కేంద్రం పత్తి కొనుగోలు నియమాలు మార్చాలి: తుమ్మల
x

కేంద్రం పత్తి కొనుగోలు నియమాలు మార్చాలి: తుమ్మల

తేమ శాతం, ఎకరాకు కొనుగులు చేసే పత్తి పైన షరతులు ఎత్తి వేయాలని ఆయన cci ని కోరారు


మారిన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనల వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే పత్తి కొంటామనే నిబంధనను ఎత్తి వేయాలని, ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సీసీఐ సిఎండి కి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సూచించారు. ఈ సమయం లో నే జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ కొత్త నిబంధన వలన రైతులు తక్కువ ధరకు తమ పత్తిని అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదనతో వున్నారు. మద్దతు ధర Rs 8,100 వుండగా రైతులు పత్తి Rs 6,900 కే అమ్ముకుంటున్నారని అదిలాబాద్ జిల్లా, బరంపూర్ గ్రామం రైతు కే. ప్రతాప్ తెలిపారు. “సాధారణంగా ఎకరాకు 10 నుండి 11 క్వింటాల్ పత్తి పండుతుంది మా ప్రాంతం లో. రైతులు సీసీఐ కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. కలెక్టర్ ను కలిసిన అధికారులు కేంద్ర నిబంధనల పేరు చెప్తున్నారు. పైగా వర్షాలతో తేమ శాతం 16 వరకు ఉంటోంది. సాధారణంగా 8 నుండి 12 శాతం తేమ వుంటేనే సీసీఐ రైతుల దెగ్గర కొంటోంది,” అన్నారు.

ఇటీవల సీసీఐ ఏ జిల్లా లోని పత్తి ఉత్పత్తి రాష్ట్ర సరాసరి ఉత్పత్తికి 10 శాతం కంటే మించటానికి లేదని నిబంధన పెట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ షరతుకు లోబడి ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ చెప్పినట్టుగా 11.74 క్వింటాల్ ఎకరానికి కొనకుండా 7 క్వింటాల్ ల పత్తి కొంటాము అని నిర్ణయించింది. రాష్ట్రం లో అన్నీ జిల్లాల కలెక్టర్లు పంపిన సమాచారం ఆధారంగా రాష్ట్రం వైపునుండి ఈ సమాచారం సీసీఐ 2025-26 సంవత్సరానికి యివ్వడం జరిగింది.

ప్రస్తుతం వున్న వాతావరణ పరిస్థితి వలన పత్తి తేమ శాతం 12 నుండి 20 శాతం గా వుంది. కానీ సీసీఐ పత్తిని తేమ 8 నుండి 12 శాతం మద్యన వుంటేనే కొంటోంది. రాష్ట్రం లో ఎకరానికి సరాసరి పత్తి దిగుబడి 11.74 క్వింటాల్ వుంది అందుకు అనుగుణంగా నిబంధనలు ఇటీవలి చేసిన సవరణలు ముందు పరిస్థితి కి మార్చాలి. అలాగే తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్ వెల్ఫేర్ అసోసియేషన్ మిల్లులను వర్గీకరణ చేయడం వలన తలెత్తిన సమస్యలను పరిష్కరించి పత్తి సేకరణకు ఆటంకం లేకుండా చూడాలని యిప్పటికే మంత్రి తుమ్మల కోరిన విషయం తెలిసిందే.

జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై సీసీఐ సిఎండి లలిత్ కుమార్ గుప్తా తో ఫోన్ లో సంప్రదించిన మంత్రి తుమ్మల, “కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అవలంబిస్తున్న ఎల్1, ఎల్2, ఎల్3 అలాట్‌మెంట్ విధానం వలన కొనుగోళ్లు కొన్ని జిన్నింగ్ మిల్లులలో మాత్రమే జరుగుతున్నందున, అనేక జిన్నింగ్ మిల్లులు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల కారణంగా రైతులు మరియు మిల్లుదారులకు ఇబ్బందులు వున్నాయని,” తెలియచేసారు.

తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రెసిడెంట్, బొమ్మినేని రవీందర్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఉత్తరం రాస్తూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 2025-26 పంట కాలమునకు జాబ్ వర్క్ టెండర్ నియమాలలో కఠిన నిబంధనలతో మార్పులు చేయడం వలన కాటన్ జిన్నింగ్ ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది అని వాపోయారు. “దేశవ్యాప్తంగా పత్తి మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనలేదు. గత 2024-25 పంట కాలం లో సిసిఐ దేశవ్యాప్తంగా సేకరించిన 90 లక్షల బేళ్ళ లో 40 లక్షల బేళ్ళు తెలంగాణ రాష్ట్రం నుండి సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాటన్ టెక్నాలజీ మిషన్ ప్రమాణాల ప్రకారం గా రాష్ట్రంలోని 322 పత్తి మిల్లులను ఆధునీకరించుకొని పరిశ్రమల సామర్ధ్యమును, ఉత్పత్తి సామర్థ్యం కంటే రెండింతలుగా పెంపొందించుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మంత్రివర్యులు CCI MD రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని టెండర్లలో పాల్గొనాలని సమస్యలు ఏవైనా ఉత్పన్నమైన సమయంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు టెండర్లలో పాల్గొన్నాము,” అని రాశారు.

కపాస్ కిసాన్ యాప్ వలన తలెత్తుతున్న సమస్యలను లేవనెత్తుతూ, “పత్తి పంట చేతికి వచ్చే సమయములో కొత్తగా కపాస్ కిసాన్ యాప్ ను ప్రవేశపెట్టి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని నిర్దేశిస్తున్నందున చాలామంది రైతులకు అవగాహన లేక, స్మార్ట్ ఫోన్లు లేక మరియు స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు అనుకూలముగా అందుబాటులో ఉన్న మిల్లులు డిస్ప్లే కాకపోవడం వలన దూరప్రాంతాలలోని మిల్లులకు స్లాట్ బుకింగ్ జరగడం వలన ఇబ్బందులకు గురి అవుతున్నారు. అందుబాటులో ఉన్న జిన్నింగ్ మిల్లులకు పత్తిని తీసుకొని వచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఒకే మద్దతు ధర ఉన్నందున పత్తి కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తూ మిల్లుల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు,” అని చెబుతూ ఆయన సమస్యలను పరిష్కరించి రాష్ట్రంలోని అన్ని జిన్నింగ్ మిల్లులను నడిపే విధముగా చర్యలు తీసుకొని పత్తి మిల్లులను కాపాడాలని మంత్రిని కోరిన విషయం తెలిసిందే.

దీనిపై రైతు స్వరాజ్య వేదిక నాయకులు రవి కన్నెగంటి కేంద్రం తీసుకు వచ్చిన కాపాస్ కిసాన్ యాప్ వలన రైతులు యిబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. “రైతులు అందరికీ స్మార్ట్ ఫోన్ లు వుండవు. పత్తి అమ్మకానికి వాళ్ళు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఆ సమయానికి పత్తి తీసుకుని వెళ్లలేకపోతే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయలేక రైతులు వ్యాపారస్థులకు అమ్ముకుంటున్నారు. యిక కౌలు రైతుల ను అసలు ఆ ఆప్ లెక్కలోకి కూడా తీసుకోలేదు. రాష్ట్రం లో పత్తి వర్షాల వలన దెబ్బతిని వుంది. కేంద్రం యిటీవల పత్తి దిగుమతుల పైన అన్ని ఆంక్షలు ఎత్తివేసింది. అమెరికా ఒత్తిడికి లొంగి ఈ చర్యలు చేపట్టింది. ఎంత పత్తి దిగుమతి అవుతోంది అనే డాటా మాత్రం ప్రభుత్వం గోప్యంగా వుంచుతోంది. ప్రపంచం లో పత్తి ధరలు మన దేశం లోని మద్దతు ధర కంటే తక్కువ వుంది,” అని చెప్పారు.

Read More
Next Story