Telangana Talli row|తెలంగాణాలో మంటలు మండిస్తున్న ‘ఇద్దరు తల్లులు’
x
BRS Telangana Talli and Congress Telangana Talli

Telangana Talli row|తెలంగాణాలో మంటలు మండిస్తున్న ‘ఇద్దరు తల్లులు’

కొద్దిరోజులుగా తల్లుల విషయంలో వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నా మూడు రోజుల నుండి బాగా ఎక్కువైపోయింది.


ఇద్దరుతల్లుల వివాదం తెలంగాణాలో మంటలు మండిస్తోంది. కొద్దిరోజులుగా తల్లుల విషయంలో వివాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నా మూడు రోజుల నుండి బాగా ఎక్కువైపోయింది. ఇంతకీ తెలంగాణా(Telangana Talli Statue)లో మంటలు మండిస్తున్న ఇద్దరుతల్లలు ఎవరంటే తెలంగాణా తల్లులే. నిజానికి తెలంగాణా తల్లంటే ఒకరే ఉండాలి కాని ప్రస్తుత రాజకీయ వివాదాల్లో ఇరుకుని ఒకతల్లేమో బీఆర్ఎస్ తల్లయిపోగా మరో తల్లేమో కాంగ్రెస్ తల్లయిపోయింది. బీఆర్ఎస్ హయాంలో రూపొందిన తెలంగాణాతల్లి విగ్రహం బీఆర్ఎస్(BRS Thalli) తల్లి అయితే, ఈనెల 9వ తేదీన ఆవిష్కరణ అవబోయే తెలంగాణాతల్లి కాంగ్రెస్ పార్టీ తల్లి(Congress Party Talli) అయిపోయింది. అందుకనే ఇద్దరు తల్లుల విషయంలో ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రేగుతున్నాయి.

ఈనెల 9వ తేదీన సచివాలయంలో 20 అడుగుల ఎత్తయిన తెలంగాణాతల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి(Revanth) ఆవిష్కరించబోతున్నారు. రేవంత్ ఆవిష్కరించబోతున్న తెలంగాణాతల్లి విగ్రహం ఫోటోలను ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం విడుదలచేసింది. ఎప్పుడైతే విగ్రహం ఫొటోలు రిలీజయ్యాయో వెంటనే బీఆర్ఎస్ వైపునుండి గోల మొదలైపోయింది. రేవంత్ ఆవిష్కరణ చేయబోయేది తెలంగాణాతల్లి విగ్రహంకాదని కాంగ్రెస్ తల్లంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పెద్దఎత్తున ధ్వజమెత్తారు. కొంతకాలంగా ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే తెలంగాణాతల్లి విగ్రహంపై కేటీఆర్ తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇపుడు ఆవిష్కరిస్తున్న తెలంగాణాతల్లి విగ్రహాన్ని తీసేస్తామని చేసిన ప్రకటనతో మంటలు రాజుకున్నాయి. గతంలో తాము ఏర్పాటుచేసిన తెలంగాణాతల్లే అసలైన తెలంగాణాతల్లి అని కేటీఆర్ చెప్పటాన్ని మంత్రులు కొండాసురేఖ(KondaSurekha), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh Kumar Goud) తదిరులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

తెలంగాణా ఉద్యమసమయంలో మేథావులు, కవులు, శిల్పులు, కళాకారులతో కేసీఆర్(KCR) చర్చించి రూపొందించినదే అసలైన తెలంగాణాతల్లి అని కేటీఆర్ చెప్పటాన్ని మంత్రులు, అధికారపార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇందిరాగాంధి ప్రధానమంత్రిగా ఉన్నపుడు ఏర్పాటుచేసిన భరతమాత(Bharata Matha) రూపాన్ని తర్వాత ప్రధానులైన వాళ్ళు ఎవరైనా మార్చారా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. తమహయాంలో రూపొందిన తెలంగాణాతల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఏమొచ్చిందని వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడుతున్నారు. రాజకీయ ఉద్దేశ్యంతో కాంగ్రెస్ ఏర్పాటుచేస్తున్న విగ్రహాన్ని తాము అధికారంలోకి రాగానే తీసేస్తామని కేటీఆర్ స్పష్టంగా ప్రకటించారు. మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ మాట్లాడుతు రేవంత్ తయారుచేయించిన తెలంగాణాతల్లి ముమ్మాటికీ కాంగ్రెస్ చెయ్యిగుర్తు తల్లే అన్నారు. ఎంఎల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతు బతుకమ్మ(Bathukamma) మీద రేవంత్ కు అంతకోపం ఎందుకని నిలదీశారు. తమ హయాంలో రూపొందిన తెలంగాణాతల్లి విగ్రహం చేతిలోని బతుకమ్మను రేవంత్ తీయించేయటాన్ని దేశపతి తప్పుపట్టారు.

అభయహస్తంతో ఉన్న కొత్త తెలంగాణాతల్లి విగ్రహం ముమ్మాటికీ కాంగ్రెస్ తల్లే అవుతుందని బీఆర్ఎస్ అధికారప్రతినిధి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. సీనియర్ నేత దాసోజుశ్రవణ్ మాట్లాడుతు రేవంత్ తయారుచేయించిన కొత్త తెలంగాణాతల్లి విగ్రహం తెలంగాణా ఉద్యమచిహ్నాలపై దాడిచేయటమే అని మండిపడ్డారు. మనదేశంపై విదేశీయులు దాడులుచేసి విగ్రహాలను ధ్వంసంచేసినట్లు ఇపుడు రేవంత్ అదే పంథాలో వెళుతున్నారని దాసోజు ఆరోపించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తే రేవంత్ ను తెలంగాణా ప్రజలు ఎప్పటికీ క్షమించరని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ హెచ్చరించారు. తాను పార్టీలు మారినట్లే తెలంగాణాతల్లి విగ్రహాలను కూడా మార్చేయటం రేవంత్ కు తగదని గౌడ్ అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఇదే విషయమై మంత్రి కొండాసురేఖ మాట్లాడుతు బీఆర్ఎస్ హయాంలో తయారైన తెలంగాణాతల్లి విగ్రహం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత(Kalavakuntla Kavitha) రూపంలో తయారుచేయించినట్లు ఆరోపించారు. అప్పట్లో కేసీఆర్ తయారుచేయించిన తెలంగాణాతల్లి విగ్రహం సంపన్నులతల్లిగా ఉండేదన్నారు. పట్టుచీర కట్టుకుని, మెడలో బంగారు నగలువేసుకుని, నడుముకు బంగారువడ్డాణం పెట్టుకుని రెండుచేతులకు బంగారుగాజులు వేసుకుని ఒకచేతిలో బతుకమ్మ, మరోచేతిలో మొక్కజొన్నపొత్తును పెట్టుకుని ఉండేదని గుర్తుచేశారు. తమ హయాంలో తయారైన తెలంగాణాతల్లి విగ్రహం సామాన్య మహిళకు ప్రతిరూపంగా ఉందన్నారు. అప్పట్లో తెలంగాణాతల్లి విగ్రహాన్ని చూడగానే అందరికీ తన కూతురు కవిత గుర్తుకురావాలనే కేసీఆర్ అలా చేయించినట్లు మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మాట్లాడుతు రేవంత్ ఆవిష్కరించబోయే తెలంగాణాతల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లి అయితే మరి కేసీఆర్ ఆవిష్కరించింది బీఆర్ఎస్ తల్లా ? అని ఎదురు ప్రశ్నించారు. తొందరలో ఆవిష్కరించబోయే తెలంగాణాతల్లి విగ్రహం సాధారణ మహిళను ప్రతిబంబించటంతో పాటు సబ్బండవర్గాలకు ప్రతిరూపంగా ఉంటుందని మహేష్ గౌడ్ చెప్పారు. అధికార, ప్రతిపక్షాల నేతల మాటల మంటలు చూస్తుంటే 9వ తేదీన విగ్రహం ఆవిష్కరణ సమయానికి ఈ మంటలు ఇంకా ఏ స్ధాయికి చేరుకుంటాయో అనే ఆందోళన మామూలు జనాల్లో పెరిగిపోతోంది.

ఇద్దరు తెలంగాణాతల్లులకు మధ్య తేడా ఏమిటి ?

ఇద్దరు తెలంగాణా తల్లులకు మధ్య తేడాలు ఏమిటో చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో తయారైన తెలంగాణాతల్లి విగ్రహం జరీ ఉన్న ఎర్రటి పట్టుచీర ధరించేది. తలపై బంగారు కిరీటం, ఎడమచేతిలో బతుకమ్మ, కుడిచేతిలో మొక్కజొన్నపొత్తుండేది, కాలివేళ్ళకు వెండిమెట్టెలు, నడుముకు బంగారు వడ్డాణం, మెడలో బంగారు కంటె, గొలుసులు, రెండుచేతులకు బంగారు గాజులుండేవి. ఇక 9వ తేదీన ఆవిష్కరించబోయే తెలంగాణాతల్లి పసుపు అంచుతో పచ్చటి నేతచీర ధరించింది. ఎడమచేతిలో బతుకమ్మకు బదులు మొక్కజొన్న పొత్తు, సజ్జలు, వరి, జొన్న కంకులున్నాయి. నెత్తిన కిరీటంలేదు. మొడలో మూడు బంగారు గొలుసులున్నాయి. రెండుచేతులకు పచ్చరంగు మట్టిగాజులున్నాయి. కుడిచెయ్యి అభయహస్తం ముద్ర కనబడుతుంది. నుదుటన ఎర్రటి పెద్ద బొట్టు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మొత్తానికి ఇద్దరు తెలంగాణాతల్లులకు స్పష్టమైన తేడాలు ఉన్నాయి. విగ్రహాలు, రాజకీయాలను పక్కనపెట్టేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును వదిలేసి విగ్రహాల గోలేంటని జనాలు విస్తుపోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story