు యూరియాను చూడని వాళ్లు కూడా వచ్చి తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చురకలంటించారు.

ప్రజలకు ఇబ్బంది రాకూడదు: తుమ్మల

తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు, రైతులను ఇబ్బంది పెడుతున్న యూరియా కొరత అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. భద్రాచలం దగ్గర గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుందని ఆయన అధికారులకు గుర్తు చేశారు. ఈ క్రమంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

యూరియాను త్వరగా ఇవ్వండి..

ఈ సందర్భంగానే తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను వీలైనంత త్వరగా అందించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ‘‘ఆగస్టు వాటా యూరియా తెలంగాణకు ఇవ్వాలి. అందులో కోతలేకుండా చూడాలి. రాష్ట్రంలో ఉన్న అత్యవసరాన్ని గుర్తించి యూరియాను వీలైనంత త్వరగా అందించండి. యూరియాను కనీసం చూడని వాళ్లు కూడా ఇప్పుడు వచ్చి విమర్వలు చేస్తున్నారు. పెద్దపెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలుకావొద్దు. నన్ను విమర్శించే వారు కేంద్రమంత్రి జేపీ నడ్డాను నేరుగా ప్రశ్నించవచ్చుగా? యూరియా సరఫరాపై అన్ని లెక్కలు అందిస్తున్నా. రామచందర్‌రావు అంటే నాకు గౌరవం. అబద్ధాలు చెప్పి బీజేపీ బాగు చేయాలనుకుంటే అది కలే అవుతుంది. అది సాధ్యం కాదు’’ అని తుమ్మల చెప్పుకొచ్చారు.

రామచందర్ వ్యాఖ్యలు సరికావు..

‘‘రైతులపై రాజకీయాలు చేస్తూ పార్టీని కాపాడుకోలేరు. పెంచుకోలేరు. రామచందర్ రావు వాస్తవాలను అంగీకరించాలి. యూరియా లెక్కలకు ఎప్పటికప్పుడు కేంద్రానికి అందిస్తున్నా. నిన్నగాక మొన్న వచ్చిన రామచందర్ రావు.. విమర్శలు చేయడం సరికాదు. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ వ్యవహరిస్తోంది. యూరియాపై బీజేపీ మొత్తం అసత్యప్రచారం చేస్తోంది. అంతపలుకుబడే ఉంటే కేంద్రం నుంచి యూరియాను తెప్పించొచ్చుగా రామచందర్‌రావు. ఆయనకు అంత పలుకుబడి ఉందని నేను అనుకోవట్లేదు. యూరియా సమస్య దేశవ్యాప్తంగా ఉంది. యూరియాను దాచుకుని మేం ఏం చేసుకుంటాం? ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. యూరియాపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడరు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మేం చేయాల్సినదంతా చేస్తున్నాం. కేంద్రం కూడా సహకరించాలి’’ అని ఆయన కోరారు.

Read More
Next Story