
రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
మరొకరి పరిస్థితి విషమం
సికింద్రాబాద్ బొల్లారం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు యువకులను అదే సమయంలో వచ్చిన రైలు వెనక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక యువకుడు తీవ్రగాయాల పాలయ్యాడు. కొన ఊపిరితో ఉన్న యువకుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మచ్చబొల్లారం వాసులుగా గుర్తించారు. మృతులు కార్తిక్ ,మల్లి ఖార్జున్ కూలీలుగా పని చేస్తున్నట్టు రైల్వేపోలీసులు తెలిపారు.
తిరుపతి అకోలా ఎక్స్ ప్రెస్ రైలు ముగ్గురు యువకులను ఢీ కొట్టినట్టు డిప్యూటి స్టేషన్ సూపరింటెండెంట్ డి.జకోబ్ సుదర్శన్ కు శనివారం సమాచారమందింది. వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలికి చేరుకున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్లవద్దని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ యువత పెడ చెవిన పెట్టడంతో ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి.